పృథ్వీ-2 క్షిపణి పరీక్ష విజయవంతం | India successfully test-fires nuclear capable Prithvi II missile | Sakshi
Sakshi News home page

పృథ్వీ-2 క్షిపణి పరీక్ష విజయవంతం

Dec 3 2015 1:40 AM | Updated on Sep 3 2017 1:23 PM

పృథ్వీ-2 క్షిపణి పరీక్ష విజయవంతం

పృథ్వీ-2 క్షిపణి పరీక్ష విజయవంతం

మాల్టాలో చోగమ్ సదస్సు కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సదస్సు(చోగమ్).. మాల్టా రాజధాని వాలెట్టాలో

 అంతర్జాతీయం
  మాల్టాలో చోగమ్ సదస్సు  కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సదస్సు(చోగమ్).. మాల్టా రాజధాని వాలెట్టాలో నవంబరు 27 నుంచి మూడు రోజులపాటు జరిగింది. ఉగ్రవాద నిధులపై సదస్సు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణ మార్పుల హబ్ నెలకొల్పేందుకు సభ్య దేశాలు అంగీకరించాయి. కామన్వెల్త్‌లోని చిన్న, పేద దేశాలకు ఉద్గారాలను తగ్గించేందుకు నిధులు సమకూర్చేందుకు ఈ హబ్ తోడ్పడనుంది. ఉగ్రవాద నిర్మూలనకు రూ.50 కోట్ల నిధిని ఏర్పాటుచేస్తున్నట్లు సదస్సులో ప్రకటించారు. ‘యాడింగ్ గ్లోబల్ వాల్యూ’ ఇతివృత్తంతో సదస్సు జరిగింది. సదస్సులో 53 సభ్యదేశాలకు చెందిన ప్రతినిధులతోపాటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ-మూన్ కూడా పాల్గొన్నారు. భారత్ తరఫున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సదస్సుకు హాజరయ్యారు.
 
 సింగపూర్‌లో ప్రధాని మోదీ పర్యటన
 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబరు 24న సింగపూర్‌లో పర్యటించారు. సింగపూర్ అధ్యక్షుడు టోనీ టాన్ కెంగ్, ప్రధాని లీ సీన్ లూంగ్‌లతో సమావేశమయ్యారు. వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇరుదేశాల ప్రధానులు సంయుక్త ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య 5 ఒప్పందాలు కుదిరాయి. సైబర్ భద్రత, నౌకాయానం, పౌర విమానయాన రంగాల్లో సహకారం, ఆర్థిక, రక్షణ, భద్రత, సాంస్కృతిక ప్రజా సంబంధాలకు చెందిన ఒప్పందాలు ఖరారయ్యాయి. భారత్-సింగపూర్ ఆర్థిక సమ్మేళనంలో ప్రధాని మోదీ.. పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి భారత నవరత్న కంపెనీల్లో భాగస్వామ్యం కావాలని కోరారు.
 
 ట్యునీషియాలో ఐఎస్‌ఐఎస్ దాడి
 ట్యునీషియాలో అధ్యక్షుడి రక్షణ సిబ్బంది వాహనంపై నవంబరు 24న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) జరిపిన దాడిలో 12 మంది సిబ్బంది మరణించారు. ఈ దాడితో అధ్యక్షుడు ఎస్సెబ్సి దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు.
 
 రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేసిన టర్కీ
 రష్యాకు చెందిన సుఖోయ్-24 యుద్ధ విమానాన్ని నవంబరు 24న టర్కీ కూల్చివేసింది. రష్యా తమ సార్వభౌమాధికారాన్ని, గగనతల సరిహద్దు నిబంధనలను ఉల్లంఘించినందువల్లే ఈ చర్యకు పాల్పడినట్లు టర్కీ తెలిపింది. విమానంలోని ఇద్దరు పైలట్లలో ఒకరు మరణించారు. టర్కీ చర్యను రష్యా ఖండించింది. ఇది చాలా తీవ్రమైన ఘటనగా పేర్కొంది. మరణించిన పైలట్‌కు ‘హీరో ఆఫ్ రష్యా’ అవార్డును ప్రకటించింది.
 
 క్రీడలు
 బ్రిటన్‌కు డేవిస్ కప్  ప్రపంచ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఈవెంట్ డేవిస్ కప్‌ను బ్రిటన్ గెలుచుకుంది. గెంట్(బెల్జియం)లో నవంబరు 29న జరిగిన ఫైనల్లో బెల్జియంను ఓడించింది. బ్రిటన్ 77 ఏళ్ల తర్వాత ఈ విజయం సాధించింది.
 
 డే అండ్ నైట్ టెస్ట్ సిరీస్
 తొలిసారి జరిగిన క్రికెట్ డే అండ్ నైట్ టెస్ట్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. అడిలైడ్‌లో నవంబరు 29న ముగిసిన టెస్ట్‌లో న్యూజిలాండ్‌ను ఆస్ట్రేలియా ఓడించింది. ఈ టెస్ట్‌లో ప్రయోగాత్మకంగా గులాబి రంగు బంతిని ఉపయోగించారు.
 
 రోస్‌బర్గ్‌కు అబుదాబి గ్రాండ్‌ప్రీ టైటిల్
 అబుదాబిలో నవంబరు 29న ముగిసిన రేసులో ఫార్ములా వన్ అబుదాబి గ్రాండ్ ప్రీ టైటిల్‌ను మెర్సిడెస్ జట్టు డ్రైవర్ రోస్‌బర్గ్ సాధించారు. ఇదే జట్టుకు చెందిన లూయిస్ హామిల్టన్‌కు రెండో స్థానం లభించింది.
 
 హారికకు ప్రపంచ చెస్ ఆన్‌లైన్ టైటిల్
 భారత గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రపంచ మహిళల ఆన్‌లైన్ చెస్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. ఆన్‌లైన్లో చెస్ టోర్నీ నిర్వహించటం ఇదే తొలిసారి. ఇటలీలోని రోమ్‌లో నిర్వహించిన ఈ టోర్నీ నవంబరు 27న ముగిసింది. నానా జాగ్నిడ్జ్ (జార్జియా)కు రెండో స్థానం లభించింది.
 
 పి.వి.సింధుకు మకావు ఓపెన్
 మకావు ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను భారత క్రీడాకారిణి పి.వి.సింధు గెలుచుకుంది. ఆమె మకావులో నవంబరు 29న జరిగిన ఫైనల్లో మితాని మినత్సు (జపాన్)ను ఓడించింది. సింధు ఈ టైటిల్ వరుసగా మూడుసార్లు గెలుచుకొని, హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు సాధించింది.
 
 ఆర్థికం
  రెండేళ్ల కనిష్టానికి రూపాయి  డాలర్‌తో రూపాయి మారకం నవంబరు 27న 19 పైసలు క్షీణించి 66.76 వద్ద ముగిసింది. ఇది రెండేళ్ల కనిష్ట స్థాయి. నెల చివర కావడంతో దిగుమతిదారులు, కొన్ని బ్యాంక్‌ల నుంచి డాలర్‌కు డిమాండ్ బాగా ఉండటంతో రూపాయి విలువ ఈ స్థాయిలో క్షీణించిందని నిపుణులు పేర్కొంటున్నారు.
 
 రూపే కార్డు బీమాకు కాల పరిమితి పొడిగింపు
 రూపే కార్డుకు సంబంధించి ప్రమాద బీమా క్లెయిమ్ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. ఏదైనా ఒక ప్రమాద సంఘటన విషయంలో... క్లెయిమ్‌కు ముందు కార్డు వినియోగ కాలాన్ని (కార్డ్ యూసేజ్ కండీషన్) 90 రోజుల వరకు పొడిగించింది. ఇప్పటి వరకు ఈ పరిమితి 45 రోజులుగా ఉంది. నవంబర్ 25 నుంచి తాజా నిబంధన అమల్లోకి వస్తుంది. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) కింద జారీ అయిన రూపే డెబిట్ కార్డుపై రూ.లక్ష వరకు ప్రమాద బీమా కవరేజ్ ఉంది.
 
 మొబైల్ సర్వీస్ రంగం విస్తరణ
 భారత్‌లో మొబైల్ సర్వీసుల రంగం భారీగా విస్తరించనుంది. 2020 నాటికి భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) లో ఈ రంగం వాటా 8.2 శాతానికి (దాదాపు రూ.14 లక్షల కోట్లు) చేరుతుందని గ్లోబల్ టెలికం ఇండస్ట్రీ ప్రాతినిధ్య సంస్థ జీఎస్‌ఎంఏ పేర్కొంది. 2014లో ఈ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల మందికి ఉపాధి కల్పించిందని తెలిపింది. 2020 నాటికి ఈ సంఖ్య 50 లక్షలకు చేరుతుందని అభిప్రాయపడింది.
 
 జాతీయం
 ‘అగ్ని-1’ ప్రయోగం విజయవంతం  అణ్వస్త్ర సామర్థ్యం గల అగ్ని-1 క్షిపణిని భారత్ నవంబర్ 27న ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఇది 700 కి.మీ. పైగా దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. వెయ్యి కిలోల పేలోడ్‌ను మోసుకుపోగల అగ్ని-1 బరువు 12 టన్నులు, పొడవు 15 మీటర్లు. క్షిపణిలో ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తారు. దీన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేయగా, భారత డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ఉత్పత్తి చేసింది.
 
 పృథ్వీ-2 క్షిపణి పరీక్ష విజయవంతం
 అణ్వస్త్ర సామర్థ్యం గల పృథ్వీ-2 క్షిపణిని భారత్.. నవంబరు 26న ఒడిశాలోని చాందీపూర్ పరీక్షా కేంద్రం నుంచి విజయవంతంగా పరీక్షించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిని భూతలం నుంచి భూతలం పైకి ప్రయోగిస్తారు. ఇది 350 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 500 నుంచి 1000 కిలోల ఆయుధ సామగ్రిని మోసుకెళ్లగలదు.
 
 నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్ కదమత్
 స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్ కదమత్ (ఓ్చఛీఝ్చ్ట్ట)’ నవంబరు 26న నౌకాదళంలోకి చేరింది. శత్రు జలాంతర్గాములను ఎదుర్కొనే ఈ యుద్ధ నౌకను గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ (జీఆర్‌ఎస్‌ఈ) అభివృద్ధి చేసింది. దీని బరువు 3,200 టన్నులు, పొడవు 109 మీటర్లు. 25 నాట్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ తరహాకు చెందిన 4 యుద్ధ నౌకలను ‘పి-28’ ప్రాజెక్ట్ కింద జీఆర్‌ఎస్‌ఈ అభివృద్ధి చేసింది. వీటిలో కదమత్ రెండోది కాగా, మొదటిది ఐఎన్‌ఎస్ కమోర్తాను 2014లో నౌకాదళంలో ప్రవేశపెట్టారు.
 
 ‘బారక్-8’ ప్రయోగం విజయవంతం
 భారత్-ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన బారక్-8 క్షిపణిని జెరుసలేంలో నవంబరు 27న విజయవంతంగా పరీక్షించారు. ఇది 250 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. దీన్ని భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగిస్తారు.
 
 రాజ్యంగ దినోత్సవంగా నవంబరు 26
 రాజ్యాంగ సభ.. 1949, నవంబరు 26న రాజ్యాంగాన్ని లాంఛనంగా ఆమోదించిన సందర్భాన్ని పురస్కరించుకొని, ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా పాటిస్తున్నట్లు నవంబరు 26న లోక్‌సభ ప్రకటించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 26న ప్రారంభమయ్యాయి.
 
 ‘ధనుష్’ ప్రయోగం విజయవంతం
 ధనుష్ బాలిస్టిక్ క్షిపణిని భారత్ నవంబరు 24న ఒడిశా తీరంలో ఐఎన్‌ఎస్ సుభద్ర యుద్ధ నౌక నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఇది 500 కిలోల అణ్వస్త్రాలు, సంప్రదాయ ఆయుధాలను మోసుకెళ్లగలదు. 350 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. దీన్ని నౌకాదళం కోసం స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రూపొందించింది.
 
 రాష్ట్రీయం
  హైదరాబాద్‌లో ఎల్‌ఈడీ తయారీ పరిశ్రమ
 రూ.500 కోట్లతో 50 ఎకరాల్లో ఎల్‌ఈడీ బల్బుల తయారీ పరిశ్రమ యూనిట్ ఏర్పాటుకు సహకారం అందిస్తున్నట్లు నవంబరు 30న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. అమెరికాకు చెందిన అడ్వాన్స్‌డ్ ఆప్ట్రానిక్ డివెసైస్ (ఏవోడీ) కంపెనీతో కలిసి భారత్‌కు చెందిన సిస్కో కంపెనీ ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తుంది.
 
 నౌకాశ్రయ విధానాన్ని ప్రకటించిన ఏపీ
 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబరు 27న నౌకాశ్రయ విధానం (పోర్టు పాలసీ)-2015ను విడుదల చేసింది. ఈ విధానం కింద ప్రధాన ఓడరేవులను విస్తరిస్తారు. 14 చిన్న ఓడరేవులను అభివృద్ధి చేస్తారు. దీనికోసం ‘మారిటైం బోర్డు’ను ఏర్పాటు చేస్తారు. ఓడరేవుల ప్రణాళిక, అభివృద్ధి, పర్యవేక్షణ, రాయితీలు వంటివి ఈ బోర్డు పరిధిలోకి వస్తాయి. అయిదేళ్లకు ఒకసారి ఈ విధానాన్ని సమీక్షిస్తారు.
 
 బాక్సైట్ తవ్వకాలపై ఏపీ శ్వేతపత్రం
 విశాఖపట్నం జిల్లా చింతపల్లి అటవీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నవంబరు 24న శ్వేతపత్రం విడుదల చేశారు. బాక్సైట్ తవ్వకాలను స్థానిక గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రజలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. దేశంలో ఆరు రాష్ట్రాల్లో బాక్సైట్ నిల్వలు ఉండగా, ఒడిశా మొదటి స్థానంలో, ఏపీ రెండో స్థానంలో ఉన్నాయి.
 
 ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ఉదయభాస్కర్
 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా జేఎన్‌టీయూ (కాకినాడ)కు చెందిన ప్రొఫెసర్ పి.ఉదయభాస్కర్ (52)ను ప్రభుత్వం నవంబరు 25న నియమించగా, నవంబరు 27న బాధ్యతలు చేపట్టారు. ఆరు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement