దారికి రాని బీజేపీ ‘రెబెల్స్’ | BJP 'Rebels' not responding | Sakshi
Sakshi News home page

దారికి రాని బీజేపీ ‘రెబెల్స్’

Apr 12 2014 3:16 AM | Updated on Aug 14 2018 4:21 PM

దారికి రాని బీజేపీ ‘రెబెల్స్’ - Sakshi

దారికి రాని బీజేపీ ‘రెబెల్స్’

పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించిన పలు స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేసిన బీజేపీ రెబెల్ అభ్యర్థులు పార్టీ బుజ్జగింపులను ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. పైగా..

సాక్షి, హైదరాబాద్: పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించిన పలు స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేసిన బీజేపీ రెబెల్ అభ్యర్థులు పార్టీ బుజ్జగింపులను ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. పైగా.. శివారులోని 12 అసెంబ్లీ స్థానాలు టీడీపీకే వదిలేసి తమను నామినేషన్లు ఉపసంహరించుకోమనడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయి తే, ఆయా రెబెల్ నేతలతో శనివారం మరోసారి చ ర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని బీజేపీ  తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దారికిరాని వారిపై క్రమశిక్షణ కొరడా తప్పదని హెచ్చరించారు. వివరాలు..
 
 ఎన్నికల పొత్తుల్లో భాగంగా బీజేపీకి బలమున్న సూర్యాపేట, నారాయణ్‌పేట, పెద్దపల్లి, పటాన్‌చెరు, మేడ్చల్, ఎల్‌బీనగర్ తదితర స్థానాలు టీడీపీకి దక్కాయి. దీంతో కంగుతిన్న బీజేపీ నేతలు రెబెల్ అవతారమెత్తి ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు.  
 
   మరోపక్క నామినేషన్ల గడువు శనివారంతో ముగుస్తున్న క్రమంలో వీరిని ఎలాగైనా ఒప్పించి నామినేషన్లను ఉపసంహరించేందుకు బీజేపీ నాయకత్వం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో నామినేషన్లను వెనక్కి తీసుకోవాలని కోరింది. అయితే, ఏ ఒక్కరూ పార్టీ ఆదేశాలను పాటించలేదు. దీనికితోడు టీడీపీ కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తామని భావిస్తున్న చోట్ల నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు వారు సిద్ధంగా లేరు.
 
  ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కిషన్‌రెడ్డి శుక్రవారం సూర్యాపేట నేతలతో స్వయంగా మాట్లాడారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని కోరారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా నేతలతోనూ భేటీ అయి పార్టీ విధానాన్ని వివరించారు. అయినప్పటికీ దారికి రాని నేతలు ‘మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్, శివారులోని 12 అసెంబ్లీ స్థానాలు టీడీపీకే వదిలేసి.. మమ్మల్ని నామినేషన్లు ఉపసంహరించుకోమనడం ఏంటి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అదేసమయంలో రాజేంద్రనగర్, మేడ్చల్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం స్థానాల్లో కొనసాగుతామనీ పేర్కొన్నారు.
 
 దీంతో ఆయా నేతలతో శనివారం మరోసారి చర్చించాలని కిషన్‌రెడ్డి నిర్ణయించారు. పార్టీ ఆదేశాల మేరకు టీడీపీతో పొత్తు కుదిరినందున బీజేపీ నేతలు నామినేషన్లు వేయడం సరికాదని ఆయన ‘సాక్షి’కి చెప్పారు. శనివారం ఉపసంహరించుకుంటారని భావిస్తున్నానని, అలా చేయని వారిపై క్రమశిక్షణ కొరడా తప్పదని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement