ఎన్నికలకు మరో పన్నెండు రోజుల వ్యవధి మిగిలింది. ఇప్పటికే ప్రధాన పార్టీల ప్రచారం హోరెత్తింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎన్నికలకు మరో పన్నెండు రోజుల వ్యవధి మిగిలింది. ఇప్పటికే ప్రధాన పార్టీల ప్రచారం హోరెత్తింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా పల్లెపల్లెనా పర్యటిస్తున్నారు. ప్రచార రథాలతో పాటు కొన్నిచోట్ల కాలినడకన ఇంటింటికీ గడప గడపకు తిరిగి ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
అభ్యర్థుల తరఫున సతీమణులు, వారి కుటుంబీకులు తమవంతుగా ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. అతిరథ నేతల పర్యటనలతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల్లో హుషారు కనిపిస్తోంది. ఉద్య మ కేంద్రమైన జిల్లా కావటంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ సందర్భంలో జరుగుతున్న ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తెలంగాణ ఓటును తమ ఖాతాలో వేసుకోవాలని ప్రధాన పార్టీలు ఇదే జిల్లా వేదికగా సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుతుండటంతో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ కేంద్రంగా ఎన్నికల శంఖారావం పూరిస్తే... పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీ సైతం ఇక్కణ్నుంచే ప్రచారం ప్రారంభించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కరీంనగర్ పర్యటనకు రావటం, మొదటిసారిగా తెలంగాణపై తన సందేశం వినిపించటం పార్టీ అభ్యర్థుల్లో ఉత్తేజం నింపినట్లయింది. తెలంగాణ బిల్లు ఆమోదం పొందటంతో టీఆర్‌ఎస్ పాత్ర సున్నా.. అంటూ సోనియాగాంధీ రాష్ట్ర ఏర్పాటు ఘనతను ఓటుబ్యాంకుగా మలుచుకునే ప్రచారాస్త్రం సంధించారు.
తమ పాత్ర ఉంటే సంపూర్ణ తెలంగాణ వచ్చేది.. అంటూ మరుసటి రోజునే హుస్నాబాద్ బహిరంగ సభలో కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. వారం రోజుల వ్యవధిలోనే ఆయన రెండుసార్లు జిల్లాలో ప్రచార సభల్లో పాల్గొన్నారు. వచ్చే వారంలో గోదావరిఖనిలో జరిగే బహిరంగ సభకు కేసీఆర్ హాజరవనున్నారు.
మరోవైపు బీజేపీ సైతం జిల్లాలో ప్రచార హంగామాకు రంగం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఈ నెల 22న జిల్లాలో ప్రచార పర్యటనకు రానున్నారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నేతల పర్యటనలతో పార్టీ శ్రేణుల్లో హుషారు వస్తుందని.. ఓటర్ల దృష్టిని సైతం ఆకర్షిస్తుందని ఆయ పార్టీల అభ్యర్థులు ఎవరికివారుగా అంచనాలు వేసుకుంటున్నారు.
మరోవైపు తొలిసారి బరిలో నిలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు అన్ని నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మహానేత వైఎస్ అమలు చేసి చూపించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను గుర్తు చేయటంతో పాటు అప్పటి లబ్ధిదారులను.. వైఎస్ అభిమానులను ఆకట్టుకునేందుకు పల్లెపల్లెనా పర్యటిస్తున్నారు.