ట్రంప్‌ కళ్లు తెరుస్తారా?! | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ కళ్లు తెరుస్తారా?!

Published Tue, Jan 23 2018 1:04 AM

will trump open his eyes? - Sakshi

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అధికార పీఠం ఎక్కి ఏడాదికాలం పూర్తయిన ప్రస్తుత తరుణంలో ఆయన సాఫల్య వైఫల్యాలపై చర్చించాల్సింది పోయి ఆయన పదవి ఉంటుందా, ఊడుతుందా అన్నదే అందరికీ ఉత్కంఠ రేపే అంశమైంది. ముఖ్యంగా నీలి చిత్రాల తార స్టార్మీ డేనియల్స్‌తో పదేళ్లక్రితం ఆయనకున్న సంబం ధాలు, అవి బయటపడకుండా ఉండటం కోసం ఆమెకు భారీ మొత్తంలో డబ్బు వెదజల్లి నోరుమూయించిన వైనం వెల్లడై అల్లరవుతోంది.

ఈలోగా పులి మీద పుట్రలా అమెరికా ప్రభుత్వం మూతబడి చర్చంతా దానిపైకి మళ్లింది. ట్రంప్‌ పద వికి ముప్పు తీసుకురాగల వివిధ అంశాల జాబితాలో అది కూడా చేరింది. అమె రికాలో ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు గనుక, ఇప్పుడొచ్చిన ఈ తాజా సంక్షోభం రేపో మాపో సమసిపోతుందన్న ఆశ అందరిలోనూ ఉంది.  కానీ ట్రంప్‌ స్థానంలో మరొకరెవరైనా ఉన్నట్టయితే సమస్య ఇంత ముదిరేది కాదన్నది వాస్తవం. సంప్రదాయానికి విరుద్ధమైన తోవన వెళ్లి ‘ఎలాగోలా’ బిల్లును గట్టెక్కించుకోవడా నికి ఆయన అంతా సిద్ధం చేశారని అంటున్నారు. అదే జరిగితే తాత్కాలికంగా ఈ సమస్య నుంచి బయటపడినా భవిష్యత్తులో రిపబ్లికన్‌ పార్టీకి అదో పెద్ద గుదిబం డగా మారకతప్పదు.  
 
అమెరికా సర్కారు మూతబడి అప్పుడే మూడురోజులు కావస్తోంది. శుక్ర వారం అర్ధరాత్రితో మొదలైన ఈ సంక్షోభం ఆదివారానికల్లా ఓ కొలిక్కి వస్తుందని, అధికార రిపబ్లికన్‌ పార్టీ, విపక్ష డెమొక్రటిక్‌ పార్టీ ఒక అవగాహనకొచ్చి ఈ గండం నుంచి దేశాన్ని గట్టెక్కిస్తాయని అందరూ ఆశించారు. కానీ అదేం జరగలేదు. ఫలి తంగా వైట్‌ హౌస్‌లో పనిచేసే సిబ్బందిలోనే చాలామందిని విధుల నుంచి తాత్కా లికంగా తప్పించాల్సివచ్చింది. సైన్యంలో కొత్తగా చేరినవారికి ఇస్తున్న శిక్షణ ఆగిపో యింది. జాతీయభద్రతా విభాగంలో, మరికొన్ని అత్యవసర విభాగాల్లో సిబ్బంది మినహా మిగిలినచోట్ల వేతనాలు లేని సెలవు మంజూరు చేశారు.

విద్య, గృహ నిర్మాణం, పర్యావరణం, వాణిజ్యం వగైరా విభాగాల్లోని వేలాదిమంది ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. న్యూయార్క్‌లోని స్వేచ్ఛాప్రతిమ ఉండే పార్క్‌తోసహా దేశంలోని మూడోవంతు పార్కులు మూతబడ్డాయి. మ్యూజియంలకు తాళాలు వేశారు. చాలినంతమంది సిబ్బంది లేకపోవడంతో ఆ దేశ ప్రైవేటు అంతరిక్ష యాన సంస్థ స్పేస్‌ ఎక్స్‌ భారీ రాకెట్‌ ప్రయోగం వాయిదా పడింది. ఇలా ఎనిమిది లక్షలకు పైగా సిబ్బంది దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఎప్పుడు సంక్షోభం సమసి తమకు మళ్లీ కొలువుకు పిలుపు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

వాస్తవానికి ట్రంప్‌కు దిగువసభలోనూ, సెనేట్‌లోనూ కూడా మెజారిటీ ఉంది. దిగువసభలోని 435మంది సభ్యుల్లో 238మంది రిపబ్లికన్లు. డెమొక్రాట్ల సంఖ్య 193 మాత్రమే. అటు సెనేట్‌లో ఉన్న 100 మంది సభ్యుల్లో 51మంది రిపబ్లికన్లు. 47మంది డెమొక్రాట్లు. దిగువ సభలో ఉన్న మెజారిటీతో వినిమయ బిల్లును సులభంగా గట్టెక్కించుకోగలిగిన ట్రంప్‌ సెనేట్‌లో బోల్తా పడ్డారు. వినిమయ బిల్లు ఆమోదానికి సాధారణ మెజారిటీ సరిపోదు గనుక మరో పది ఓట్లు రిపబ్లికన్లకు తప్పనిసరి. కను కనే కొందరు డెమొక్రటిక్‌ సభ్యులతో మంతనాలు జరిపి వారిలో అయిదుగురిని అనుకూలురుగా మార్చుకున్నారు కూడా.

ఈలోగా స్వపక్షంలోని అయిదుగురు విని మయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయడంతో ఆ వ్యూహం వృథా అయింది. దీనికి పరి ష్కారం కనుచూపు మేరలో లేదనుకుంటే దేశాధ్యక్షుడు తన ప్రత్యేకాధికారాలు ఉపయోగించి సాధారణ మెజారిటీతో బిల్లు ఆమోదం పొందడానికి అనుమతించ వచ్చు. అమెరికా చరిత్రలో 1976 మొదలుకొని ఇంతవరకూ 18సార్లు ఇలా ప్రభు త్వం మూతబడిన సందర్భాలు ఎదురైనా ఏ అధ్యక్షుడూ ఈ అధికారాన్ని వినియో గించుకోలేదు. ప్రతిపక్షంతో ఓపిగ్గా చర్చించి, వారి అభిప్రాయాలకు కూడా ప్రాధా న్యమిచ్చి ఏదో విధంగా సంక్షోభాలను అధిగమించారు.

ఇలా విపక్షానికి విలువ ఇవ్వడం వెనక ఓ భయం కూడా ఉంది. ఇటువంటి కీలకమైన బిల్లును సాధారణ మెజారిటీతో ఆమోదించవచ్చునన్న మినహాయింపునిస్తే భవిష్యత్తులో తమ ప్రత్యర్థి పక్షం కూడా అధికారంలోకొచ్చి ఆ మాదిరే వ్యవహరిస్తుందని అటు డెమొక్రాట్లు, ఇటు రిపబ్లికన్లు కూడా ఈ ప్రత్యామ్నాయాన్ని ఇంతవరకూ ఎంచుకోలేదు. కానీ ట్రంప్‌ ఇప్పటివరకూ వచ్చిన అధ్యక్షుల్లో మొండి ఘటం. ఎప్పుడో ఏదో అవుతుందని భయపడుతూ తలొంచడం ఆయనకు ససేమిరా ఇష్టం లేదు. ఈ విషయంలో పార్టీ సలహాను కూడా ఆయన బేఖాతరు చేయొచ్చని చెబుతున్నారు. 

ఇంతకూ డెమొక్రాట్లు అడుగుతున్నవి గొంతెమ్మ కోర్కెలేమీ కాదు. అక్రమంగా అమెరికాకు వచ్చి నివాసం ఉంటున్నవారి పిల్లల(స్వాప్నికులు) విషయంలో పున రాలోచించాలని, వారిని వచ్చే మార్చిలో బలవంతంగా బయటకు తరిమేసే ప్రతి పాదనను విరమించుకోవాలని డిమాండు చేస్తున్నారు. నిజానికి ట్రంప్‌ ఏడాది పాలనలో స్టాక్‌ మార్కెట్‌లో తళతళలున్నాయి. ఉపాధి అవకాశాలు కూడా అంతో ఇంతో పెరిగాయి. కానీ ప్రభుత్వ రుణం ప్రకోపిస్తోంది. రష్యాతో లాలూచీ, ఇరా న్‌తో కొత్త పేచీలు, ఉత్తర కొరియాతో కయ్యం, నీలి చిత్రాల తారతో సంబంధాలు వగైరా అంశాల్లో ఆయన జనాదరణ గ్రాఫ్‌ పడిపోతోంది. వీటన్నిటి పర్యవసానంగా వచ్చే నవంబర్‌లో కాంగ్రెస్‌కు జరగబోయే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీని జనం ఛీకొడతారన్న భయం కూడా ఆయనలో ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో వలసల విషయంలో మొండిగా ఉన్నట్టు కనబడితేనే అధ్యక్ష ఎన్నికల సమయంలో వలే శ్వేత జాతి అమెరికన్లు తనవైపే ఉండగలరని ఆయన విశ్వసిస్తున్నారు. అందుకోసమే తాజా సంక్షోభం విషయంలో పట్టువిడుపుల్లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇదిలాగే కొన సాగితే దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుందని, సాధించిన కొద్దో గొప్పో విజయాలను కాస్తా ఊడ్చిపెట్టేస్తుందని ట్రంప్‌ గ్రహించకపోతే అంతిమంగా అది ఆయన మెడకే చుట్టుకోవడం ఖాయం. కోట్లాదిమంది పౌరుల జీవితాలతో, వారి భవిష్యత్తుతో ముడిపడి ఉండే కీలకమైన వ్యవహారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలతో, పరువు ప్రతిష్టలతో తూచడం తగని పని.

Advertisement

తప్పక చదవండి

Advertisement