అధ్యక్షా ఇదేమి సంప్రదాయం...!
రాష్ట్రానికి శాసన సభ ఎలానో ... జిల్లాకు జెడ్పీ సర్వసభ్య సమావేశం అలాంటింది. తమ జిల్లా ప్రతినిధులు శాసన సభలో ఏ అంశాలు ప్రస్తావించనున్నారోనని ఆశగా ఆ జిల్లా ప్రజలు ఎదురు చూసినట్టే ... తమ మండలంలోని ఏ సమస్యలను మండల ప్రజా ప్రతినిధులు, జెడ్పీ సభ్యులు చర్చకు తేనున్నారోనని మండలాల్లోని ప్రజలు గమనిస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న జెడ్పీ సమావేశం ఉబుసపోక కేంద్రంగా
-
జిల్లా సమస్యలపై చర్చే లేదు
-
వెంటాడుతున్న అనారోగ్యాల ఊసేలేదు
-
మంత్రి వెంట పరుగులు ... హాజరుకాని డీఎంహెచ్‌ఓ
-
తూతూ మంత్రంగా సాగిన జెడ్పీ సమావేశం
రాష్ట్రానికి శాసన సభ ఎలానో ... జిల్లాకు జెడ్పీ సర్వసభ్య సమావేశం అలాంటింది. తమ జిల్లా ప్రతినిధులు శాసన సభలో ఏ అంశాలు ప్రస్తావించనున్నారోనని ఆశగా ఆ జిల్లా ప్రజలు ఎదురు చూసినట్టే ... తమ మండలంలోని ఏ సమస్యలను మండల ప్రజా ప్రతినిధులు, జెడ్పీ సభ్యులు చర్చకు తేనున్నారోనని మండలాల్లోని ప్రజలు గమనిస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న జెడ్పీ సమావేశం ఉబుసపోక కేంద్రంగా మారుతోంది. అజెండా ఉండదు ... చర్చనీయాంశ అంశాలేవో తెలియదు ... గత సమావేశం తీర్మానాల ప్రగతి ఎలా ఉంది? అభివృద్ధి ఎలా సాగుతుందో సమాధానం చెప్పేవారే లేరు. యథారాజా తథాప్రజా మాదిరిగా ప్రజాప్రతిని«ధులు గైర్హాజరైతే మేమేం తక్కువ తిన్నామానంటూ అదే బాటను పడుతున్నారు అధికారులు.
సాక్షిప్రతినిధి, కాకినాడ :
ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి పరిష్కారం చూపించేందుకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మించిన వేదిక మరొకటి ఉండదు. ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి (డిఆర్‌సీ) అంటూ ఒకటుండేది. ఇప్పుడది మనుగడలో లేదు. మూడు నెలలకోసారి జరిగే ఈ జెడ్పీ సమావేశాలు జిల్లా అంతటినీ ప్రతిబింబించాలి. కానీ సమావేశాలు జరుగుతున్న తీరుతో జెడ్పీ రానురాను ప్రజల్లో పలచనైపోతోంది. జిల్లా వ్యాప్తంగా 62 మంది జెడ్పీటీసీ సభ్యులు, ఇందుకు కొద్ది అటు ఇటుగా మండల పరిషత్ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ మాత్రమే హాజరయ్యారు, ఎంపీలు..ఇలా ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో మూడొంతులు మంది ప్రాతినిధ్యంవహిస్తున్న జెడ్పీలో ‘ప్రజల సమస్యలపై లోతైన సమీక్షలు జరిగే రోజులు గతంలో ఉండేవంట’ అని అనుకునే వాతావరణం కనిపిస్తోంది. సోమవారం కాకినాడ జెడ్పీ సమావేశ మందిరంలో చైర్మన్ నామన రాంబాబు అధ్యక్షతన జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశం ఇందుకు అద్దం పడుతోది.
చర్చల్లేకుండా కాలక్షేపం...
ఉదయం 11.15 గంటలకు ప్రారంభమైన సమావేశం భోజన విరామం అనంతరం తిరిగి 3 గంటలకు ప్రారంభమై నాలుగు గంటలతో ముగిసింది. అంటే ఐదు గంటలతో సభను ముగించేశారు. ఇదివరకైతే పలు అంశాలపై సుదీర్ఘ చర్చ చేపట్టడంతో రాత్రి పొద్దుపోయే వరకు సమావేశాలు జరిగిన సందర్భాలు మన జెడ్పీలో అనేకం ఉన్నాయి. సభ్యులు పంపించిన ప్రశ్నలకు అధికారులు ఇచ్చిన సమాధానాలు తెలియచేయడం, సంతృప్తి చెందకుంటే వాటిపై చర్చను చేపట్టడమనే సంప్రదాయం గతంలో ఉండేది. ఇందుకు తొలి గంట ప్రశ్నోత్తరాల సమయంగా నిర్ణయించేవారు. ఇప్పుడసలు ప్రశ్నోత్తరాల సమయమే లేకుండా చేశారని, చర్చకు వచ్చిన అంశాలకు సమాధానాలు కూడా సంతృప్తినివ్వలేకున్నాయని సభా ముఖంగా పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. జిల్లాలో 19 మంది ఎమ్మెల్యేలుంటే పట్టుమని పది మంది మించి ఎమ్మెల్యేలు కనిపించ లేదు. ఎమ్మెల్సీలైతే ఒక్కరు కూడా హాజరుకాలేదు. వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఒకటి, రెండు అంశాలపై చర్చలో పాల్గొన్నాక వెళ్లిపోయారు. భోజన విరామానికి ముందు నిండుగా కనిపించిన సభ ఆ తరువాత పలచబడిపోయింది. ‘పనీపాట లేకుండా వచ్చామనుకుంటున్నారా’అంటూ ఏజెన్సీ ప్రాంతంలో కూవనరం జెడ్పీటీసీతోపాటు పలువురు మహిళా జెడ్పీటీసీలు మాట్లాడే అవకాశం దక్కలేదని స్పందిస్తేనే గానీ వారికి అవకాశం ఇవ్వలేదు.
