
తెలంగాణ సాయుధ పోరాటం...
‘తెలంగాణ రైతులు’ జరిపిన పోరాటం భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది.
‘తెలంగాణ రైతులు’ జరిపిన పోరాటం భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది. ఇది తెలంగాణ సాయుధ పోరాటంగా ప్రసిద్ధికెక్కడంతో పాటు దేశ కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్రలో తొలి స్వతంత్ర ప్రతిపత్తి గల ఉద్యమంగా నిలిచింది. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఉద్యమాలు సాయుధ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచినా... ఈ ఉద్యమం వాటికి పదిరెట్ల స్థాయిలో జరిగింది. ఇది శ్రమ దోపిడీ, వెట్టి చాకిరీలు వంటి సామాజిక దురాచారాలకు చరమగీతం పాడేందుకు ప్రజల నుంచి వచ్చిన పోరాట స్పందన. ఈ నేపథ్యంలో ప్రపంచ ఉద్యమ
చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిన తెలంగాణ సాయుధ పోరాటానికి దారి తీసిన కారణాలపై సమగ్ర విశ్లేషణ....
అంతర్జాతీయ గుర్తింపు
భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో విభిన్న కారణాలతో ఎన్నో రకాల సాయుధ రైతాంగ పోరాటాలు పుట్టుకొచ్చాయి. వీటిల్లో హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ ప్రాంతంలో 1946-51 మధ్య జరిగిన సాయుధ పోరాటం చాలా ముఖ్యమైంది. కెనడాకు చెందిన విల్‌ఫ్రెడ్ కాంట్‌వెల్ స్మిత్ 1962లో ‘ది మీనింగ్ అండ్ ఎండ్ ఆఫ్ రిలీజియస్’ అనే గ్రంథాన్ని రచించారు. ఆ గ్రంథంలో ఆయన సాయుధ పోరాటం గురించి ప్రస్తావిస్తూ, చైనా తర్వాత ఆసియాలో మరెక్కడా ఇంత పెద్ద ఉద్యమం జరగలేదని పేర్కొన్నారు. రష్యన్, పోలిష్, స్పానిష్ భాషల్లో సాయుధ పోరాటానికి సంబంధించి అనేక గీతాలు, కవిత్వాలు వచ్చాయి. దీన్ని బట్టి సాయుధ పోరాటానికి అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపు అర్థమవుతోంది.
సాయుధ పోరాటం- కారణాలు
నిజాం ప్రభుత్వ చర్యలు: అసఫ్ జాహీలు 1724లో హైదరాబాద్ కేంద్రంగా దక్కన్‌లో రాజ్యస్థాపన చేశారు. ఈ కాలంలో అధిక సంఖ్యలో ముస్లింలు ఇతర రాష్ట్రాల నుంచి దక్కన్ రాజ్యానికి వలస వచ్చారు. వీరంతా స్థానికంగా ఉన్న బలహీన వర్గాలు, దళితులను మతమార్పిడుల ద్వారా తమలో కలుపుకొన్నారు. దీంతో 1901 నాటికి 10 శాతం ఉన్న తురుష్కుల జనాభా 1948 నాటికి 14 శాతానికి చేరింది. హైదరాబాద్ రాజ్యంలోని తెలుగు ప్రజల వాక్, సభా, పత్రికా స్వాతంత్య్రాలను ‘గస్తి నిషాన్-53’ ద్వారా హరించారు. ప్రజలకు రాజకీయ హక్కులు లేవు. 1928లో నారాయణగూడలోని (హైదరాబాద్) బాలికల పాఠశాలకు తెలుగులో విద్యాబోధనకు అనుమతిని ఇవ్వలేదు. దీంతో ఆ పాఠశాల పూనాలోని మహిళా విశ్వవిద్యాలయం అనుమతి తెచ్చుకొంది. ఈ కాలంలో తెలంగాణలోని అనేక పట్టణాల పేర్లను మార్చారు.
అసలు పేరు ప్రస్తుత పేరు
ఇందూరు నిజామాబాద్
మానుకోట మహబూబాబాద్
పాలమూరు మహబూబ్‌నగర్
ఎలగందుల కరీంనగర్
వీరపట్టణం ఇబ్రహీంపట్నం
సోషలిస్ట్ భావజాలం వ్యాప్తి
సాయుధ పోరాటం దిశగా సోషలిస్ట్ భావజాల వ్యాప్తి కూడా ఇంధనంలా పని చేసింది. జయ ప్రకాశ్‌నారాయణ, యూసఫ్ మెహరోలి, అచ్యుత్ పట్వర్థన్, అశోక్‌మెహతా, ఎన్.ఎం జోషి, ఎన్‌డీ గోరే తదితరులు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేయాలని భావించారు. వీరిని ఆచార్య నరేంద్రదేవ్, రాంమనోహర్ లోహియా, పురుషోత్తం దాస్, కమలాదేవి ఛటోపాధ్యాయ వంటి ప్రముఖులు బలపరిచారు. వీరంతా 1934, మే 17న పాట్నాలో ఆచార్య నరేంద్రదేవ్ అధ్యక్షతన సమావేశమై పార్టీ స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. కర్షక, కార్మిక, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వడం జమిందారుల భూముల స్వాధీనం,
సంస్థానాలు, రాజరికాల రద్దు, పేద ప్రజలకు రుణ విముక్తి కల్పించడం వంటివి వీరి ప్రధాన లక్ష్యాలు. సోషలిస్ట్‌ల ప్రభావానికి తోడు అదే సమయంలో దేశంలో జరిగిన ఇతర సంఘటనలు కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేశాయి. ఫలితంగా సుభాష్ చంద్రబోస్ 1938లో ‘హరిపుర’ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారి రైతు సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమంలో జేపీ హజారిబాగ్ జైలు నుంచి తప్పించుకొని లోహియా, పట్వర్థన్‌లతో కలసి ‘అజాద్ దస్తా’ను ఏర్పాటు చేశారు. వీరు గెరిల్లా పద్ధతిలో బ్రిటీష్ వారితో పోరాటం చేశారు. సోషలిస్ట్ ఉద్యమాలు ఎంత తీవ్రస్థాయిలో జరిగినా పెద్దగా రక్తపాతాలు సంభవించేవి కావు.
సామాజిక దురాచారాలుతెలంగాణలోని
గ్రామీణ వృత్తులు... చాకలి, కుమ్మరి, చిన్న చిన్న రైతులు, వర్తకులు, దళితులు వెట్టిచాకిరికి గురయ్యారు. వెట్టి చెయకపోతే తిట్లు, దెబ్బలు తినాల్సిన పరిస్థితులు ఉండేవి. చాలా మందిని నిర్బంధించి కూడా వెట్టి చేయించుకొనే వారు. ప్రతి కుటుంబం వంతుల వారీగా వెట్టి చేసేది. అప్పటి నల్గొండ జిల్లాలో ఉన్న జనగాం తాలూకా దేశ్‌ముఖ్ ‘విసునూరి’ రామచంద్రరావు దుర్మార్గాలకు హద్దే లేకుండా పోయేది. విసునూరి అరాచకాల గురించి పుచ్చలపల్లి సుందరయ్య తన గ్రంథంలో విపులంగా రాశారు. రైతులు, కౌలుదార్ల కష్టాన్ని కబళించిన విధానం, వెట్టిచాకిరి దయనీయ స్థితిపై వట్టికోట ఆళ్వారుస్వామి ‘ప్రజల మనిషి’ నవలలో వివరంగా ఉంది. ఇది తెలంగాణలోని తొలి నవలగా ప్రసిద్ధి చెందింది.
నాగువడ్డీ విధానం
తెలంగాణలోని భూస్వాములు, దొరలు వడ్డీ వ్యాపారం చేసేవారు. నిజాం రాజ్యంలో వడ్డీ వ్యాపారాన్ని ‘నాగు’ అని పిలిచారు. ఒక బస్తా ధాన్యం అప్పు తీసుకుంటే నెలకు 11/2 బస్తా చెల్లించాలి. రూ.100 అప్పు తీసుకుంటే అసలుతో పాటు వడ్డీగా ‘బస్తా’ ధాన్యం ఇవ్వాలి. భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, పట్వారీల దోపిడీ గురించి గుజ్జల వీరారెడ్డి రచించిన ‘తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డా నర్సయ్య’ అనే పుస్తకంలో ఉంది.
భూస్వామ్య వ్యవస్థ
నిజాం కాలంలో ప్రధానంగా మూడు రకాల భూములు ఉండేవి. అవి...
1.సర్ఫేఖాస్: రాజ్యంలోని 10 శాతం భూములు. నిజాం సొంత ఖర్చుల కోసం ఈ భూములను ఉపయోగించేవారు.
2.జాగీర్‌దారు భూములు: నిజాం రాజ్యంలోని 30 శాతం భూములు. ఇవి ఉద్యోగుల ఆధీనంలో ఉండేవి.
3.దివానీ లేదా ఖల్సా: 60 శాతం భూములు. జమిందార్లు, ముక్తేదార్లు, ఫతేదార్ల చేతుల్లో ఉండేవి.
నిజాం రాజ్యంలో పన్నులను 1/2 భాగం, 2/3 వంతులుగా వసూలు చేసేవారు.
బగీలా వ్యవస్థ
నిజాం విధానాలతో పేద ప్రజలు పూర్తిగా రుణగ్రస్తులుగా మారిపోయారు. అప్పు తిరిగి చెల్లించలేని స్థితికి వారి జీవితాలు దిగజారిపోయాయి. దీంతో భూస్వాములు పేద ప్రజలతో జీవితాంతం వెట్టి చాకిరి చేయించుకొనేవారు. దీనినే బగీలా వ్యవస్థగా పేర్కొంటారు.
