'వాయిదాల' ప్రజాస్వామ్యం! | Stormy monsoon session of Parliament comes to an end | Sakshi
Sakshi News home page

'వాయిదాల' ప్రజాస్వామ్యం!

Aug 13 2015 11:57 PM | Updated on Jul 29 2019 7:43 PM

అనుకున్నట్టే పార్లమెంటు వర్షాకాల సమావేశాలను అధికార, విపక్షాలు రెండూ చాపచుట్టేశాయి.

అనుకున్నట్టే పార్లమెంటు వర్షాకాల సమావేశాలను అధికార, విపక్షాలు రెండూ చాపచుట్టేశాయి. ఆఖరిరోజైన గురువారం విజయ్ చౌక్ నుంచి పార్లమెంటు హౌస్ వరకూ అధికార ఎన్డీయే పక్షాలకు చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రులు 'ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ' ఊరేగింపు తీసి అస్తవ్యస్థంగా సాగిన సమావేశాలక 'సరైన' ముగింపునిచ్చారు. మరో రెండు రోజుల్లో 68వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోబోతున్న తరుణంలో... అధికార పక్షమే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని రోడ్డెక్కడం మన దేశంలో సాగుతున్న రాజకీయాల తీరుతెన్నులకు పరాకాష్ట. గత నెల 21న మొదలైన నాటినుంచీ ఒక్క రోజైనా సమావేశాలు సక్రమంగా జరగలేదు. ఒక్కనాడైనా ప్రజా సమస్యలు చర్చకు రాలేదు. పార్లమెంటు చరిత్రలో తొలిసారి విపక్షానికి చెందిన 25 మంది ఎంపీలను సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించారన్న కారణంతో అయిదురోజులు సస్పెండ్ చేశారు. కొన్ని దశాబ్దాల క్రితం విప్లవ రాజకీయ నాయకుడు తరిమెల నాగిరెడ్డి శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తూ చట్టసభలను 'బాతాఖానీ క్లబ్'లతో పోల్చారు. అవి ఇప్పుడు చేపల మార్కెట్‌ని మించిపోయాయని వర్తమాన పరిణామాలను చూసి ఎవరైనా అనుకుంటే అది వారి తప్పు కాదు.


 అంతా అయ్యాక సమావేశాలిలా అఘోరించడానికి  కారణం 'మీరంటే  మీర'ని అధికార, విపక్షాలు నిందించుకుంటున్నాయి. ఇందువల్ల మన ప్రజాస్వామ్యానికి కలిగిన అప్రదిష్ట...కీలకమైన బిల్లులు పెండింగ్‌లో పడిపోవడంవల్ల దేశానికి జరిగిన నష్టం ఎంతన్న సంగతిని పక్కనబెడితే అధికారిక లెక్కల ప్రకారమే రూ. 260 కోట్ల ప్రజాధనం వృథా అయింది. కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్, వారికి సంఘీభావంగా మిగిలిన విపక్షాల సమావేశాల బహిష్కరణ పర్యవసానంగా లోక్‌సభలో కొన్ని బిల్లులు మాత్రం ఆమోదం పొందాయి. విపక్షాల ఆధిక్యత ఉన్న రాజ్యసభలో మాత్రం నిత్యం వాయిదాలే కొనసాగాయి. పార్లమెంటు సమావేశాల్లో ఎప్పుడూ ప్రశాంతంగా కనబడే తల్లీకొడుకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఈసారి  స్వరం పెంచి మాట్లాడారు. సోనియా అయితే తన భర్త రాజీవ్‌గాంధీపై బీజేపీ సభ్యుడొకరు చేసిన వ్యాఖ్యానంతో ఆగ్రహించి పోడియంవైపు దూసుకెళ్లారు. ఆ వ్యాఖ్యను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు సుమిత్రా మహాజన్ ప్రకటిస్తే తప్ప ఆమె ఆగ్రహం చల్లారలేదు.


