ఓట్ల లెక్కింపూ మే 7 తరువాతే! | local body elections results after may7th! | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపూ మే 7 తరువాతే!

Mar 29 2014 1:31 AM | Updated on Sep 2 2018 5:20 PM

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాతే వెల్లడించాలన్న ఆదేశాలపై మరింత స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం సుప్రీంకోర్టును కోరింది.

సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాతే వెల్లడించాలన్న ఆదేశాలపై మరింత స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం సుప్రీంకోర్టును కోరింది. ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది మనోజ్ సక్సేనా ఈ విషయాన్ని కోర్టుముందు ప్రస్తావిస్తూ ‘మేం మధ్యంతర దరఖాస్తులో ఏప్రిల్ 6, ఏప్రిల్ 11 తేదీల్లో పోలింగ్ నిర్వహిస్తామని, ఏప్రిల్ 13న కౌంటింగ్ నిర్వహిస్తామని విన్నవించాం. అయితే కోర్టు మే 7 తరువాతే ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది. కానీ ఓట్ల లెక్కింపు గురించి ఉత్తర్వుల్లో ప్రస్తావించలేదు. ఏప్రిల్ 13న కౌంటింగ్ నిర్వహించవచ్చా’ అని అడగ్గా.. న్యాయమూర్తులు ‘మేం చెప్పాల్సిందంతా నిన్నటి ఉత్తర్వుల్లోనే చెప్పాం. ఈ అంశంలో అదే తుది ఉత్తర్వు’ అని పేర్కొన్నారు.

 

దీంతో సక్సేనా ‘ఏప్రిల్ 11 నుంచి మే 7 వరకు బ్యాలెట్ బాక్సులను కాపాడుకునేందుకు 12 నుంచి 15 బెటాలియన్ల భద్రతా సిబ్బంది అవసరమవుతారు’ అని విన్నవించగా.. ‘నిన్నటి ఉత్తర్వులే వర్తిస్తాయి’ అని కోర్టు స్పష్టంచేసింది. ఇదిలా ఉండగా కౌంటింగ్ ఎప్పుడు ఉండవచ్చని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది మనోజ్ సక్సేనాను ‘సాక్షి’ అడగ్గా, ‘కౌంటింగ్ సహా ఫలితాల వెల్లడి ప్రక్రియ మే 7 తరువాతే ఉంటుంది’ అని వివరించారు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement