గంగపై స్పష్టత ఏది?

గంగపై స్పష్టత ఏది? - Sakshi


గంగాహారతి సందర్భంగా నరేంద్ర మోదీ రెండేళ్లనాడు ఈ దేశ ప్రజానీకానికి ఒక నికరమైన వాగ్దానాన్ని చేశారు. అప్పటికాయన ఇంకా ప్రధాని కాలేదు. 2019లో జరగబోయే మహాత్మాగాంధీ 150వ జయంతి లోపు గంగానదిని ప్రక్షాళన చేసి బాపూజీ స్మృతికి ఘన నివాళి అర్పిద్దామన్నది ఆ వాగ్దానం సారాంశం. అధికారంలో కొచ్చిన వెంటనే దానికి కొనసాగింపుగా గంగా పునరుజ్జీవనం కోసమని ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసి దాన్ని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా చేర్చారు. ఎంతో చురుగ్గా, చిత్తశుద్ధితో పనిచేస్తారని పేరున్న ఉమాభారతికి ఆ శాఖల్ని కేటాయించారు.


 


ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక జరిగిన తొలి స్వాతంత్య్ర దినోత్సవంనాడు సైతం మోదీ గంగా నదీ ప్రక్షాళన గురించి ప్రస్తావించారు. దీర్ఘకాలంగా అది సాగుతూనే ఉన్నా వైఫల్యాలే మిగలడానికి గల కారణాలను కూడా ఆయన సరిగానే గుర్తించారు. ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వ హయాంలో వివిధ ప్రభుత్వ విభాగాలమధ్య ఏకాభిప్రాయం కొరవడిన తీరునూ... ఒకరిపై ఒకరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసుకున్న వైనాన్నీ వివరించారు. ప్రభుత్వ విభాగాలమధ్య ఉన్న ఈ అడ్డుగోడల్ని కూల్చే పనులు మొదలయ్యాయని కూడా చెప్పారు. కానీ ఈ 18 నెలల్లో సాధించిన ప్రగతిని గమనిస్తే ఎంతో నిరాశ కలుగుతుంది.


 


గంగా నదిపై జల విద్యుత్ ప్రాజెక్టుల అనుమతికి సంబంధించి కేంద్రంలోని రెండు కీలక మంత్రిత్వ శాఖలు ఏకాభిప్రాయానికి రాలేక వివాదంలో కూరుకుపోయాయి. మొత్తం ఆరు జల విద్యుత్ ప్రాజెక్టుల్లో వెనువెంటనే మూడింటికి అనుమతులనీయవచ్చునని, మరో రెండు ప్రాజెక్టులకు సంబంధించి వాటి డిజైన్లను మార్చాక పరిశీలించవచ్చునని ప్రకాశ్ జవ్డేకర్ నేతృత్వంలోని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ నెల 7న సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్లలో పేర్కొంది. జలవనరుల శాఖ అందుకు విరుద్ధమైన అభిప్రాయంతో ఉంది. ప్రాజెక్టులను అనుమతించరాదని అంటున్నది.


 


రెండేళ్లక్రితం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పోటెత్తిన వరదలు ఎంతటి విలయాన్ని సృష్టించాయో ఇంకా ఎవరూ మర్చిపోలేదు. దాదాపు పదివేలమంది మరణించా రని జాతీయ విపత్తుల నియంత్రణ ప్రాధికార సంస్థ(ఎన్‌డీఎంఏ) అంచనా వేసింది. వరదలవల్ల బదరీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి తదితర పుణ్యక్షేత్రాలు పెను విధ్వంసాన్ని చవిచూశాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ బీభత్సంపై ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. గంగానది, దాని ఉపనదులపై నిర్మించిన అనేకానేక జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం కారణంగానే ఈ ప్రకృతి విపత్తు సంభవించిందా అనే అంశాన్ని తేల్చమని ఈ కమిటీకి సూచించింది.


 


ప్రాజెక్టుల కోసం నిర్మించే సొరంగాలు, జలాశయాలు నదుల సహజ గమనాన్ని అడ్డుకుంటు న్నాయని ఆ కమిటీ పేర్కొంది. ఆఖరికి నిరుడు ఫిబ్రవరిలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన కమిటీ సైతం ప్రాజెక్టులవల్లే సమస్యలు ఉత్పన్నమ వుతున్నాయని కోర్టుకు తెలిపింది. కానీ నిరుడు అక్టోబర్‌లో ఏర్పడిన మరో కమిటీ మాత్రం అందుకు విరుద్ధమైన వాదనలు చేసింది. డిసెంబర్‌లో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంపై మరో కమిటీని ఏర్పాటు చేసింది. ప్రాజెక్టుల నిర్మాణాన్ని అనుమతించరాదంటూ ఆ కమిటీ నివేదిక ఇచ్చింది.


 


ఈ గొడవంతా ఇలా ఉండగానే అయిదు జల విద్యుత్ ప్రాజెక్టులను అనుమ తించవచ్చునని సుప్రీంకోర్టు ముందు పర్యావరణ మంత్రిత్వ శాఖ అఫిడవిట్లు దాఖలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏదైనా అంశంపై ప్రభుత్వానికి ఒక స్పష్టమైన అభిప్రాయమంటూ ఉండాలని అందరూ ఆశిస్తారు. ఒకవేళ వివిధ మంత్రిత్వ శాఖల మధ్య ఏ అంశం విషయంలోనైనా విభేదాలుంటే నాలుగు గోడల మధ్య చర్చించుకోవాలి. ఆలస్యమైనా అంగీకారానికొచ్చిన తర్వాతే ఒక విధానాన్ని ప్రకటించాలి. కానీ వివిధ మంత్రిత్వ శాఖల మధ్య ఏకాభిప్రాయం మాట అటుంచి... ఒక శాఖలోనే వేర్వేరు అభిప్రాయాలుంటున్నాయని జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని అనుమతించే విషయంలో రుజువైంది. పర్యావరణ మంత్రిత్వ శాఖకూ, జల వనరుల మంత్రిత్వ శాఖకూ విభేదాలొస్తే ఆ శాఖల మంత్రులిద్దరూ రెండు శాఖల అధికారులనూ సమావేశపరిచి ఎవరి వాదనలేమిటో తెలుసుకోవాలి. చివరకు ఒక తుది నిర్ణయానికి రావాలి.


 


అయితే రెండు శాఖల మధ్యా సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం ఉన్నా, ఏకాభిప్రాయ సాధన దిశగా కృషి జరగడంలేదు. సుప్రీంకోర్టులో దాఖలు చేయబోయే అఫిడవిట్ ముసాయిదాను పర్యావరణ మంత్రిత్వ శాఖ పద్ధతిగా ఈ నెల 5న జల వనరుల శాఖకు పంపింది. దాన్ని చూసిన ఉమాభారతి ఈ అఫిడవిట్‌ను దాఖలు చేయొద్దని పర్యావరణ శాఖకు సూచించారు. రెండు శాఖలూ కలిసి కూర్చుని చర్చించాకే ప్రభుత్వ విధా నాన్ని సుప్రీంకోర్టు ముందు పెట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. అందుకోసం సుప్రీంకోర్టును మరింత గడువు కోరాలని సలహా ఇచ్చారు. తీరా ఈ నెల 7న పర్యావరణ శాఖ సుప్రీంకోర్టులో ఆ అఫిడవిట్‌ను దాఖలు చేసింది.


 


సరిగ్గా ఇలాంటి వైఖరులే మూడు దశాబ్దాలుగా గంగానది ప్రక్షాళనకు పెను శాపంగా మారాయి. దేశంలోని 11 రాష్ట్రాల్లోని 181 నగరాలు, పట్టణాల మీదుగా పయనించే గంగానదిలో నానావిధ వ్యర్థాలు వచ్చి చేరుతున్నాయి. మురుగు నీటి వ్యవస్థ సరిగా లేకపోవడంవల్లా, తీరం పొడవునా ఉన్న దాదాపు 750 పరిశ్రమల వల్లా అది కాలుష్య కాసారంగా మారుతున్నది. మరోపక్క ఆ నదిపై ఇప్పటికే ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులు దాని ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. కొత్త ప్రాజెక్టుల్ని ఆ నది ఎంతమాత్రమూ భరించే స్థితిలో లేదని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. కనీసం ఈ దశలోనైనా మేల్కొని మెరుగ్గా వ్యవహరించకపోతే ఆ నది మరింతగా నాశనమవుతుంది. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య ఏర్పడిన విభేదాలను పరిష్క రించి, గంగానది పునరుజ్జీవానికి చేపట్టిన కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలూ సాగేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషిచేయాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top