లెవీ ధాన్యం (1943)
రెండో ప్రపంచయుద్ధ కాలంలో నిజాం రాజ్యంలో ఆహార కొరత ఏర్పడింది. నిజాం రాజు ఆహార ధాన్యాల సేకరణ కోసం అనేక ఫర్మానాలు జారీ చేశాడు. రైతులు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ధాన్యాన్ని సమీపంలోని గిడ్డంగుల్లో అప్పగించాల్సి వచ్చేది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. వరంగల్ జిల్లాలోని ఎనమాముల ధాన్యాగారం అప్పటి నుంచే ప్రసిద్ధి చెందింది. ధాన్యాగారాల్లో తూకాల విషయంలోనూ రైతులను మోసం చేసేవారు. జమిందారులు దొంగలెక్కలు రాసి ‘లెవీని’ తగ్గించి చూపేవారు. 1945లో లెవీధాన్యం సేకరించడానికి వెళ్లిన రెవెన్యూ, పోలీసు సిబ్బందికి జనగాం గ్రామస్తులు ఎదురుతిరిగారు. దీన్ని రెవెన్యూ, పోలీసు సిబ్బంది తీవ్రంగా అణిచివేశారు. ఈ సమయంలో మహిళలపై అనేక అకృత్యాలు జరిగాయి. ఈ సంఘటనను ప్రభుత్వ చిత్రహింసలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నిజాం చర్యలతోపాటు విసూనూరి జమిందారు రామచంద్రారెడ్డి, దేశ్‌ముఖ్‌ల దుశ్చర్యలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.
ఆంధ్ర మహాసభలు
1921లో ఏర్పాటైన ఆంధ్ర జనసంఘం మొదటి సమావేశం 1922 ఫిబ్రవరి 14న జరిగింది. ఈ సమావేశంలోనే ఆంధ్ర జనసంఘం పేరును నిజాం రాష్ర్ట ఆంధ్ర జనసంఘంగా మార్చారు. ఇది 1930 నాటికి ఆంధ్ర మహాసభగా రూపాంతరం చెందింది. సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన దీని తొలి సమావేశం మెదక్ జిల్లా జోగిపేటలో జరిగింది. తర్వాత 1944లో రావి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో భువనగిరిలో ఆంధ్ర మహాసభను నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లాల్లో కమ్యూనిస్ట్‌లు బలపడ్డారు. వరంగల్, నల్గొండ జిల్లాల్లో వీటి శాఖలు ఏర్పడ్డాయి. ఈ శాఖలను సంఘాలుగా పిలిచేవారు.
రాజకీయ పాఠశాల ఏర్పాటు
కృష్ణా జిల్లా కంకిపాడులో రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, హనుమయ్యలకు ఎన్జీ రంగా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కాలంలో తెలంగాణ రైతు, రాజకీయ పాఠశాలను కరీంనగర్ జిల్లా జగిత్యాలలో స్థాపించారు. దీనిలో ఆళ్వార్‌స్వామి, దేవులపల్లి వెంకటేశ్వరరావులకు పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావులు మార్గనిర్దేశం చేశారు.
తెలంగాణ భూస్వాముల ఆధీనంలోని భూములు
జన్నారెడ్డి ప్రతాపరెడ్డి (సూర్యాపేట) నల్గొండ:
1.5 లక్షల ఎకరాలు
కల్లూరు దేశ్‌ముఖ్ (మధిర) ఖమ్మం: లక్ష ఎకరాలు
లక్సెట్టిపేట దేశ్‌ముఖ్‌లు: 50 వేల ఎకరాలు
విసునూర్ దేశ్‌ముఖ్ (జనగాం) వరంగల్:
40 వేల ఎకరాలు
హైదరాబాద్ సంస్థానం
విస్తీర్ణం: 83,0413 చ.మైళ్లు
రాజ్య జనాభా: 1,87,00,000
హిందువులు: 88 శాతం (సుమారుగా)
ముస్లింలు: 12 శాతం (సుమారుగా)
1931 నాటికి హిందువుల జనాభా 84 శాతానికి
పడిపోయింది.
హైదరాబాద్ సంస్థానంలోని మొత్తం జిల్లాలు: 16
తెలంగాణ
1. నల్గొండ; 2. వరంగల్; 3. కరీంనగర్ (ఎలగందుల); 4. ఆదిలాబాద్; 5. మెదక్ (మెతుకుసీమ);
6. మహబూబ్‌నగర్ (పాలమూరు); 7. నిజామాబాద్ (ఇందూర్); 8. ఆత్రాపుబల్దా (రంగారెడ్డి)
హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాలు లేవు
మహారాష్ట్ర (మరఠ్వాడా)
1. నాందేడ్; 2. ఔరంగాబాద్;
3. ఉస్మానాబాద్; 4. పర్బనీ; 5. బీడ్.
కర్ణాటక
1. గుల్బర్గా; 2. బీదర్; 3. రాయచూర్