ఏకాకి అమెరికా!

Defying Trump, United Nations General Assembly Condemns US Decree on Jerusalem - Sakshi

పాలస్తీనా విషయంలో ప్రపంచ ప్రజాభీష్టాన్నీ, ఐక్యరాజ్యసమితి తీర్మానాలనూ బేఖాతరు చేసిన అమెరికా చివరకు ఏకాకిగా మిగిలింది. జెరూసలేంను ఇజ్రాయెల్‌ రాజధానిగా పరిగణించి, అక్కడకు తమ దౌత్య కార్యాలయాన్ని తరలించాలని ఈ నెల 6న ఆ దేశం తీసుకున్న నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితి అత్యవసర సర్వసభ్య సమావేశం గురువారం వ్యతిరేకించింది. ఆ విషయంలో చాన్నాళ్లకిందట భద్రతా మండలి చేసిన తీర్మానానికి అందరూ కట్టుబడి ఉండాలని, చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చింది. తీర్మానం నెగ్గకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్, ఐక్యరాజ్యసమితిలో ఆ దేశ రాయబారి నిక్కీ హేలీ పడిన పాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఇంతకుముందే భద్రతామండలి ముక్త కంఠంతో ఆ నిర్ణ యాన్ని వ్యతిరేకించగా, తనకున్న వీటో అధికారాన్ని ఉపయోగించుకుని అమెరికా దాన్నుంచి బయటపడింది. సమితిలో వీటో కుదరదు గనుక బెదిరింపులే మార్గ మనుకుంది.

ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దేశాధ్యక్షుడిగా రావడం వల్లే ఈ బెదిరింపుల సంస్కృతి మొదలైందని అనుకోనవసరం లేదు. తన మాటే నెగ్గాలనుకున్నప్పుడు ఒత్తిళ్లు తీసుకురావడం, బెదిరించడం, అవసరమైతే బలప్రయోగానికి పాల్పడటం అమెరికాకు కొత్త కాదు. దశాబ్దాలుగా సామ, దాన, భేద, దండోపాయాల్లో అది ఆరితేరింది. అయితే ఇప్పుడు కొత్తగా జరిగిందేమంటే... అమెరికా నిర్ణయాన్ని ఖండించే తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన 128 దేశాల్లో దానికి అత్యంత విశ్వసనీయమైన దేశాలున్నాయి. ఆప్త దేశాలున్నాయి. ఆ దేశాలకు సైతం అమెరికా నిర్ణయం రుచించలేదంటే ప్రపంచ వేదికపై అదెంత ఏకాకిగా మిగిలిందో అర్ధం చేసుకోవచ్చు.

ఓటింగ్‌ నుంచి గైర్హాజరైన 35 దేశాలు సైతం అమెరికాను సమ ర్ధించినట్టు కాదు. అందులో ఆస్ట్రేలియా, కెనడా మినహా మిగిలినవన్నీ దాదాపు చిన్న దేశాలు. చూస్తూ చూస్తూ అమెరికాను వ్యతిరేకించలేక, అలాగని దాని నిర్ణ యానికి వంతపాడే నైతిక ధైర్యాన్ని ప్రదర్శించలేక అవి గైర్హాజరు నిర్ణయం తీసు కున్నాయి. మరో 21 దేశాలు ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొన లేదు. ఏతావాతా ఇజ్రా యెల్, మరో 8 దేశాలు మాత్రం అమెరికా పక్షాన చేతులెత్తాయి. అసలు తీర్మానాన్ని రూపొందిం చిన ఈజిప్టు, దాన్ని బలపరిచిన ఇస్లామిక్‌ దేశాల సహకార సంస్థ (ఓఐసీ), అరబ్‌ దేశాలు అమెరికాకు మిత్ర దేశాలే. అమెరికా తీసుకున్న అన్ని చర్యలకూ వెనకా ముందూ చూడకుండా మద్దతు పలికే బ్రిటన్‌ సైతం ఈసారి దాన్ని వ్యతిరేకించింది. మన దేశం సైతం పాలస్తీనా విషయంలో గత విధానాలనే కొనసాగించింది.

అయితే సమితి చేసిన తీర్మానాన్ని చూస్తే దాని దయనీయ స్థితి అర్ధమవు తుంది. జెరూసలేంపై ఇటీవలి పరిణామాలకు అది ‘తీవ్ర విచారాన్ని’ వ్యక్తం చేసింది. ఆ పరిణామాలకు కారకులెవరో, వారి చర్య గతంలోని సమితి నిర్ణయా లకు, స్ఫూర్తికి ఎలా విరుద్ధమో చెప్పడానికి దానికి నోరు రాలేదు. ఈ పనే మరో దేశం చేసి ఉంటే దాన్ని ప్రపంచం ముందు దోషిగా నిలిపేవారు. ఆంక్షలతో కష్ట పెట్టేవారు. సమితిలో తీర్మానంపై ఓటింగ్‌ జరగడానికి ముందూ, తర్వాతా అమె రికా వ్యవహరించిన తీరు అనాగరికంగా ఉంది. ఈ ఓటింగ్‌ను ట్రంప్, అమెరికా కూడా వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారంగా పరిగణిస్తున్నట్టు్ట నిక్కీ హేలీ అన్ని దేశాలకూ లేఖలు రాశారు.

