కరెన్సీ స్వామ్యం! | Sakshi
Sakshi News home page

కరెన్సీ స్వామ్యం!

Published Tue, Mar 3 2015 11:51 PM

currency ruling!

‘కట్టలు’ తెంచుకుని ప్రవహిస్తున్న డబ్బుతో మన దేశంలో ఎన్నికలు రాను రాను భ్రష్టుపడుతున్న దృశ్యం కళ్లకు కడుతుండగా...వాటిని సరిచేయడానికి చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడంలేదని మరోసారి రుజువైంది. దేశ ఆర్థిక వ్యవస్థ సామాన్యుల్ని బేజారెత్తించేలా తయారైనా రాజకీయ పార్టీలు మాత్రం జిగేల్మని మెరిసిపోతున్నాయని, కరెన్సీ కట్టలు రెక్కలు కట్టుకుని వాటి ఒళ్లో వాలుతున్నాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) తాజా నివేదిక వెల్లడిస్తున్నది. నిరుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ, బీఎస్పీ, సీపీఐలకొచ్చిన నిధులు చూస్తే ప్రజానీకం గుండెలు బాదుకోవాల్సిందే. ఇందులో బీజేపీకి అత్యధికంగా రూ.588.45 కోట్లు రాగా, రూ.350.39 కోట్లతో కాంగ్రెస్ ద్వితీయ స్థానంలో ఉంది. ఎన్సీపీకి రూ.77.85 కోట్లు, బీఎస్పీకి రూ.77.26 కోట్లు, సీపీఐకి రూ. 9.52 కోట్లు లభించాయి. ఈ పార్టీల ఖర్చు కూడా వాటి ఆదాయానికి తగ్గట్టుగానే ఉంది. బీజేపీ రూ.712.48 కోట్లు వ్యయం చేయగా, కాంగ్రెస్ రూ. 486.21 కోట్లు, ఎన్సీపీ రూ.64.48 కోట్లు, బీఎస్పీ రూ.30.60 కోట్లు, సీపీఐ రూ.6.72 కోట్లు ఖర్చుచేశాయి. ఈ జమాఖర్చులన్నీ ఎన్నికల ప్రకటన వెలువడింది మొదలుకొని ఎన్నికల కార్యక్రమం పూర్తయ్యేవరకూ గల 75 రోజుల వ్యవధికి సంబంధించినవి. నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘానికి ఇచ్చిన లెక్కలు. ఇంకా అన్యాయమైన విషయమేమంటే... ఆగస్టు 13కల్లా లోక్‌సభ ఎన్నికల ఖర్చుల వివరాలివ్వాలని నిబంధన ఉన్నా బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ చాలా ఆలస్యంగా ఆ పనిచేశాయి.
 
 కాంగ్రెస్ గత డిసెంబర్ 22న సమర్పిస్తే, బీజేపీకి జనవరి 12 నాటికి గానీ తీరిక చిక్కలేదు.
  ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సమరంలో మోహరించి తీవ్ర స్థాయిలో పోటీపడుతున్నాయి. ఏం చేసైనా సరే నెగ్గాలన్న పట్టుదలతో పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో మంచినీళ్లప్రాయంగా డబ్బులు వెదజల్లుతున్నాయి. ఇందులో దాపరికమేమీ ఉండటం లేదు. సామాన్యుల గురించి, వారి కష్టాల గురించీ మాట్లాడటం... ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేయడం, పనిలో పనిగా అవతలి పార్టీ తెగ ఖర్చుపెడుతున్నదని ఆరోపించడం రివాజుగా సాగుతుండగా ఆయా పార్టీల ఆచరణ మాత్రం వేరే మార్గంలో పోతున్నది. కళ్లు మిరుమిట్లు గొలిపేలా కటౌట్లు, బ్యానర్లు, జెండాలు.... వాహనాలతో భారీ ప్రదర్శనలు, అట్టహాసమైన వేదికల నిర్మాణం, 3డీ టెక్నాలజీతో ప్రసంగాలు, నాయకుల ఆకాశయాన పర్యటనలు, మీడియాలో వాణిజ్య ప్రకటనలు హోరెత్తిపోతున్నాయి. వీటన్నిటినీ గమనించాక ఆ పార్టీలు చూపే వ్యయానికి మించి ఎన్నో రెట్లు ఖర్చయి ఉంటుందని సులభంగానే అర్థమవుతుంది. గత పదేళ్లలో జరిగిన మూడు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల విరాళాల సేకరణ ఐదు రెట్లు పెరగ్గా, ఖర్చు నాలుగు రెట్లు మించిందని ఏడీఆర్ నివేదిక వెల్లడిస్తున్నది.
 కొన్నాళ్లక్రితం బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ గోపీనాథ్ ముండే ఎన్నికలపై డబ్బు ప్రభావం నానాటికీ పెరిగిపోతున్నదని ఒక సభలో ఆవేదనపడ్డారు. ఆ సందర్భంగా కాస్త ఆవేశానికి లోనై నోరు జారారు. 1980 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసినప్పుడు తనకు రూ. 29,000 ఖర్చుకాగా 2009 లోక్‌సభ ఎన్నికల్లో రూ. 8 కోట్లు ఖర్చుపెట్టాల్సివచ్చిందని చెప్పారు.
 