 సమావేశాలకు ఇంకా వారం రోజుల సమయం ఉందన్నప్పుడే అవి ఎలా ఉండబోతున్నాయో దేశ ప్రజలకు అర్థమైంది. లలిత్‌మోదీ వ్యవహారంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే సింధియాలు రాజీనామా చేయాలని... వ్యాపం కుంభకోణంలో జరిగిన 48 అనుమానాస్పద మరణాలకు బాధ్యతవహించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తప్పుకోవాలని కాంగ్రెస్ చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తోంది. పార్లమెంటు సమావేశాల్లో వీటిని ప్రధాన ఆయుధాలుగా చేసుకుంటామని చెప్పింది. కనుక సమావేశాలు సక్రమంగా జరిగే అవకాశం లేదని బీజేపీకి ముందే తెలుసు. ప్రధాని నరేంద్ర మోదీయే స్వయంగా సమావేశాలకు నాలుగు రోజుల ముందు ఒక సభలో సూచన ప్రాయంగా ఆ సంగతి చెప్పారు. మరి అలాంటి స్థితిని తప్పించడానికి బాధ్యతగల అధికార పక్షంగా బీజేపీ చేసిందేమిటి? ఆరోపణలొచ్చినవారితో ఆ వ్యవహారాలపై వివరణనిప్పించిందా? కనీసం వారిపై ఏదో రకమైన చర్యకైనా సిద్ధపడిందా? ఏం చేసుకుంటారో చేసుకోండని మౌనంగా ఉండిపోయింది. సభలో ఎంత గందరగోళం నెలకొని ఉన్నా సుష్మా స్వరాజ్ సమావేశాలు ముగియడానికి ఒక్కరోజు ముందు తన వాదనను ఏదో మేరకు వినిపించారు. ఆ పని ఆమె మొదటే ఎందుకు చేయలేక పోయారు? 'ముందు రాజీనామా... తర్వాతే చర్చ'అని మొదటిరోజునుంచీ సమావేశాలను స్తంభింపజేసిన కాంగ్రెస్ ఆ రోజు ఆమె చేసిన ప్రసంగాన్ని విన్నది. రాహుల్ ఆమె చేసిన వ్యాఖ్యలన్నిటికీ జవాబులిచ్చారు. సుష్మా రాజీనామా చేసే ప్రసక్తే లేదని... కావాలంటే చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెప్పినప్పుడు కాంగ్రెస్‌కు ఈ బుద్ధి ఎక్కడకు పోయింది? ఏం చెబుతారో విన్నాక తమ డిమాండ్‌ను కొనసాగించాలో, వదులుకోవాలో నిర్ణయించుకోవచ్చునన్న స్పృహ ఎందుకు లేక పోయింది? తాము పాలకులుగా ఉన్నప్పుడు బీజేపీ పార్లమెంటును స్తంభింపజేసింది గనుక తామూ అదే పని చేయాలనుకోవడం తప్ప కాంగ్రెస్‌కు వేరే ఎజెండా లేదు.
 సమావేశాలు సరిగా సాగడంపై అధికార పక్షానికి కూడా పెద్ద ఆసక్తి ఉన్నట్టు కనబడదు. అదే గనుక ఉంటే ప్రవర్తించాల్సిన తీరిదేనా? విపక్షాలను పిలిచి చర్చించడం... వారు కోరుతున్న డిమాండ్ల విషయంలో తమ వైఖరేమిటో చెప్పి ఒప్పించడానికి ప్రయత్నించడం వంటి చర్యలు తీసుకోవడానికి ఎందుకు చొరవ తీసుకోలేకపోయింది? ప్రభుత్వ సారథులుగా అది వారి బాధ్యత కాదా? సమా వేశాలు సరిగా సాగితే తాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూసేకరణ బిల్లుపైనా, ఆ చట్టానికి సవరణ తెస్తూ జారీచేసిన ఆర్డినెన్స్‌లపైనా చర్చ జరుగుతుందని...బిహార్ ఎన్నికల ముందు ఇది మంచిదికాదని అధికార పక్షం అనుకుందా? ఎన్డీయే పెద్దలు జవాబివ్వాలి. మొత్తానికి సమావేశాలు వృథా కావడంలో ఇరు పక్షాల బాధ్యతా ఉంది. పర్యవసానంగా పలు బిల్లులు పెండింగ్‌లో పడటమే కాక ఎన్నో ముఖ్యాంశాలు చర్చకు రాకుండా పోయాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, స్వయంగా సీఎంపైనే ఆరోపణలొచ్చిన 'ఓటుకు కోట్లు' కేసు, గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట వంటివి చర్చ మాట అటుంచి, కనీసం ప్రస్తావనకు రాలేదు. దేశవ్యాప్తంగా ఇంకా కొనసాగుతూనే ఉన్న రైతు ఆత్మహత్యలూ పార్లమెంటు దృష్టికి రాలేదు. సాధారణ ప్రజానీకంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యమంటే ఏవగింపు కలగకముందే అన్ని పక్షాలూ మేల్కొనాలి. తమ ప్రవర్తనను సరిదిద్దుకోవాలి. పార్లమెంటును బలప్రదర్శనల వేదికగా మార్చే ధోరణిని వదులుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement