వారిది విభజన సిద్ధాంతం | Theirs is the doctrine of separation | Sakshi
Sakshi News home page

వారిది విభజన సిద్ధాంతం

Apr 15 2014 2:04 AM | Updated on Mar 29 2019 9:24 PM

వారిది విభజన సిద్ధాంతం - Sakshi

వారిది విభజన సిద్ధాంతం

అతివాద భావజాలమున్న ఆర్‌ఎస్‌ఎస్ చెప్పినట్లు బీజేపీ ఆడుతోందని, వారిది సమాజాన్ని విభజించే సిద్ధాంతమని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆరోపించారు.

ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలపై సోనియా నిప్పులు

 మొరాదాబాద్(యూపీ)/పవోటా(రాజస్థాన్): అతివాద భావజాలమున్న ఆర్‌ఎస్‌ఎస్ చెప్పినట్లు బీజేపీ ఆడుతోందని, వారిది సమాజాన్ని విభజించే సిద్ధాంతమని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆరోపించారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలను రెండు పూర్తి భిన్నమైన సిద్ధాంతాల మధ్య జరుగుతున్న పోరాటంగా ఆమె అభివర్ణించారు. సోమవారం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లో సోనియాగాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొరాదాబాద్‌లో ప్రచారం సందర్భంగా ముస్లింలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు సోనియాగాంధీ. మైనార్టీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, జాతీయ వక్ఫ్ అభివృద్ధి కార్పొరేషన్ లాంటి చారిత్రక నిర్ణయాలతో ముస్లిం మహిళల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు.మహాత్మా గాంధీ, మౌలానా ఆజాద్ మొదలైన వారి అడుగు జాడల్లో కాంగ్రెస్ నడుస్తుంటే.. అతివాద భావజాలం ఉన్న సంస్థ చెప్పినట్టు బీజేపీ పని చేస్తోందన్నారు. ఎన్నో ఏళ్లుగా విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి తాము పని చేస్తుంటే.. బీజేపీ వాటన్నిటికీ తిలోదకాలు ఇస్తోందని మండిపడ్డారు.

సమైక్యత పేరుతో సంకుచిత సిద్ధాంతాలను దేశంపై రుద్దేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేశ భవిత మారుస్తానన్న మోడీ ప్రకటనలపై సోనియా స్పందిస్తూ... కొన్ని రోజుల్లో దేశ భవిష్యత్తును మార్చడానికి ఆయన దగ్గర ఏమైనా మంత్రదండం ఉందా అని ఎద్దేవా చేశారు. దేశానికి కావలసిన స్థిరమైన, సమర్థవంతమైన పాలన అందించే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పారు. యూపీలోని సమాజ్‌వాదీ పార్టీ సర్కారుపైనా ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేంద్రం ఇస్తున్న నిధులను యూపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలందరికీ ఆరోగ్య హక్కు కల్పిస్తామని, యువత సులభంగా ఉపాధి పొందేలా శిక్షణ అందిస్తామని సోనియా చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement