నోట్ల కట్టలున్న కారు దగ్ధం! | car with heavy cash burnt in suryapet | Sakshi
Sakshi News home page

నోట్ల కట్టలున్న కారు దగ్ధం!

Apr 30 2014 12:29 PM | Updated on Aug 14 2018 4:24 PM

నోట్ల కట్టలున్న కారు దగ్ధం! - Sakshi

నోట్ల కట్టలున్న కారు దగ్ధం!

ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ జరుగుతుండగా మరోవైపు నల్లగొండ జిల్లా సూర్యాపేట వద్ద నోట్ల కట్టలతో కూడిన ఓ కారు తగలబడింది.

ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ జరుగుతుండగా మరోవైపు నల్లగొండ జిల్లా సూర్యాపేట వద్ద నోట్ల కట్టలతో కూడిన ఓ కారు తగలబడింది. కారు మీద కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్కుమార్ రెడ్డి పేరుతో ఉన్న స్టిక్కర్ ఉంది. హైదరాబాద్ నుంచి హుజూర్నగర్ వెళ్తున్న ఇన్నోవా కారు జనగామ ట్రంకురోడ్డు వద్ద ఈ సంఘటన జరిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. షార్ట్సర్క్యూట్తో కారు తగలబడినట్లు చెబుతున్నారు. కారు సీటులోను, ఇంజన్ లోను భారీమొత్తంలో వెయ్యి రూపాయల నోట్లు కొంత కొంత కాలిపోయి కనపడ్డాయి. నీలం రంగులో ఉన్న ఈ ఇన్నోవా కారు నెంబరు ఏపీ 09 టీబీ 8289. దాదాపు కోటి రూపాయల వరకు నగదు వాహనంలో ఉన్నట్లు అనధికారిక సమాచారం. ఈ కారు ఫోటాన్ ఎనర్జీస్ సిస్టమ్స్ లిమిటెడ్ పేరుతో రిజిస్టర్ అయి ఉంది. ఫోటాన్ కంపెనీ ఉత్తమ్ కుమార్ రెడ్డిదేనన్న సమాచారం అందింది.

నోట్ల కట్టలతో ఉన్న కారు తగలబడినట్లు తనకు కూడా సమాచారం అందిందని, ఆర్డీవో, డీఎస్పీలతో మాట్లాడానని కలెక్టర్ చిరంజీవులు చెప్పారు. అందులో కొంత నగదు కాలిపోయిన మాట వాస్తవమేనని, డ్రైవర్ పారిపోవడంతో కారు ఎవరిదన్న విషయం ఇంకా తెలియలేదని అన్నారు. కారుమీద ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న మాట కూడా వాస్తవమేనని ఆయన తెలిపారు. రెండు మూడు గంటల్లో మొత్తం విషయం తెలుస్తుందని చెప్పారు.

అయితే, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గాను, మాజీ మంత్రిగాను వ్యవహరించిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాపాడేందుకు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. సంఘటన జరిగి ఇప్పటికి గంట దాటుతున్నా, అధికారులు మాత్రం ఇంకా వివరాలు తెలియాల్సి ఉందని, తాము ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నందున ఈ విషయం తెలుసుకోడానికి సమయం పడుతుందని చెబుతున్నారు. ఫోటాన్ ఎనర్జీ సిస్టమ్స్ సంస్థ ఉత్తమ్ కుమార్ రెడ్డిదేనన్న విషయం తెలిసినా, ఆ సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉందని తెలిసినా, అధికారులు మాత్రం ఆదిశగా దర్యాప్తు చేయడానికి ముందుకు రావట్లేదు. కారులో మంటలు చెలరేగగానే కారులో ఉన్నవాళ్లు కారు వదిలి పారిపోయినట్లు చెబుతున్నారు. దాదాపు పది కోట్ల రూపాయల వరకు హుజూర్ నగర్ నియోజకవర్గంలో పంచుతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement