ఈ వైఫల్యం ఒక సవాలు

ఈ వైఫల్యం ఒక సవాలు - Sakshi


అంతరిక్ష ప్రయోగం అనేది జయాపజయాల దోబూచులాట. ఓటమి ఎప్పుడూ విజయానికి చేరువలో తచ్చాడుతుంటుంది. అన్నీ బాగున్నాయనుకున్నచోటే ఏదో ఒక లోపం మానవ దృష్టి క్షేత్రాన్ని తప్పించుకునే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అంచనాల్లో వెంట్రుకవాసి తేడా వచ్చినా వైఫల్యం విరుచుకుపడుతుంది. సొంత దిక్సూచి వ్యవస్థను బలోపేతం చేసుకోవడం కోసం గురువారం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపేందుకు ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ–39 రాకెట్‌ వైఫల్యానికి లోనుకావడం బాధాకరమైన విషయమే. ఇటీవలికాలంలో ఇస్రో విజయపరంపరకు మారుపేరుగా నిలిచిన కారణంగా ఈ వైఫల్యం నిరాశ కలిగించడం సహజం. అయితే ఇన్నాళ్లుగా ఆ సంస్థ సాధిస్తున్న విజ యాలు అలవోకగా ఏమీ రాలేదు.



1969 ఆగస్టు 15న ప్రారంభమైన ఇస్రో ప్రయా ణం ఎన్నో ఒడిదుడుకులను, అడ్డంకులను, వైఫల్యాలను చవిచూసింది. ప్రతి వైఫల్యంనుంచీ గుణపాఠం నేర్చుకుంటూ ఒక శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నించింది. ముఖ్యంగా మన శాస్త్రవేత్తలకు పీఎస్‌ఎల్‌వీ అందివచ్చిన అంతరిక్ష వాహక నౌక. ఎన్నడో 1993లో తొలిసారి ఆ రాకెట్‌ను ప్రయోగించి ఐఆర్‌ఎస్‌–1 ఉపగ్రహాన్ని పంపినప్పుడు ఎదురైన వైఫల్యం తప్ప ఈ 24 ఏళ్లలోనూ ఏనాడూ అది ఆశాభంగం కలిగించలేదు. పంపించిన ప్రతిసారీ తిరుగులేని విజయాన్నందించింది. వరసగా 39 ప్రయోగాలూ ఘన విజయం సాధించాయంటే అది పీఎస్‌ఎల్‌వీ విశిష్టతే.



గురువారం నాటి ప్రయోగం అనేక రకాల విశిష్టమైనది. గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌(జీపీఎస్‌) మాదిరే మన రక్షణ, పౌర అవసరాలకు వినియోగపడేలా స్వదేశీ దిక్సూచి వ్యవస్థ ఉండాలని ఇస్రో సంకల్పించింది. అమెరికా, రష్యా, యూరప్, చైనాలు వేటికవి సొంత దిక్సూచి వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకున్నాయి. అమెరికాకు చెందిన జీపీఎస్‌ మనకు అందుబాటులోనే ఉంది. అయితే కీలక సమయంలో అది మొహం చాటేసే ప్రమాదం కూడా లేకపోలేదని కార్గిల్‌ యుద్ధం రుజువు చేసింది. మన దళాలు కార్గిల్‌ ప్రాంతం నుంచి పాక్‌ సేనలను తరిమికొట్టే తరుణంలో ఉద్దేశ పూర్వకంగా అమెరికా ఆ సేవలను ఆపేసింది. భవిష్యత్తులో ఇక ఎవరిపైనా ఆధార పడకూడదన్న దృఢ సంకల్పంతో ఇండియన్‌ రీజినల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌)కింద ఇస్రో 1ఏ తో మొదలుబెట్టి 1జీ వరకూ ఏడు ఉపగ్రహా లను అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. ఈ నెట్‌వర్క్‌లోని ఆఖరి ఉపగ్రహం 1జీని నిరుడు ఏప్రిల్‌లో విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టింది.



అయితే 2013లో ప్రయోగించిన 1ఏలో ఉన్న మూడు రుబీడియం పరమాణు గడియారాలు గత ఏడాదినుంచి మొరాయిస్తున్నాయి. అవి మినహా అందులో ఉన్న మిగిలిన వ్యవస్థ లన్నీ సరిగానే ఉన్నాయి. నిజానికి ఒకటి రెండు ఉపగ్రహాల్లోని పరమాణు గడియా రాలు పనిచేయకపోయినా నెట్‌ వర్క్‌లో ఉన్న ఇతర ఉపగ్రహాల్లోని గడియారాలతో అంతా సవ్యంగా గడిచిపోతుంది. కానీ సమయ నిర్ధారణలో అత్యంత ఖచ్చితత్వం ఉండటం అవసరమన్న అభిప్రాయంతో ఈ 1హెచ్‌ ఉప గ్రహాన్ని ప్రయోగించారు. ఏదైనా నేరం చోటుచేసుకున్నప్పుడు అది ఖచ్చితంగా ఏ సమయానికి జరిగింద న్నది కీలకమవుతుంది. సైబర్‌ నేరాల గుర్తింపులో ఇది ఎంతో అవసరం. ఆన్‌లైన్‌లో ఒక్క సెకను వ్యవధిలో లక్షలాది లావాదేవీలు సాగుతున్న నేపథ్యంలో నిర్దిష్టతలో లోపం ఉంటే అది సమస్యల్ని సృష్టిస్తుంది. అందుకనే మరో ఉపగ్రహం ప్రయోగిం చడమే మేలని శాస్త్రవేత్తలు నిర్ధారణకొచ్చారు. అంతరిక్షంలో ఉపగ్రహాలు ఏళ్ల తర బడి భ్రమణంలో ఉండటం వల్ల అందులోని వ్యవస్థల సామర్థ్యం క్రమేపీ తగ్గుతుం టుంది. పరమాణు గడియారాలకు సంబంధించినంత వరకూ ఒక సెకను తేడా రావాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. అయినా మన 1ఏ ఉపగ్రహం లోని పరమాణు గడియారం ఎందుకనో మొరాయించింది. నిజానికిది మనకొ క్కరికే సమస్య కాలేదు. అమెరికా తదితర దేశాలకు చెందిన కొన్ని ఉపగ్రహాల్లోని పరమాణు గడియారాల్లో కూడా లోపాలు తలెత్తాయి. అందుకోసం ఆ దేశాలు కూడా ప్రత్యామ్నాలపై దృష్టిపెట్టాయి.



ఇప్పుడేర్పడిన వైఫల్యానికి కారణం రాకెట్‌ శిఖర భాగాన అమర్చిన ఉష్ణ కవచం విచ్చుకోకపోవడమేనని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారుగానీ ఆ ఉష్ణ కవచంలో నిర్దిష్టంగా ఏది దెబ్బతిని ఉంటుందో తేల్చడం అంత సులభ మేమీ కాదు. ఉష్ణకవచాన్ని పట్టి ఉంచే బోల్టులలో ఏర్పడ్డ లోపమే అది విచ్చుకోకపో వడానికి కారణం కావొచ్చునన్నది వారి అంచనా. అది విచ్చుకోవడానికి రెండు కమాండ్‌ సిగ్నల్స్‌ అవసరం. ఇవి మిషన్‌ కంట్రోల్‌ రూంకు అందకపోవడం వల్ల ఉష్ణకవచం విచ్చుకోకపోయి ఉండొచ్చు. అయితే రెండు కమాండ్‌ సిగ్నల్స్‌ ఏక కాలంలో పనిచేయకపోవడానికి కారణాలేమిటన్నది అంతుబట్టని విషయం. నిజా నికి రాకెట్‌ ప్రయోగాన్ని అనుకున్నకంటే ఒక్క నిమిషం ఆలస్యం చేశారు. అంత రిక్షంలో తిరుగాడుతున్న శిథిలం ఒకటి పీఎస్‌ఎల్‌వీ –సీ39 రాకెట్‌ మార్గంలో అడ్డురావొచ్చునని భావించి ఈ స్వల్ప సమయాన్ని తీసుకున్నారు. మొదటి రెండు దశలూ అనుకున్న క్షణాలకే పూర్తయినా మూడో దశ, నాలుగో దశల్లో తేడా వచ్చింది. నాలుగో దశ 1128 సెకండ్లకు విడిపోవాల్సి ఉండగా అది 1039 సెకండ్లకే విడినట్టు రాకెట్‌ గమన పట్టిక సూచిస్తోంది.



అప్పుడు కూడా ఉపగ్రహం పాక్షికంగా మాత్రమే రాకెట్‌ నుంచి విడిపోయింది. ఆ సమయంలో ఉపగ్రహానికుండే మోటార్లు పనిచేసేలా చేస్తే ఆ ఉపగ్రహం విడిపోయే అవకాశం ఉందిగానీ అందు వల్ల దానిలోని పరికరాలు దెబ్బతింటాయని శాస్త్రవేత్తలు భావించి ఉండొచ్చు. వచ్చే నవంబర్‌లో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌లో భాగంగా మరో ఉపగ్రహం 1ఐ ను ప్రయో గించాల్సి ఉంది. అది పూర్తయ్యాక వచ్చే ఏడాది ఆ దిక్సూచి వ్యవస్థ కోసమే మరో రెండు ఉపగ్రహాలను కూడా ప్రయోగించాలనుకున్నారు. ఇప్పుడు ఏర్పడ్డ వైఫ ల్యాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి ఒక నిర్ణయానికొచ్చాకే తదుపరి ప్రయోగాలు ఉండొచ్చు. ఇస్రో దీన్నొక సవాలుగా తీసుకుని మరింత పట్టుదలతో పనిచేసి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆశిద్దాం.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top