
తెలంగాణ భూగోళ శాస్త్రం
ప్రాంతీయ భూగోళ శాస్త్రం విభాగంలో తెలంగాణ రాష్ర్ట భూగోళ నిర్మితి, నైసర్గిక స్వరూపాలు లాంటి వాటిని ‘తెలంగాణ రాష్ర్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్’
ప్రాంతీయ భూగోళ శాస్త్రం విభాగంలో తెలంగాణ రాష్ర్ట భూగోళ నిర్మితి, నైసర్గిక స్వరూపాలు లాంటి వాటిని ‘తెలంగాణ రాష్ర్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్’ సిలబస్‌లో చేర్చింది. తెలంగాణ రాష్ర్ట భూగోళ శాస్త్ర అంశాలను అధ్యయనం చేయడం ద్వారా గ్రూప్-1 మెయిన్‌స పేపర్-2కి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పేపర్-2లో ప్రత్యేకంగా తెలంగాణ జాగ్రఫీ చేర్చారు.
గ్రూప్ 1, 2, 3 లాంటి పోటీ పరీక్షల్లో ‘జనరల్ స్టడీస్’ విభాగం అత్యంత కీలకమైంది. దీనిలో భూగోళ శాస్త్రానికి అధిక ప్రాధాన్యత ఉంది. ఈ భూగోళ శాస్త్రంలో మూడు విభాగాలు ఉంటాయి. అవి
1) ప్రపంచ భూగోళ శాస్త్రం
2) భారతదేశ భూగోళ శాస్త్రం
3) ప్రాంతీయ భూగోళ శాస్త్రం (తెలంగాణ రాష్ర్టం)
తెలంగాణ భూగోళ శాస్త్రంలోని ప్రధాన అంశాలు
తెలంగాణ రాష్ర్ట ఉనికి - విస్తరణ, రాష్ర్ట సరిహద్దులు, జిల్లాలు వాటి సరిహద్దులు.
తెలంగాణ రాష్ర్ట నైసర్గిక స్థితి, పీఠభూములు, కొండలు.
తెలంగాణ రాష్ర్ట శీతోష్ణస్థితి, రాష్ర్టంలో ప్రవహించే నదులు, వాటి ఉపనదులు.
తెలంగాణ రాష్ర్ట అడవులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, నేలలు.
రాష్ర్టంలో లభించే వివిధ ఖనిజాలు - వాటి విస్తరణ.
రాష్ర్టంలో శక్తి వనరులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు.
రాష్ర్టంలో నీటిపారుదల రంగం, ప్రధాన ప్రాజెక్టులు.
రాష్ర్టంలో వ్యవసాయ రంగం - వివిధ పంట ఉత్పత్తులు, కరువు పీడిత ప్రాంతాలు.
రాష్ర్టంలోని పరిశ్రమలు, సెజ్‌లు.
రాష్ర్టంలోని రవాణా సౌకర్యాలు, రోడ్లు, వాయు, రైల్వే సౌకర్యాలు.
రాష్ర్టంలోని జనాభా, 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ర్టంలోని జనసాంద్రత, స్త్రీ, పురుష నిష్పత్తి, అక్షరాస్యత.
రాష్ర్టంలోని జిల్లాలు, వాటి పూర్తి సమాచారం, ఆయా జిల్లాల్లోని పర్యాటక ప్రదేశాలు, దేవాలయాలు, కవులు, ప్రముఖ వ్యక్తులు.
ప్రత్యేకంగా హైదరాబాద్ నగరం, దాని చుట్టూ విస్తరించి ఉన్న పారిశ్రామిక కేంద్రాలు, పరిశోధన సంస్థలు మొదలైనవి.
తెలంగాణ రాష్ర్ట ఉనికి - విస్తరణ
ఈ అంశం నుంచి పోటీ పరీక్షల్లో ప్రధానంగా తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు, రాష్ర్టంలోని వివిధ జిల్లాలు వాటి విస్తరణ, రాష్ర్టంలోని ప్రతి జిల్లాకు ఇతర జిల్లాలతో సరిహద్దులు, ఇతర రాష్ట్రాలలో సరిహద్దులు లాంటి అంశాల నుంచి ప్రశ్నలు రావొచ్చు.
తెలంగాణ రాష్ట్రానికి ఉన్న సరిహద్దులు, అలాగే రాష్ర్ట అధికార చిహ్నాలు మొదలైనవి.
రాష్ర్ట ఉనికి అంటే అక్షాంశ, రేఖాంశాల పరంగా విస్తరించిన తీరు మొదలైన వాటిపై కూడా ప్రశ్నలు అడగొచ్చు.
రాష్ర్టం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన వివిధ
మండలాలు.
రాష్ర్టం కొత్తగా ఏర్పడింది కాబట్టి.. రాష్ర్టంలోని అసెంబ్లీ నియోజకవర్గాలు (జిల్లాల వారీగా), రెవెన్యూ డివిజన్లు, మున్సిపాలిటీలు మొదలైన అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధ్యయనం చేయాలి.
ఇటీవల తెలంగాణ రాష్ర్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో ఈ అంశం నుంచి ప్రశ్నలు అడిగారు.
1. తెలంగాణ రాష్ర్ట పుష్పం ఏది?
