
నా సభలకు మీరొద్దు బాబూ!
బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీకి ఉన్న ప్రజాదరణను తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు గట్టి షాక్ తగిలింది.
చంద్రబాబుకు మోడీ ఝలక్ .... హైదరాబాద్ సభకే రావాలని సూచన
- నిజామాబాద్, కరీంనగర్,మహబూబ్‌నగర్ సభలు బీజేపీవని చురక
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు అన్ని సభలకూ రావాలని ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీకి ఉన్న ప్రజాదరణను తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు గట్టి షాక్ తగిలింది. తెలంగాణలో బీజేపీ నిర్వహించే మోడీ సభల్లో పాల్గొని, లబ్ధి పొందాలనుకున్న చంద్రబాబుకు.. స్వయంగా నరేంద్ర మోడీయే ఝలక్ ఇచ్చారు. తాము నిర్వహించే నాలుగు బహిరంగ సభల్లో.. కేవలం ఒక్కదానిలోనే పాల్గొనేందుకు చంద్రబాబుకు అవకాశమిచ్చారు. అదే జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ను మాత్రం అన్ని సభలకూ రావాల్సిందిగా బీజేపీ ఆహ్వానించడం గమనార్హం.
బీజేపీ-టీడీపీ పొత్తు వ్యవహారంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు కమలనాథులను తీవ్ర చికాకుకు గురిచేసింది. మొన్నటి వరకు తెలంగాణలో, ఇప్పు డు సీమాంధ్రలో బాబు ఏకంగా బీజేపీ వ్యవహారాలను కూడా శాసించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సభల విషయంలోనూ కలగజేసుకునే ప్రయత్నం చేసి, విఫలమయ్యారు. ఈ నెల 22న మోడీ తెలంగాణలో నాలుగు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు.
ఆ రోజు మధ్యాహ్నం నిజామాబాద్‌లో తొలి సభ జరుగుతుంది. తర్వాత రెండు గంటల వ్యవధితో వరుసగా కరీంనగర్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌ల్లో సభలు జరుగుతాయి. ఈ నాలుగింటిలోనూ పాల్గొనేందుకు చంద్రబాబు సిద్ధమై.. మోడీకి సమాచారం అందించారు. ఈ సభల్లో కలిసి పాల్గొంటే ఇరు పార్టీలకూ మేలు కలుగుతుందని పేర్కొన్నారు. కానీ ఈ ప్రతిపాదనను మోడీ తిరస్కరించారు.
మొదటి మూడు సభలు పూర్తిగా బీజేపీ సభలని... ఒక హైదరాబాద్ సభ మాత్రమే ఎన్డీయే సభ అని, అందులో మాత్రమే పాల్గొనాలని చంద్రబాబుకు సూచించారు.దీంతో బాబుకు నిరాశ తప్పలేదు. అయితే పవన్‌కల్యాణ్‌ను మాత్రం నాలుగు సభలకూ రావాల్సిందిగా బీజేపీ ఆహ్వానించింది. ఆయన అన్నిచోట్లా పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. దీనిపై శనివారం పార్టీ నేతలు పవన్ ఇంట్లో ఆయనతో భేటీ అయి చర్చించారు. పవన్ హైదరాబాద్ సభలో మాత్రమే పాల్గొంటానని చెప్పినట్లు వారు పేర్కొన్నారు.
మోడీ సభకు మైదానమే కరవు !
నగరంలో మోడీ సభ ఇప్పుడు కమలనాథులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఎన్నికల కమిషన్ నిబంధనలతో ఇప్పటికే పరేడ్ మైదానం, ఎల్బీస్టేడియంలు దక్కకపోగా, తాజాగా నిజాం కళాశాల మైదానంలోనూ అనుమతి రాలేదు. దీంతో సభను ఎక్కడ ఏర్పాటు చేయాలో అర్థం కాక శనివారం పార్టీ నేతలు శివారు ప్రాంతాల్లో అనువైన స్థలాలున్నాయేమో తెలుసుకునే పనిలోపడ్డారు. తొలుత జింఖానా అనుకోగా.. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు మైదానం ఇచ్చేందుకు రక్షణశాఖ అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.
వెంటనే ఎల్బీస్టేడియం కోసం ప్రయత్నించగా అక్కడా అనుమతి రాకపోవడంతో ముందుజాగ్రత్త చర్యగా నిజాం కళాశాల మైదానం, ఎగ్జిబిషన్ మైదానాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిల్లో ఏదో ఓ దాన్ని ఎంపిక చేయాలని భావించారు. కానీ వాటిని కూడా ఇవ్వడం సాధ్యం కాదని శనివారం సమాచారం అందడంతో పార్టీ నేతల్లో టెన్షన్ పెరిగిపోయింది. జనం భారీగా హాజరవుతారని భావిస్తున్నందున అనువైన మైదానం కోసం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని, శివారు ప్రాంతాల్లో వెదకాలని నిర్ణయించుకున్నారు.
బీజేపీ అగ్రనేతల పర్యటన ఖరారు
బీజేపీ అగ్రనేతల ప్రచార షెడ్యూల్‌ను పార్టీ ఖరారు చేసింది. ఈనెల 23న బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌గడ్కారీ రానున్నారు. అయితే ఆయన ఎక్కడ ప్రచారం చేయాలనేది ఆదివారం నిర్ణయించనున్నారు. అలాగే 24నగోవా ముఖ్యమంత్రి మనోహర్ కారికర్ హైదరాబాద్ నగరంలో ప్రచారం చేయనున్నారు. 24తేదీనే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రవిశంకర్ ప్రసాద్ నగరంలో న్యాయవాదుల సదస్సులో పాల్గొంటారు. 25న సుష్మాస్వరాజ్ రానున్నారు. ఆమె వరంగల్, మెదక్, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. 26న బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ వరంగల్, కరీంనగర్, సికింద్రాబాద్ ప్రచారం చేయనున్నారు.