ఆరోగ్యం అంటే అంత నిర్లక్ష్యమా...!
ప్రజాప్రతినిధులనే కాదు. ఇటు అధికారుల వైపు నుంచి కూడా దాదాపు ఇదే తీరు కనిపించింది. సమావేశంలో కొందరు అధికారులు నిర్థిష్టమైన సమాధానాలు చెప్పకపోవడం, కొందరు గైర్హాజర్ కావడాన్ని బట్టి సమావేశానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థమవుతోందని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రాçష్ట్ర స్థాయిలో అసెంబ్లీ తరహాలోనే జిల్లా స్థాయిలో అంతటి ప్రాధాన్యం కలిగిన జెడ్పీ సమావేశం జరిగే తీరు ఇదేనా అని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క ఏజెన్సీలో అంతుపట్టని కాళ్లవాపు వ్యాధితో ఏడుగురు గిరిజనులు మృత్యువాతపడినా వ్యాధి నిర్థారణ కాని పరిస్థితుల్లో సమావేశంలో చర్చకు అవకాశం ఉన్నా డీఎంహెచ్‌ఓ గైర్హాజర్ కావడం విస్మయాన్ని కలిగించింది. ఈ విషయమై పలువురు సభ్యులు ప్రస్తావిస్తే జగ్గంపేటలో ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాసరావు కార్యక్రమం ఉండటంతో రాలేదనే సమాధానం లభించింది. అంటే ఇక్కడ ఏడుగురు గిరిజనులు చనిపోయి, ఏజెన్సీ సహా జిల్లా అంతటా మలేరియా, టైపాయిడ్, విష జ్వరాలు విజృంభిస్తున్న పరిస్థితులు చర్చకు వస్తాయని తెలియదా అని సభ్యులు ప్రశ్నలకు సమాధానం లేదు. ఇక్కడ ప్రజల ఆరోగ్యంపై చర్చకంటే మంత్రి పర్యటనకే ప్రాధాన్యం ఇవ్వడం ప్రజా సమస్యలపై వారికున్న చిత్తశుద్ధిని తెలియచేసింది. అలాగైతే అధికారులు తమ సబార్డినేట్లను పంపినట్టే తాము కూడా తమ భార్యలు, పిల్లలను పంపితే సరిపోతుందా అని పలువురు ప్రశ్నించడం గమనార్హం.
కానరాని సగం శాఖల అధిపతులు
22 శాఖలకు సంబంధించిన సమాచారంతోపాటు అనుబంధంగా ఆరు శాఖల సమాచారాన్ని మాత్రమే ఎజెండాలోకి తీసుకువచ్చారు. ప్రధానమైన శాఖలు 55కుపైనే ఉన్నా వాటిలో సగానికి పైనే శాఖలను ఎజెండాలో విస్మరించిన అంశం ప్రస్తావనకు రాగా, వచ్చే సమావేశాల్లో అన్నింటినీ తీసుకువస్తామని జెడ్పీ సీఈఓ పద్మ సమాధానం సభ్యులకు సంతృప్తినివ్వలేదు. సమావేశంలో వచ్చిన సమస్యలను ఆయాశాఖలకు నివేదిస్తే ఆ తరువాత సమావేశం నాటికి పరిష్కరించ గలిగితే పరిష్కరించినట్టు లేకుంటే సాధ్యం కాదని ఆయా శాఖల అధిపతుల నుంచి సమాధానం జెడ్పీ ద్వారా సభ్యులకు తెలియజేయాలి. అది కూడా జరగడం లేదనే విషయం ఈ సమావేశం సాక్షిగా బయటపడింది. కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఇక ముందు అలా జరగకుండా చూస్తామని జెడ్పీ సీఈఒనే స్వయంగా పేర్కొనడాన్ని బట్టి కొన్ని శాఖల నుంచి సమాచారం రాకపోవడం వాస్తవమేనని విషయం వెల్లడైంది. సభలో రైతుల రుణాలు, పాఠశాల భవనాల నిర్మాణాలు, పవర్‌టిల్లర్లు పంపిణీ తదితర అంశాలపై ఒకపక్క చర్చ నడుస్తుంటే అదే సమయంలో వేదిక దిగువన పలువురు అధికారులు సభ్యులతో మరేదో అంశాలపై గుసగుసలతో సభ గందరగోళంగా మార్చడం సభా సంప్రదాయాలను పక్కదారిపట్టించడం కాదా అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. ఇక ముందైనా సభా సమయాన్ని వృధా కానివ్వకుండా అన్ని అంశాలపై సుదీర్ఘమైన చర్చ జరిపి జిల్లాలో ప్రధాన సమస్యలకు పరిష్కారం కనుగొనడంలో సభ్యులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.