నదుల ఘోష విందాం

Sakshi Editorial On River Protection

ఎక్కడో పుట్టి వందల కిలోమీటర్లు ప్రయాణించి అడవులు, కొండలు, కోనలు దాటుకుని ‘నాగరిక ప్రపంచం’లోకి అడుగుపెట్టే నదులపై మనకు నిర్లక్ష్యం పెరిగిపోయింది. జీవకోటికి  జీవధారలుగా, వరప్రదాయినిలుగా ఉంటున్న ఆ నదులను చేజేతులా కాలుష్య కాసారాలుగా మారుస్తున్నాం.  కూర్చున్న కొమ్మను నరుక్కునే మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తున్నాం. ప్రధానమైన కృష్ణా, గోదావరి నదుల్లో ఆక్సిజన్‌ స్థాయి క్షీణిస్తున్నదని, ఇది ప్రమాదకరమని వెలువడిన కథనం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. నదులు సంక్లిష్టమైనవి, చలనశీలమైనవి. కనుకనే వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. నిత్యం పర్యవేక్షిస్తుండాలి. దురదృష్టవశాత్తూ మన దేశంలో అలాంటి పర్యవేక్షణ లోపిస్తున్నది.

ఇక్కడ నదుల్ని దేవతలుగా కొలిచే సంప్రదాయం ఉంది. నదిలో స్నానమాడితే పాపాలు హరించు కుపోతాయన్న విశ్వాసాలున్నాయి. కానీ జనావాసాల నుంచీ, పరిశ్రమల నుంచీ భారీయెత్తున మురుగునీరు, వ్యర్థాలు వచ్చి కలుస్తుంటే నిలదీసే, నివారించే సంస్కృతి ఉండటం లేదు. తెలంగాణలో 54 నదీ పరీవాహక పట్టణాల నుంచి కృష్ణా, గోదావరి నదుల్లోకి మురుగునీరు వచ్చి చేరుతున్నది. ఇక పరిశ్రమల సంగతి సరేసరి. పారిశ్రామిక వ్యర్థాలను ఎలా శుద్ధి చేయాలో, నిరపా యంగా మార్చడానికి ఏయే చర్యలు అవసరమో నిబంధనలున్నాయి. కానీ కఠిన చర్యలు కరువవు తున్నాయి. అసలు పర్యవేక్షించడానికి అవసరమైన సంస్థలే సరిగా లేవు.  

నదుల ప్రక్షాళన కోసమంటూ వందల కోట్లు ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. కానీ ఎప్పటి   కప్పుడు మురుగు నీరు వచ్చి చేరడం, పారిశ్రామిక వ్యర్థాలు కలవడం వగైరాలు నిరంతరాయంగా సాగుతుంటే ఈ వ్యయమంతా వృధా అవుతున్నది. గంగా నదే అందుకు ఉదాహరణ. అది 2,500 కిలోమీటర్ల మేర ప్రవహించి బంగాళాఖాతం చేరేసరికి పలు పట్టణాలు, నగరాల్లో మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు దానిలో కలుస్తున్నాయి. గంగా కార్యాచరణ పథకం కింద అనేక నగరాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, విద్యుత్‌ దహనవాటికలు, మరుగుదొడ్లు నిర్మించాలని తలపెట్టారు. ఆ ప్రాంతాల్లో ఉండే పరిశ్రమలు కాలుష్యశుద్ధి యంత్రాలు సమకూర్చుకునేలా చూడాలని నిర్ణయిం  చారు. కానీ ఈ పనంతా అనుకున్న స్థాయిలో సాగలేదు. పర్యవేక్షణా యంత్రాంగం సక్రమంగా లేకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. దేశంలో బాగా కాలుష్యం బారిన పడిన 13 నదుల్ని గుర్తిస్తే అందులో కృష్ణా, గోదావరి నదులున్నాయి.

ఆమధ్య టాటా సెంటర్‌ ఫర్‌ డెవెలప్‌మెంట్‌(టీసీడీ) ఒక అమెరికన్‌ యూనివర్సిటీతో కలిసి దేశంలో జల, వాయు, పర్యావరణ కాలుష్యం గురించి పరిశోధనలు చేసింది. ఈ మూడింటా మన దేశం ప్రమాదపుటంచుల్లో ఉన్నదని తేల్చింది. గంగ, యమున నదులపై కేంద్రీకరించి ఆ పరిశోధనలు సాగినా అవి దేశంలోని నదులన్నిటికీ వర్తిస్తాయి. ఒకపక్క నదుల ప్రక్షాళన సాగిస్తూనే వాటిలో మురుగునీరు చేరకుండా, పారిశ్రామిక వ్యర్థాలు కలవకుండా చర్యలు అవసరమని ఆ పరిశోధన తేల్చింది. మురుగునీటిని లేదా పారిశ్రామిక వ్యర్థా లను శుద్ధి చేసి నదుల్లోకి వదలడమనేది తాత్కాలిక పరిష్కారమార్గమేనని కూడా తెలిపింది.

