టీఆర్‌ఎస్ పార్టీకి విశ్వసనీయత లేదని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షడు కిషన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ నిర్మాణం కోసం బీజేపీ, టీడీపీలకు ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.
గద్వాల/కేశంపేట, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ పార్టీకి విశ్వసనీయత లేదని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షడు కిషన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ నిర్మాణం కోసం బీజేపీ, టీడీపీలకు ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం ఆయన గద్వాల వైఎస్సార్ చౌరస్తా, షాద్‌నగర్ నియోజకవర్గంలోని కేశంపేటలో ఎన్నికల ప్రచారసభలో పాల్గొని, మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరూ ఇవ్వలేదని, అలాగే ఎవరూ తేలేదని ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, వందలాది మంది విద్యార్థుల బలిదానాల వల్లే వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి విశ్వసనీయత కలిగిన బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వాలని కోరారు. తెలంగాణను బంగారు రాష్ట్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, సాగునీటి వనరులను పెంచి సస్యశ్యామలం చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు. గద్వాల ప్రాంతానికి మాజీ మంత్రి డీకే అరుణ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లుగా యూపీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.
దేశాభివృద్ధి కేవలం నరేంద్రమోడీతోనే సాధ్యమన్నారు. ఆయన ప్రధాని అయితే దేశంలో ఆర్థిక సంక్షోభంతో పాటు రాజకీయ సంక్షోభం కూడా కనుమరుగవుతోందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం త్వరగా చేపట్టాలన్నా, జిల్లాలో వలసలు పూర్తిగా తగ్గాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. 67ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో 60 శాతం జనాభా ఉన్న బీసీలు ఎవరూ నేటికి ప్రధాని కాలేదన్నారు. దేశమంతటా మోడీ ప్రభంజనం కొనసాగుతోందని, తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో కూడా మోడీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
సినీనటుడు సురేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో దేశం, రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. 60 ఏళ్ల ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థి నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వలసలు నివారించేందుకు శంషాబాద్ నుంచి కర్నూలు వరకు పరిశ్రమలను స్థాపించి, లక్షమంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు. హస్తం గుర్తుకు ఓటెయ్యమని ఎవరైనా అడిగితే గ్రామాల నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. చాయ్ వాలా మోడీ ప్రధాని అయితే సామాన్య ప్రజల జీవితాలలో బంగారు కాంతులు వెలుగుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఓటమి భయంతో ఇతర పార్టీ నాయకులపై గుండాగిరి చేస్తున్నారని మండిపడ్డారు. ఆయా బహిరంగసభల్లో సినీ నటుడు రాంకీ, నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి బక్కని నర్సింహులు, బీజేపీ నేతలు ఆచారి, వీఎల్ కేశవ్‌రెడ్డి, రాజశేఖరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.