 నిజానికి ఆయన 2009 ఎన్నికల్లో తన స్థిర, చరాస్తులను రూ.6.22 కోట్లుగా... ఖర్చును రూ.19,36,922గా చూపారు. అప్పటికున్న నిబంధనల ప్రకారం లోక్‌సభ ఎన్నికలకు ఆయన రూ. 25 లక్షలు ఖర్చు పెట్టవచ్చు. కానీ, ఆయన తనకైన ఖర్చును రూ. 20లక్షల లోపే చూపించారు. దీంతో ఈసీ ఆయనకు నోటీసులు జారీచేసింది. అది వేరే విషయం. నిజమేమిటంటే మన దేశంలో పార్టీలు చేస్తున్న ఖర్చులకూ, చూపిస్తున్న వివరాలకూ పొంతన ఉండటంలేదు. ఆదాయ వివరాలను దాచడానికి ప్రయత్నించేవారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఇటీవల బడ్జెట్ సమర్పించిన సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. భారీ జరిమానాలు, జైలు శిక్షలు ఉండేలా చట్టాలు మార్చబోతున్నామని చెప్పారు. కానీ నిబంధనలు ఉల్లంఘిస్తున్న రాజకీయ పార్టీలపైగానీ, నేతలపైగానీ ఇంతవరకూ ఎలాంటి చర్యలూ తీసుకున్న దాఖలాలు లేవు. ప్రధాన రాజకీయ పక్షాలు జమాఖర్చుల సమర్పణకున్న తుది గడువునే బేఖాతరు చేశాయి.
 
 పౌర సమాజ కార్యకర్తగా క్రియాశీలంగా పనిచేస్తున్న మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఇటీవలే బీజేపీ, కాంగ్రెస్‌ల విరాళాల లెక్కల్లో ఉన్న లొసుగులను బయటపెడుతూ ఈసీతోసహా పలువురికి ఫిర్యాదుచేశారు. చట్టాన్ని ఉల్లంఘించి విదేశాలనుంచి విరాళాలు స్వీకరించడం, దాతల వివరాలివ్వకపోవడం వంటివి ఎత్తిచూపారు. సమాజంలో ఆదర్శప్రాయంగా మెలగాల్సిన పార్టీలు ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. మద్యం, రియల్‌ఎస్టేట్, విద్య తదితర రంగాల్లో వ్యాపారాలు సాగించి, అక్రమాలకు పాల్పడి వెనకేసుకున్న వారంతా తమ ‘అదృష్టాన్ని’ పరీక్షించుకునేందుకు పార్టీలను ఆశ్రయిస్తున్నారు. కులం, మతంలాంటి అదనపు అర్హతలను చూసి అలాంటివారికి పార్టీలు టిక్కెట్లిస్తున్నాయి. పర్యవసానంగా ఎన్నికలు సంపన్నవర్గాల సంకుల సమరంగా మారాయి. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఏదోరకంగా నెగ్గడం, అధికారానికొచ్చాక ఆ ఖర్చయిందంతా రాబట్టుకోవడం మన దేశంలో సాగుతున్న తంతు. ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు నిబంధనలను కఠినతరం చేస్తున్నా, అందుకు దీటుగా అక్రమాలు కూడా పెరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు సేకరించే విరాళాలకు ఖచ్చితమైన పరిమితులు విధించి, వ్యయ నియంత్రణపై కూడా దృష్టిపెట్టడం... నిబంధనలు ఉల్లంఘించే పార్టీలపై గుర్తింపు రద్దుతోసహా అన్ని రకాల చర్యలకూ ఉపక్రమించడంవంటివి చేస్తే తప్ప ఈ జాతర దారికి రాదు. దీన్నిలాగే కొనసాగనిస్తే భవిష్యత్తులో ప్రజాస్వామ్యానికి అర్థమే మారిపోతుంది.

 

Advertisement
Advertisement