ప్రతి ఒక్క ఓటునూ పరిశీలించి ఏ దేశం ఏం చేసిందో అధ్యక్షుడు తెలు సుకుంటారని, తగిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఓటింగ్‌ పూర్తయ్యాక సైతం ఆమె ఆ ధోరణి నుంచి బయటకు రాలేదు. ట్రంప్‌ తీరు గురించి చెప్ప నవసరమే లేదు. మాకు వ్యతిరేకంగా సమితి తీర్మానిస్తే అందువల్ల మా దేశానికి ‘చాలా మిగులుతుందం’టూ నర్మగర్భ వ్యాఖ్య చేశారు. సమితికిచ్చే నిధుల్ని ఆపే స్తామన్నది ఆయన హెచ్చరిక సారాంశం!  నిక్కీ హేలీ మాటల్లోనూ ఈ మాదిరి బెది రింపే ఉంది. ‘మేమెంతో ఔదార్యంతో సమితికి నిధు లందిస్తున్నాం. మా సుహృ ద్భావాన్ని గుర్తించి గౌరవించాలి. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే మా పెట్టుబడిని వేరేచోట వినియోగిస్తామ’ని ఆమె అల్టిమేటం జారీచేశారు.

ట్రంప్, హేలీ బెదిరింపులు ఆచరణలోకొస్తే సమితికి, వివిధ దేశాలకు నిధుల కొరత ఏర్పడే మాట నిజం. నిరుటి గణాంకాల ప్రకారం సమితికోసం సభ్య దేశాల్లో అత్యధికంగా నిధులందిస్తున్నది అమెరికాయే. అది ఏటా 1,000 కోట్ల డాలర్లకు పైగా నిధులు ఇస్తోంది. సమితి బడ్జెట్‌లో ఇది అయిదోవంతు.  

ఇందులో 600 కోట్లు ఐచ్ఛికంగా... మిగిలిన మొత్తం సమితి పనితీరు మదింపు తర్వాత విడుదల చేయడం రివాజుగా వస్తోంది. ఇదిగాక సబ్‌ సహారా దేశాలకు ఆర్ధిక, సైనిక సాయం 1,300 కోట్ల డాలర్లుంటుంది. తూర్పు ఆసియా, మహాసముద్ర ప్రాంత దేశాలకు 160 కోట్ల డాలర్లు సహాయం అందిస్తుంది. పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలకు 1,300 కోట్ల డాలర్లు... దక్షిణ, మధ్య ఆసియా దేశాలకు 670 కోట్ల డాలర్లు... యూరప్, యూరేసియా దేశాలకు 150 కోట్ల డాలర్లు, పశ్చిమార్ధ గోళ దేశాలకు 220 కోట్ల డాలర్లు అమెరికా సహా సంస్థ యూఎస్‌ ఎయిడ్‌ ద్వారా వెళ్తుంది. ఈ డబ్బంతా అది పెద్ద మనసుతో, మానవతా దృక్పథంతో అందిస్తున్నది కాదు. ఆయా దేశాల్లో తనకుండే ప్రయోజనాలేమిటో లెక్కచూసుకుని ఇస్తున్నదే.

అమెరికా తాజా పోకడలతో ప్రపంచం ఇంతవరకూ అనుసరిస్తూ వస్తున్న విధా నాలు తలకిందులయ్యే స్థితి ఏర్పడింది. పాలస్తీనా చిక్కుముడి మరింత జటిలంగా మారింది. జెరూసలేం పశ్చిమ ప్రాంతానికి తమ దౌత్య కార్యాలయాన్ని తరలి స్తామన్న ట్రంప్‌ ప్రకటనకు పోటీగా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ తూర్పు జెరూస లేంలో ఇకపై తమ దౌత్య కార్యాలయం ఉంటుందని చెప్పారు. అదే బాటలో మరి కొన్ని దేశాలు వెళ్లినా ఆశ్చర్యం లేదు. పాలస్తీనా విషయంలో ఇక అమెరికాను మధ్య వర్తిగా పరిగణించబోమని 50 ముస్లిం దేశాలు ప్రకటించాయి. అమెరికా మరింత నగుబాటుపాలు కాకూడదనుకుంటే ఆ దేశ ప్రజానీకం తమ అధ్యక్షుడి చర్యల్ని నిలదీయాలి. తమ ప్రభుత్వం మెడలు వంచి వియత్నాం దురాక్రమణ యుద్ధాన్ని ఆపించిన వెనకటి తరం చేవను గుర్తుచేసుకోవాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top