కశ్మీర్‌లో మరింత కదలిక

Editorial On Life In Kashmir After Article 370 - Sakshi

ఏడు నెలల నిర్బంధం నుంచి జమ్మూ–కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ) అధ్యక్షుడు ఫారుఖ్‌ అబ్దుల్లా శుక్రవారం విడుదల కావడం అక్కడ తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడగలవన్న ఆశ రేకెత్తిస్తోంది. నిరుడు ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్మూ–కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేయడంతోపాటు, ఆ రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విడగొట్టే కశ్మీర్‌ పునర్విభజన ప్రక్రియను కూడా పూర్తిచేసింది. అదే రోజు ఫారుఖ్‌తో పాటు ఆయన కుమారుడు, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, పీడీపీ నాయకురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీలతో సహా వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలను, వివిధ ప్రజాసంఘాల కార్యకర్తలను అరెస్టు చేశారు. 

మూడు నెలలు గడిచాక వారందరినీ విడుదల చేస్తారని ఆశిస్తున్న తరుణంలో సెప్టెంబర్‌ 15న ఫారుఖ్‌పైనా, ఇతర నేతలపైనా ప్రజా భద్రతా చట్టం(పీఎస్‌ఏ) ప్రయోగించారు. ఆగస్టు 5నుంచి మొత్తంగా 7,357మందిని అరెస్టు చేయగా, అందులో 396మందిపై ఆ తర్వాత పీఎస్‌ఏ ప్రయోగించారు. జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ)తో పోల్చదగిన ఈ చట్టాన్ని వాస్తవానికి ఫారుఖ్‌ తండ్రి షేక్‌ అబ్దుల్లాయే తీసుకొచ్చారు. 1978లో ఆ చట్టాన్ని తెచ్చినప్పుడు దాన్ని కలప స్మగ్లింగ్‌ను అడ్డుకోవడానికని చెప్పినా అనంతరకాలంలో రాజకీయ ప్రత్యర్థులపై దాన్ని ప్రయో గించడం మొదలుపెట్టారు. 

నిర్దిష్టమైన వ్యక్తి వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనుకుంటే ఈ చట్టం కింద గరిష్టంగా ఏడాదిపాటు నిర్బంధించేందుకు వీలుంటుంది. రాజ్యభద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారన్న అభియోగం మోపితే గరిష్టంగా రెండేళ్లపాటు నిర్బంధించవచ్చు. కనుకనే ఈ చట్టానికి రాజ్యాంగబద్ధత వున్నా ఆచి తూచి వినియోగించకపోతే పౌర స్వేచ్ఛకు ముప్పు తెస్తుందని సుప్రీంకోర్టు సైతం ఒక సందర్భంలో వ్యాఖ్యానించింది. జమ్మూ– కశ్మీర్‌ పునర్విభజన అనంతరం ఇతరత్రా చట్టాలు చాలా రద్దయినా పీఎస్‌ఏ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం యధావిధిగా కొనసాగించింది. నిర్బంధ చట్టాలపై పార్టీలకతీతంగా పాలకులకుండే ప్రేమను పీఎస్‌ఏ చరిత్ర వెల్లడిస్తుంది.

నాయకులు, ఇతరుల నిర్బంధం మాత్రమే కాదు... కశ్మీర్‌లో ఆగస్టు 5 నుంచి కమ్యూనికేషన్ల వ్యవస్థ కూడా స్తంభించిపోయింది. అక్కడున్న తమవారి క్షేమ సమాచారాలు తెలియక విదేశాల్లోనూ, దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ చదువుల కోసం, కొలువుల కోసం వెళ్లినవారు ఇబ్బందిపడ్డారు. అక్కడివారు కూడా తమ ఆప్తులతో సంభాషించడం ఆగిపోవడంతో మానసిక వేదనకు లోనయ్యారు. అయితే నిరుడు అక్టోబర్‌నాటికి మొబైల్‌ సేవల్ని పాక్షికంగా పునరుద్ధరించారు. అక్కడ పర్యాటకం కూడా ప్రారంభమైంది. మొదట్లో దాదాపు మూడు నెలలపాటు మూతబడిన పాఠశాలలు, కళాశాలలు కూడా ఆ తర్వాత తెరుచుకున్నాయి. అదేవిధంగా మూతబడిన వ్యాపార కార్యకలాపాలు కూడా మొదలయ్యాయి. 

దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే జమ్మూ–కశ్మీర్‌ ప్రాంతం సున్నిత మైన ప్రాంతం. పొరుగునే పాకిస్తాన్‌ ఉండటం, మిలిటెంట్లను సరిహద్దులు దాటించి కశ్మీర్‌లో తరచు సమస్యలు సృష్టించిన చరిత్ర దానికి వుండటం పర్యవసానంగా కమ్యూనికేషన్ల వ్యవస్థను నిలిపేసి నట్టు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ సర్వీసుల్ని వినియోగించుకుని ఉగ్రవాదులు విధ్వంసకర కార్యకలాపాలకు దిగే ప్రమాదం వుంటుందని ప్రభుత్వం అనుమానించడంలో తప్పు లేదు. అయితే పటిష్టమైన నిఘా వుంచి లేదా పరిమిత సమయాల్లో మాత్రం అనుమతించి ఈ వ్యవస్థను యధావిధిగా కొనసాగించివుంటే బాగుండేది. మొత్తంగా నిలిపేయడం వల్ల సాధారణ పౌరులు ఇబ్బందులుపడ్డారు. మొబైల్‌ సేవలు అందుబాటులోకొచ్చాక ఇంటర్నెట్‌ కూడా పనిచే యడం ప్రారంభించింది. 

ఇవన్నీ కశ్మీర్‌లో నానాటికీ మెరుగుపడుతున్న పరిస్థితుల్ని సూచిస్తున్నా యనడంలో సందేహం లేదు. కానీ ఫారుఖ్, ఒమర్, మెహబూబా వంటి నేతల్ని ఈ చట్టం కింద నిర్బంధించడం ఎలా చూసినా సహేతుకమైన చర్య కాదు. వీరంతా భారత్‌లో జమ్మూ–కశ్మీర్‌ విడదీయరాని భాగమని దృఢంగా విశ్వసించినవారు. మాజీ ప్రధాని స్వర్గీయ వాజపేయి నేతృ త్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అందులో పాలుపంచుకుంది. మెహబూబా నాయకత్వంలోని పీడీపీతో కలిసి బీజేపీ జమ్మూ–కశ్మీర్‌లో రెండేళ్లపాటు అధికారం పంచుకుంది. ఈ నేతల రాజకీయ కార్యకలాపాలు ఎప్పుడూ సమస్యాత్మకం కాలేదు. పైపెచ్చు ఈ పార్టీల కార్యకలాపాల కారణంగానే అక్కడి ప్రజానీకంపై మిలిటెంట్ల ప్రభావం నానాటికీ తగ్గి పోయింది. ఒకప్పుడు ఎంతో పలుకుబడివున్న హురియత్‌ కాన్ఫరెన్స్‌ వంటివి క్రమేపీ ప్రజాబలం లేక క్షీణించాయి. 

అఫ్గానిస్తాన్‌ నుంచి వైదొలగాలని ఏకపక్షంగా, బాధ్యతారహితంగా అమెరికా నిర్ణయించడం, అందులో భాగంగా తాలిబన్‌లతో ఒప్పందం కుదుర్చుకోవడం వంటి పరిణామాలతో ముందూ మునుపూ మన దేశానికి సమస్యలేర్పడే అవకాశంవుంది. 90వ దశకం చివర పాక్‌ ప్రాపకంతో తాలిబన్‌లు జమ్మూ–కశ్మీర్‌లో ఎంత కల్లోలం సృష్టించారో ఎవరూ మరిచిపోలేరు. కనుక ఈ దశలో కశ్మీర్‌ సమాజం సమష్టిగా ఉగ్రవాద బెడదను ఎదుర్కొనాలంటే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొల్పడం అత్యవసరం.

ఫారుఖ్‌ అబ్దుల్లాకు స్వేచ్ఛనివ్వడం ఆ దిశగా తొలి అడుగని భావించాలి. చెరవీడిన అనంతరం ఫారుఖ్‌ ఒక మాటన్నారు. ఇతర నాయకులు కూడా నిర్బంధం నుంచి విముక్తులైనప్పుడే తనకు పరిపూర్ణమైన స్వేచ్ఛ వచ్చినట్టు భావిస్తానన్నారు. జమ్మూ–కశ్మీర్‌లో పరి స్థితులు కుదుటపడితే దానికి మళ్లీ రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నిరుడు ఆగస్టులోనే వాగ్దానం చేశారు. అది నెరవేరాలని, కశ్మీర్‌లో సాధ్యమైనంత త్వరగా సాధారణ పరి స్థితులు నెలకొని, అది మళ్లీ భూతలస్వర్గంగా కాంతులీనాలని అందరూ ఆశిస్తారు.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top