
టిక్..టిక్..టిక్..
మరికొన్ని గంటలు.. స్ట్రాంగ్ రూములు తెరుచుకోనున్నాయి.. ఈవీఎంలు గుట్టు విప్పనున్నాయి. ఓటరు తీర్పును ప్రకటించనున్నాయి.
మరికొన్ని గంటలు.. స్ట్రాంగ్ రూములు తెరుచుకోనున్నాయి.. ఈవీఎంలు గుట్టు విప్పనున్నాయి. ఓటరు తీర్పును ప్రకటించనున్నాయి. ఆ తీర్పు ఎలా ఉంటుందో.. తమ భవిష్యత్తు ఏమిటోనన్న టెన్షన్ అభ్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వారి గుండెలు టిక్..టిక్.. టిక్.. మంటూ గడియారం ముల్లులా కొట్టుకుంటున్నాయి. మున్సిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల ఫలితాలన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా వెలువడనుండటంతో రానున్న ఐదేళ్లలో స్థానిక, రాష్ట్ర పాలకులెవరో తేలిపోనుంది. సోమవారం మున్సిపల్ ఫలితాలు.. మంగళవారం ప్రాదేశిక ఫలితాలు రానుండగా.. అక్కడికి రెం డు రోజుల విరామం తర్వాత అతి కీలకమైన సార్వత్రిక ఎన్నికల లెక్కింపు జరగనుంది. తమ ఓటు ఎవరి తలరాత మారుస్తుందోనన్న ఆసక్తి ఇటు ఓటర్లనూ ఉత్కంఠకు గురి చేస్తోంది. విభజన అనంతరం జరిగిన ఈ ఎన్నికలు రాష్ట్ర పునర్నిర్మాణంపై ప్రభావం చూపనుండటంతో అన్ని వర్గాలు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: మార్చి 30 మున్సిపల్ ఎన్నికలు.. ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ప్రాదేశిక ఎన్నికలు.. మే 7న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. కోర్టు తీర్పులు, రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాల నిర్ణయాల ప్రకారం ఈ అన్ని ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం సోమవారం నుంచి మొదలు కానుంది. సోమవారం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరుసటి రోజు మంగళవారం ప్రాదేశిక కౌంటింగ్ జరుగుతుంది. కాగా 16న ఎంపీ, ఎమ్మెల్యే ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా వరుసగా దాదాపు ఈ వారమంతా ఫలితాలు సందడి చేయనున్నాయి. ఎన్నికల్లో విజయం తమదేనని పార్టీలు పైకి బింకం ప్రదర్శిస్తున్నా.. లోలోన గుబులుగానే ఉన్నాయి. పట్టణ ప్రాంతాలకు చెందిన మున్సిపల్ ఫలితాలు.. పూర్తిగా గ్రామీణ ప్రాంతానికి చెందిన ప్రాదేశిక ఫలితాలు.. ఈ రెండు కలగలిపిన సార్వత్రిక ఫలితాలు వేటికవే ప్రత్యేకమైనవి కావడంతో తుది ఫలితాలు వెలువడే వరకు ఓటర్లు పూర్తిగా ఎవరి వైపు మొగ్గారన్నది చెప్పడం కష్టం. అయితే సూచనప్రాయ సంకేతాలు మాత్రం అందుతాయి. ఈ ఆసక్తితోనే అన్ని వర్గాల ప్రజలు ఫలితాల పరంపర కోసం ఎదురు చూస్తున్నారు.
మున్సిపల్ ఫలితాలతో షురూ
మొదట మున్సిపల్ ఫలితాలు వెలువడనున్నాయి. మరికొద్ది గంటల్లోనే పురపాలకులెవరన్నది ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజా తీర్పు నిర్దేశించనుంది. ఈ ఓట్ల లెక్కింపు కోసం ఎచ్చెర్ల, పలాస, ఇఛ్చాపురంలలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే లెక్కింపు ప్రక్రియ రెండు మూడు గంటల్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇచ్ఛాపురం, ఆమదాలవలసల్లో 23 వార్డులు చొప్పున, పలాస-కాశీబుగ్గలో 25 వార్డులకు, పాలకొండలో 19 వార్డులకు (20 వార్డుల్లో 14వ వార్డు ఏకగ్రీవమైంది) మార్చి 30న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
ఫలితాలపై ఎవరి ధీమా వారిదే..!
నాలుగు మున్సిపాలిటీల్లోనూ వైఎస్సార్‌సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్యే కీలక పోటీ జరిగింది. పోలింగ్ సరళి విశ్లేషించుకున్న అభ్యర్థులు, నాయకులు విజయంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓటింగ్ సరళి చూస్తే అన్ని చోట్లా ‘ఫ్యాన్’ గాలి బాగా వీస్తోందన్న సంకేతాలు వచ్చాయి. దీంతో ఈ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్‌సీపీ నేతలు పూర్తి ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కౌంటింగ్ కేంద్రాలివే..
ఓట్ల లెక్కింపునకు ఎచ్చెర్లలోని 21వ శతాబ్ది గురుకులంలో పాలకొండ, ఆమదాలవలసలకు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గురుకుల భవనాల్లోని బ్లాక్ నెం. 5లో పాలకొండ నగర పంచాయతీ, ఇదే ప్రాంగణంలోని బ్లాక్ నెం. 7లో ఆమదాలవలస మున్సిపాలిటీ ఓట్లు లెక్కిస్తారు. పలాస, ఇచ్ఛాపురం మున్సిపల్ కార్యాలయ ప్రాంగణాల్లో ఆయా మున్సిపాలిటీల ఓట్లు లెక్కిస్తారు. జిల్లా అధికార యంత్రాంగం కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసింది. కలెక్టర్ సౌరభ్ గౌర్ ఎప్పటికప్పుడు ఈ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తూ పర్యవేక్షిస్తున్నారు.
మొత్తం ఫలితాలపై పార్టీల్లో ఉత్కంఠ
పుర ఫలితాలతో మొదలు పెట్టి వరుసగా అన్ని ఫలితాలు వెలువడనుండటంతో ఆయా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతోపాటు రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సార్వత్రిక ఎన్నికలు ఈనెల 7న ముగిసిన నేపధ్యంలో వీటి ఫలితాల కోసం ఈనెల 16 వరకు వేచి చూడాల్సి ఉంది. అయితే సోమవారం రానున్న మున్సిపల్ ఫలితాలు, మంగళవారం వెలువడనున్న పరిషత్ ఎన్నికల ఫలితాలతో సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళి ఎలా ఉంటుందన్నది సూచనప్రాయంగా అంచనా వేయవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్ని ఎన్నికల్లోనూ ప్రధానంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీల మధ్యే పోటీ జరిగినందుకు ఆ రెండు పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే దీనిపై కూడా రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మార్చి 30 నాటి పరిస్థితులను, మే 7 నాటి పరిస్థితులను ఒక్కటిగా చూడలేమని అనుభవమున్న పలువురు నేతలు పేర్కొంటున్నారు. స్థానిక ఎన్నికల్లో స్థానిక అంశాలు, వ్యక్తుల ప్రాబల్యమే ప్రధాన పాత్ర పోషిస్తాయని.. అదే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలు, రాష్ట్రస్థాయి అంశాలు కీలకంగా ఉంటాయని అంటున్నారు. ఆ మేరకు ఓటింగ్ సరళిలోనూ మార్పు ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు. ఇదిలావుంటే సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన పాలకొండ, ఇచ్ఛాపురం, పలాస, ఆమదాలవలసలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. పట్టణ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారన్న విషయం పుర ఫలితాలతో దాదాపు స్పష్టమయ్యే అవకాశాలుండడంతో ఆ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మొదట్నుంచి పట్టణ, గ్రామీణ ప్రజలు వైఎస్సార్‌సీపీకి మద్దతిస్తుండడంతో ఈ పుర, స్థానిక ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీకే మద్దతిచ్చి గెలిపిస్తారనే ధీమా ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.