ఆ రెండూ నదుల్లో కలవకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నప్పుడే అవి సవ్యంగా ఉండగలుగు తాయన్నది ఆ పరిశోధన చెబుతున్న మాట. నదుల కాలుష్యం వల్ల పర్యవసానాలెలా ఉంటాయో, కాలుష్య నివారణ కోసం చేసే వ్యయం ఏ స్థాయిలో ఉంటున్నదో ప్రజలకు తెలియజేయడం...  వ్యర్థాలను నియంత్రించడానికి తగిన చర్యలు తీసుకోని పరిశ్రమలతో కఠినంగా వ్యవహరించడం అవసరం. మెరుగైన నదీ జలాల ప్రమాణాలు ఏమిటో, అవి ప్రస్తుతం ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహనయ్యేలా తెలియజేస్తుండటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇందుకోసం క్రమం తప్పకుండా నీటి నమూనాలను సేకరించి, పరీక్షించే వ్యవస్థలుండాలి. నమూనాలను సేకరించడం, వాటిని ప్రయోగశాలలకు తరలించడం, పరీక్షలు నిర్వహించడం వగైరాల కోసం ఇప్పుడనుసరిస్తున్న విధానాలు కూడా మారాల్సిన అవసరం ఉంది.

అవి ఎంతో ఖర్చుతో కూడు కున్నవి. పైగా ఫలితాలు వెలువడటంలో అంతులేని జాప్యం చోటు చేసుకుంటుంది. కనుక అత్యా ధునిక సాంకేతికతను వినియోగించి వెనువెంటనే ఫలితాలు రాబట్టే వ్యవస్థల్ని అందుబాటులోకి తీసుకురావాలి. టీసీడీ, షికాగో యూనివర్సిటీలు గంగా నదిపై సాగించిన పరిశోధనల్లో వాటర్‌ టు క్లౌడ్‌(డబ్ల్యూ2సీ) ప్రాజెక్టును అమలు చేశాయి. గంగానదిపై వారణాసి, కోల్‌కతా నగరాల్లో...   యమునా నదిపై న్యూఢిల్లీలో దీనికింద పరిశోధనలు సాగాయి. ఏయే ప్రాంతాల్లో ఏ సమయాల్లో వ్యర్థాలు నదుల్లోకి వచ్చి కలుస్తున్నాయో నిర్దిష్టంగా గుర్తించడం, కారకులెవరో తెలుసుకోవడం ఆ ప్రాజెక్టు కింద చాలా సులభమైందని టీసీడీ చెబుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా వెలువడిన డేటా వల్ల ఎక్కడెక్కడ ప్రభుత్వాల జోక్యం అవసరమో వెనువెంటనే తెలుసుకోవడం సాధ్యమైంది. కేవలం ప్రభుత్వాల జోక్యం మాత్రమే కాదు... ప్రజలను కూడా నదీజలాల పరిరక్షణలో భాగస్వాముల్ని చేయాలి. 

దేశవ్యాప్తంగా నదుల్ని పరిరక్షించడానికి రూ. 33,000 కోట్లు అవసరమని దాదాపు పదేళ్లక్రితం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇప్పుడది రెట్టింపు దాటిపోతుంది. ఇంత సొమ్ము వెచ్చించడం సాధ్యమవుతుందా కాదా అన్న సంగతలా ఉంచి... ఆ పని చేసినా సత్ఫలితాలు లభిస్తాయో లేదో తెలియని స్థితి. దేశంలో మొత్తంగా 14 పెద్ద నదులు, 55 చిన్న నదులు ఉన్నాయి. వీటన్నిటిలోనూ రోజూ లక్షల లీటర్ల పరిమాణంలో మురుగు, పారిశ్రామిక వ్యర్థాలు కలుస్తున్నాయి. ఈ నీటిపై ఆధారపడక తప్పని ప్రజానీకం ప్రాణాంతక రోగాల బారిన పడుతున్నారు. ఆర్థికంగా కుంగిపోతున్నారు. పరిస్థితి తీవ్రతను గుర్తించి ప్రభుత్వాలు సకాలంలో మేల్కొనాలి. నదుల పరి రక్షణకు నడుం బిగించాలి. కఠినమైన చర్యలు తీసుకోవాలి. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top