బెల్లు తప్ప అన్నీ మోగుతున్న 'సైకిల్' | TDP in dolldrums in Telangana | Sakshi
Sakshi News home page

బెల్లు తప్ప అన్నీ మోగుతున్న 'సైకిల్'

Apr 15 2014 2:52 PM | Updated on Aug 14 2018 4:21 PM

బెల్లు తప్ప అన్నీ మోగుతున్న 'సైకిల్' - Sakshi

బెల్లు తప్ప అన్నీ మోగుతున్న 'సైకిల్'

తెలుగుదేశం అధినేత ప్రసంగాల పట్ల జనం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇది ఆ పార్టీ నేతలకు, క్యాడర్ కు చెమటలు పట్టిస్తోంది.

తెలంగాణలో సైకిల్ మూలనబడిపోతోందా? సైకిల్ సారధికి చుక్కలు కనిపిస్తున్నాయా? తెలుగుదేశం అధినేత ప్రసంగాల పట్ల జనం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇది ఆ పార్టీ నేతలకు, క్యాడర్ కు చెమటలు పట్టిస్తోంది. ఆయన సభలకు కొద్దిమంది వీరాభిమానుల్ని వదిలేస్తే జనస్పందన కరువవుతోందన్న రిపోర్టులు వస్తూండటం ఆ పార్టీని కలవరపెడుతోంది.


పార్టీ కేడర్‌లో జోష్ పుట్టించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌లో రోడ్ షో చేపట్టారు. బంజారాహిల్స్‌లోని తన ఇంటి నుంచి సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బాలంరాయి, కంటోన్మెంట్‌ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి, బోడుప్పల్, ఎల్బీ నగర్, మేడ్చల్‌ మీదుగా పర్యటించిన చంద్రబాబుకు... పెద్దగా జనస్పందన లకనిపించలేదు.  ప్రజలు కూర్చోవడానికి వేసిన కుర్చీల్లో చాలా వరకు ఖాళీగా కనిపించగా... వచ్చిన జనంలోనూ చాలా మంది సభ పూర్తయేంతవరకు కూడా ఉండకుండా తిరుగుముఖం పట్టారు.


చాలా నియోజకవర్గాల్లో పార్టీ సీనియర్ కార్యకర్తలే చంద్రబాబుకు హ్యాండిచ్చారు. ఎల్బీ నగర్ అసెంబ్లీ టికెట్‌ కృష్ణయ్యకు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న టీడీపీ నాయకులు సామ రంగారెడ్డి, కృష్ణప్రసాద్ సహా ఐదుగురు కార్పొరేటర్లు బాబు సభకు డుమ్మా కొట్టారు.


ఇటు టీడీపీ, బిజెపి పొత్తు కూడా పొడిచేలా కనిపించడం లేదని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. పలు చోట్ల బిజెపి, టీడీపీ కార్యకర్తలు కలిసి పనిచేయడం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో భాగ్యనగరం, రంగారెడ్డిలో బిజెపితో కలయిక వల్ల ఎలాంటి బెనిఫిట్ లేదని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. మొత్తం మీద తెలుగుదేశం ఖాతాలో తెలంగాణ క్రెడిట్ అకౌంట్ కన్నా డెబిట్ ఎకౌంట్ లో పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కార్యకర్తలే అంగీకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement