‘ఫలవంతం’ అర్ధమేమిటి?

Editorial On Parliament Monsoon Session - Sakshi

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 17 రోజులపాటు కొనసాగి శుక్రవారం ముగిశాయి. ఈసారి సమావేశాలు ఫలవంతమయ్యాయని అటు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్, ఇటు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారి వరకూ ఎజెండా ప్రకారం సమావేశాలు సాగితే, అవాంతరాల బారిన పడకపోతే అవి ఫలవంతమైనట్టే. సభాధ్యక్షులు గనుక వారికి ఆ దృష్టి ఉండటం సహజం. అయితే చట్టసభలకు ప్రతినిధులను ఎన్నుకున్న ప్రజలు దీంతోపాటు ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. తాము ఏ పార్టీ తరఫున గెలిపించామో అదే పార్టీలో తమ ప్రతినిధి కొనసాగుతున్నారా లేదా అన్నది అందులో కీలకమైనది. ఎందుకంటే ఒక పార్టీ విధానాలు నచ్చి ఆ పార్టీ తరఫున బరిలో నిల్చున్నవారిని ప్రజలు ఎన్నుకుంటారు. ఆ విధానాలనే ఆ ప్రతినిధులు పార్లమెంటులో ప్రతిబింబించాలని వారు కోరుకుంటారు.

కనుక ఫిరాయించిన చట్టసభల సభ్యులు ఆ నియోజకవర్గ ప్రజలకు ప్రతినిధులయ్యే అర్హత కోల్పోతారు. అందువల్ల అలాంటివారు ఆ పార్టీ ద్వారా లభించిన పదవిని వదులుకుని ప్రజా తీర్పును కోరుతూ మళ్లీ బరిలో నిలబడవలసిందే. వారికి ఆ మాదిరి విలువలు లేని పక్షంలో సభాధ్యక్షులుగా ఉన్నవారు చట్టప్రకారం వ్యవహరించి వారిని బయటకు సాగనంపాలి. అనర్హత వేటు వేయాలి. అప్పుడు మాత్రమే చట్టసభల సమావేశాలు ఫలవంతమైనట్టు. ప్రజాభీష్టాన్ని ప్రతిబింబించినట్టు. అందుకు భిన్నంగా ఎవరైనా సభలో కూర్చుంటే ఆ సమావేశాలు అర్ధరహితమవుతాయి. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. ఆ దుస్థితి ఏర్పడకుండా కాపాడాల్సినవారు సభాధ్యక్షులే. విపక్షాల ర్యాలీకి హాజరయ్యారన్న ఏకైక కారణంతో ఫిర్యాదు వచ్చిన వెంటనే రాజ్యసభలో శరద్‌యాదవ్, అలీ అన్వర్‌లపై వెంకయ్యనాయుడు అనర్హత వేటు వేశారు. అనర్హత విషయంలో రెండు సభల్లోనూ ఇలా వేర్వేరు ప్రమాణాలు పాటించడం ఆశ్చర్యకరం.

గత ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తరఫున తొమ్మిదిమంది ఎన్నికయ్యారు. వారిలో నలుగురు పార్టీ ఫిరాయించారు. ఇదంతా బహిరంగమే. ముగ్గురు టీడీపీ కండువాలు కప్పుకుంటే, ఒకరు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. చట్టాన్ని గౌరవించి వీరిపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికి 13 సార్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సుమిత్రా మహాజన్‌కు వినతి పత్రాలిచ్చింది. లోక్‌సభ పదవీకాలం మరి కొన్ని నెలల్లో ముగియబోతున్నా ఆ విషయం తేలలేదు. ఆ నలుగురు ఎంపీలు వేరే పార్టీల పంచన చేరారో లేదో తేల్చడమనేది అంత జటిలమైన విషయమా? ఆ నలుగురికీ నోటీసులు జారీ చేస్తే వచ్చి వారంతట వారే సంజాయిషీ ఇవ్వరా? ఇవ్వకపోతే ఏం చేయవచ్చునో ఆమెకు తెలియదా? గత బడ్జెట్‌ సమావేశాల సమయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పలుమార్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చినా సభ సజావుగా సాగడం లేదన్న కారణంతో వాటిపై నిర్ణయం తీసుకోలేదు. చిత్రంగా వర్షాకాల సమావేశాలు ప్రారంభం రోజునే టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును ఆమె ఆమోదించటం, ఆ మర్నాడే ప్రభుత్వం చర్చకు సిద్ధపడటం జరిగిపోయాయి. ఇందులో మతలబు ఏమిటన్న సంగతలా ఉంచి ఆ అవిశ్వాసం నోటీసుపై జరిగిన చర్చలో ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుకకు మాట్లాడే అవకాశం ఎలా ఇచ్చారు? ఏదైనా అంశంపై చర్చ జరిగినప్పుడు దానిపై మాట్లాడేందుకు పార్టీలకు సమయం కేటాయిస్తారు. తమ పార్టీ తరఫున ఎవరెవరు, ఎన్ని నిమిషాల చొప్పున మాట్లాడాలో సంబంధిత పార్టీ విప్‌ నిర్ణయిస్తారు. వారి పేర్లను సభాధ్యక్షులకు అందజేస్తారు. దాని ప్రకారమే ఆ పార్టీ సభ్యులు మాట్లాడతారు.

