సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో గట్టి నిఘా ఏర్పాటుచేస్తున్నట్లు చేవెళ్ల నియోజకవర్గం ఎన్నికల ఇన్‌చార్జి, విజయనగరం అడిషనల్ ఎస్పీ సుందర్‌రావు తెలిపారు.
చేవెళ్ల రూరల్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో గట్టి నిఘా ఏర్పాటుచేస్తున్నట్లు చేవెళ్ల నియోజకవర్గం ఎన్నికల ఇన్‌చార్జి, విజయనగరం అడిషనల్ ఎస్పీ సుందర్‌రావు తెలిపారు. మండల కేంద్రంలో మంగళవారం పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చిన పోలీసులకు పలు గ్రామాల బాధ్యతలు కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలను గుమ్మిగూడకుండా చూడాలన్నారు. ఓటు వేయగానే వారు అక్కడినుంచి వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎప్పటికప్పుడు పోలీంగ్ స్టేషన్‌ల పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. అనుమానాస్పదంగా ఎవరైన కనిపిస్తే వెంటనే అదుపులోకి తీసుకోవాలని పేర్కొన్నారు. పోలింగ్ సమయంలో ప్రచారం జరగకూడదని, తమకే ఓటు వేయాలని ఎవరైన ఒత్తిడి చేసినా, ప్రలోభాలకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని మొయినాబాద్ మినహా చేవెళ్ల, శంకర్‌పల్లి, షాబాద్, నవాబుపేట మండలాల్లో ఉన్న 189 పోలింగ్ స్టేషన్‌లకు 500ల మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఓ ఏఎస్పీ, నలుగురు డీఎస్పీలు, ఎనిమిది మంది సీఐలు, 20 మంది ఎస్‌ఐలు బందోబస్తులో పాల్గొంటారని తెలిపారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఓటర్లు, నాయకులు సహకరించాలని కోరారు. సమావేశంలో చేవెళ్ల డీఎస్పీ శ్రీధర్, హర్ష, సీఐ నాగేశ్వర్‌రావు, ఎస్‌ఐలు లక్ష్మీరెడ్డి, ఖలీల్, చైతన్యకుమార్, నాగరాజు తదితరులున్నారు.