సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రం దిశ, దశను నిర్దేశిస్తుందన్న రాజకీయవర్గాల సెంటిమెంట్‌కు ఆటపట్టయిన తూర్పుగోదావరి జిల్లా.. శుక్రవారం నాటి ఓట్ల లెక్కింపులో ఏ తీర్పు ఇవ్వనుందోనన్న
సాక్షి ప్రతినిధి, కాకినాడ : సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రం దిశ, దశను నిర్దేశిస్తుందన్న రాజకీయవర్గాల సెంటిమెంట్‌కు ఆటపట్టయిన తూర్పుగోదావరి జిల్లా.. శుక్రవారం నాటి ఓట్ల లెక్కింపులో ఏ తీర్పు ఇవ్వనుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల వారూ జిల్లా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలకు 248 మంది, మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు 50 మంది తలపడ్డారు. బరిలో ఎందరున్నా ప్రధాన పోటీ వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీల మధ్యే సాగింది. విభజనతో ఇక్కడ అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్, కొత్తగా వచ్చిన జై సమైక్యాంధ్ర పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నా నామమాత్రులే. కాకినాడ సిటీ వంటి కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కు రాజకీయాలకు తెర తీశాయి. టీడీపీ ముమ్మిడివరం, కొత్తపేట, తుని, రామచంద్రపురం వంటి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నోట్లు గుమ్మరించి, మద్యం ఏరులై పారించింది. అయితే ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఓటర్లు మాత్రం విలక్షణమైన తీర్పు ఇచ్చారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తారనే నమ్మకం, ప్రజల కష్టాల్లో వెన్నంటి నిలిచి, వారి పక్షాన నాలుగున్నరేళ్లుగా చేపట్టిన పోరాటాలు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్న యువత వంటి సానుకూలతలతో జిల్లాలో మంచి ఫలితాలు సాధిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ ధీమాతో ఉంది.
టీడీపీపై విభేదాలు, రెబల్స్ నీడ..
కాగా మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపుతో వీటి ప్రభావంలేదని, సార్వత్రిక ఎన్నికల్లో కూడా అదే ఫలితం కొనసాగుతుందని టీడీపీ లెక్కలు వేసుకుంటోంది. అయితే సార్వత్రిక ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచి సీట్ల సిగపట్లు, కాంగ్రెస్ నుంచి వలసలతో రెబ ల్స్ బెడద, అంతర్గత విభేదాల వంటి పరిణామాలు పలు నియోజకవర్గాల్లో టీడీపీని తీవ్రంగా దెబ్బ తీశాయని పరిశీలకులు అంటున్నారు. ప్రాదేశిక పోరులో కలిసికట్టుగా పని చేసినా..సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపుతో తెలుగుతమ్ముళ్లు కన్నెర్రజేశారని, బీజేపీకి కేటాయించిన రాజమండ్రి సిటీతో పాటు రాజమండ్రి రూరల్, పెద్దాపురం, రాజోలు వంటి నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించిందని అంటున్నారు. పెద్దాపురంలో అసెంబ్లీ టిక్కెట్టు ఆశించిన తెలుగుతమ్ముళ్లు స్థానిక ఎన్నికల్లో కలిసి పనిచేసినా అసెంబ్లీ టిక్కెట్టు స్థానికేతరుడైన నిమ్మకాయల చినరాజప్పకు కట్టబెట్టడం, అమలాపురం ఎంపీ అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యారావును కాదని పార్టీతో సంబంధం లేని పండుల రవీంద్రబాబును దిగుమతి చేసుకోవడం ఆశావహుల్లో ఆగ్రహాన్ని రగిల్చిందని, ఈ నేపథ్యంలో ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు వ్యవహరించిన ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై స్పష్టంగా కనిపించిందని అంటున్నారు.
సామాజిక సమతూకంతో వైఎస్సార్ సీపీకి సానుకూలత
స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక పరిస్థితులు, సామాజిక, వర్గాల ప్రాబల్యం, అభ్యర్థుల గుణగణాల వంటి పలు అంశాలు ప్రభావాన్ని చూపిస్తాయని, సార్వత్రిక ఎన్నికల్లో వాటికి అంత ప్రాధాన్యం ఉండదని వైఎస్సార్ సీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విభజన నేపథ్యంలో ఏర్పడే ప్రభుత్వం, నాయకత్వం, మేనిఫెస్టోలో ప్రాధాన్యం దక్కిన వర్గాలు, మాటకు కట్టుబడటం, విశ్వసనీయత వంటి అంశాలు తమకు పాజిటివ్ ఓటింగ్‌ను తెచ్చి పెడతాయని వైఎస్సార్ సీపీ భావిస్తోంది. జిల్లాలో అత్యధికంగా కాపు సామాజికవర్గానికి 8 స్థానాలు కేటాయించడంతో పాటు బీసీలకు ఇచ్చిన నాలుగు స్థానాల్లో మూడు శెట్టిబలిజలకు ఇవ్వడం ద్వారా తమ అధినేత జగన్ సామాజిక సమతూకాన్ని పాటించారని, దీనికి తోడు బీసీ, ఎస్సీ, ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలు పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటి ఉన్నారని వారు చెపుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇవన్నీ తమకు కలిసి వచ్చినట్టు పోలింగ్ రోజున కనిపించిందంటున్నారు. జిల్లాలో ఆధిక్యం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.