మరి బుట్టా రేణుక ఏ పార్టీ తరఫున అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడినట్టు? ఈ సమావేశాలకు ముందు కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు తమ రాజీనామాలను ఆమోదించమని కోరడానికి సుమిత్రా మహాజన్‌ను కలిశారు. అప్పుడు మరోసారి ఫిరాయింపుల విషయం ఆమె దృష్టికి తీసుకొచ్చారు. సమావేశాల ప్రారంభం సందర్భంగా గత నెల 10న ఆమె వివిధ పార్టీలకు లేఖ రాస్తూ మన పార్లమెంటు, ప్రజాస్వామ్యం సజావుగా, ఆదర్శవంతంగా సాగాలంటే ఏం చేయాలో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితోక్తులు పలికారు. మరి ఫిరాయింపుదార్లపై నిర్ణయం తీసుకోవటంలో జాప్యం చేయడమేకాక, వారిలో ఒకరికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం ఏ ఆదర్శాలకు దోహదపడుతుందో ఆమె ఆత్మవిమర్శ చేసుకున్నారా? ప్రజాస్వామ్యం సజావుగా సాగడానికి సమావేశాల ఎజెండా పూర్తికావడం ఒక్కటే గీటురాయా? ఇతరత్రా అంశాలేవీ పరిగణనలోకి రావా? ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కూడా ఫిరాయింపుదార్ల సంగతి తేల్చకుండా తాత్సారం చేస్తున్నారు. పార్లమెంటు అత్యున్నతమైనది కనుక కనీసం అక్కడి నిర్ణయాలైనా రాష్ట్రాల చట్టసభలకు ఆదర్శనీయంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు.

ఈసారి సమావేశాల్లో 21 బిల్లులు, సవరణ బిల్లులు ఆమోదం పొందాయి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ చట్టం సవరణ బిల్లు, మనుషుల అక్రమ తరలింపు నిరోధక బిల్లు, వెనకబడిన తరగతుల జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి బిల్లు వగైరాలు ఇందులో ఉన్నాయి. ప్రవాస భారతీయులు(ఎన్నారైలు) తమ ప్రతినిధి ద్వారా ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలు కల్పించే బిల్లు కూడా ముఖ్యమైనది. విదేశాల్లో మూడు కోట్లకుపైగా ఎన్నారైలు ఉన్నారు. ఈ సమావేశాల్లో ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్ర ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఎండగడతామని, దాన్ని సాధించుకొస్తామని చెప్పిన టీడీపీ దారుణంగా విఫలమైంది. హోదాపై తాము అందరినీ కూడగట్టామని చెప్పుకున్నా, చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీతో సహా ఏ ఒక్కరూ ఆ విషయమై మాట్లాడకపోవడం టీడీపీని నగుబాటుపాలు చేసింది. బహుశా ఆ పార్టీ పార్లమెంటు ముందు వేయించిన పగటి వేషాలతో హోదా అంశాన్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోకపోయి ఉండొచ్చు. ఏదేమైనా పార్లమెంటు సమావేశాలు మున్ముందు మరింత అర్ధవంతంగా సాగాలని అందరూ ఆశిస్తారు. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top