1) తంగేడు 2) గులాబీ
3) చేమంతి 4) గునుగు
గమనిక: పెరుగుతున్న పోటీ దృష్ట్యా ఇలాంటి సులభమైన ప్రశ్నలు కాకుండా కఠినమైనవి అడగొచ్చు. కాబట్టి విద్యార్థులు ప్రతి అంశాన్ని లోతుగా, క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
తెలంగాణ రాష్ర్ట నదులు
రాష్ర్టంలోని వివిధ నదులు ముఖ్యంగా గోదావరి, కృష్ణా, మంజీరా, ప్రాణహిత నదులు, వాటి ఉపనదులు, నదీ జన్మస్థానాలు, ఈ నదులపై నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టులు, వాటి కాలువలు, నదీ పరివాహక ప్రాంతాలు, నదులు ప్రవహించే జిల్లాలు మొదలైన అంశాల మీద ప్రతి పరీక్షలో ప్రశ్నలు అడుగుతున్నారు. తెలంగాణ భూగోళ శాస్త్రంలో ఈ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. టీఎస్‌పీఎస్సీ అడిగిన ప్రశ్నలు పరిశీలిస్తే వీటి ప్రాధాన్యత ఎంత ఉందో తెలుస్తుంది.
2. కిన్నెరసాని.....?
1) చలం నవల పేరు
2) దాసరి నారాయణరావు సినిమా
3) ఖమ్మం జిల్లాలోని ఒక నది
4) వరంగల్ జిల్లాలో ఒక చారిత్రక చెరువు
3. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య?
1) ఐదు 2) ఏడు
3) మూడు 4) ఆరు
4. కృష్ణానది ఈ రాష్ట్రాల మధ్య సరిహద్దుగా ఉంది?
1) తెలంగాణ, మహారాష్ర్ట
2) తెలంగాణ, ఒడిషా
3) తెలంగాణ, చత్తీస్‌ఘడ్
4) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
తెలంగాణ రాష్ర్ట నీటిపారుదల సౌకర్యాలు
ఇందులో ప్రధానంగా చెరువులు, కాలువలు, బావులు మొదలైన నీటిపారుదల సౌకర్యాలతోపాటు ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమం, తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోయే ప్రాజెక్టులు, వాటి వివరాలు, ఇప్పటివరకు తెలంగాణ రాష్ర్టంలో నిర్మించిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న భారీ, మధ్యతరహా, చిన్నతరహా ప్రాజెక్టులు మొదలైనవి. ఇలాంటి అంశాల మీద ప్రశ్నలు వస్తున్నాయి.
5. కింది వాటిలో దేన్ని చివరి నిజాం కాలంలో నిర్మించలేదు?
1) వైరా ప్రాజెక్టు 2) పాలేరు ప్రాజెక్టు
3) నిజాంసాగర్ 4) హుస్సేన్‌సాగర్
తెలంగాణ రాష్ర్ట నైసర్గిక స్థితి - శీతోష్ణస్థితి
‘తెలంగాణ పీఠభూమి’ రాష్ర్టంలో విస్తరించిన తీరు అంటే... రాష్ర్టం అంతటా ఒకే ఎత్తులో విస్తరించకుండా, వివిధ జిల్లాల్లో వివిధ రకాలుగా విస్తరించడం, రాష్ర్టంలోని కొండలు, వాటికి వివిధ జిల్లాల్లో గల పేర్లు మొదలైనవి.
రాష్ర్టంలో శీతోష్ణస్థితి, ఉష్ణోగ్రత, వర్షపాతం, నైరుతి రుతుపవనాలు, ఈశాన్య రుతుపవనాలు, వాటి వల్ల సంభవించే వర్షపాతం, రాష్ర్టంలోని అత్యధిక వర్షపాతం, అత్యల్ప వర్షపాతం మొదలైన అంశాల మీద ప్రశ్నలు అడగొచ్చు.
రాష్ర్టంలోని వివిధ కాలాలు, ఆయా కాలాల్లో నమోదయ్యే వర్షపాతం, ఉష్ణోగ్రత మొదలైనవి.
ఈ విభాగంలో టీఎస్‌పీఎస్సీ అడిగిన ప్రశ్నలు
6. తెలంగాణ రాష్ర్ట వర్షపాతంలో నైరుతి రుతుపవనాల ద్వారా లభించే వర్షపాతం శాతం సుమారుగా?
1) 70 శాతం 2) 80 శాతం
3) 90 శాతం 4) 95 శాతం
తెలంగాణ అడవులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
తెలంగాణ రాష్ర్ట వైశాల్యంలో అడవుల శాతం, అత్యధిక, అత్యల్ప అడవులు గల జిల్లాలు, అటవీ శాతం గల జిల్లాలు, రాష్ర్టంలో విస్తరించిన అడవుల రకాలు, వాటిలో పెరిగే వృక్షాలు. ఇక్కడ ప్రధానంగా వర్షపాతానికి, అడవులకు ప్రత్యక్ష సంబంధం ఉంటుంది కాబట్టి అడవులను ప్రభావితం చేయడంలో వర్షపాతం ఒకటి. వర్షపాత విస్తరణ, అడవుల విస్తరణ రెండింటిని పోల్చుకుంటూ అధ్యయనం చేస్తే సులభంగా అర్థం అవడమే కాకుండా ఎక్కువ కాలం గుర్తించుకోవచ్చు.
అలాగే అడవుల నుంచి లభించే ఉత్పత్తులు వాటి ఉపయోగాలు, తెలంగాణ హరితహారం ఉద్దేశాలు, ప్రారంభం, మొదలైనవి.
మన రాష్ర్టంలో ఉన్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు, అవి విస్తరించి ఉన్న జిల్లాలు, వాటిలో సంరక్షిస్తున్న జంతువులు, పక్షులు మొదలైన అంశాల మీద ప్రశ్నలు అడగొచ్చు.
7. కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉన్న ప్రాంతం?
1) పోచారం 2) జన్నారం
3) ఏటూరునాగారం
4) పాకాల