
వైఎస్సార్‌సీపీ 'యువ' కమిటీలు రద్దు
జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన కమిటీలు రద్దు చేస్తున్నట్లు యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి ప్రకటించారు.
అనంతపురం : జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన కమిటీలు రద్దు చేస్తున్నట్లు యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 నెలల్లో జిల్లా అంతటా పర్యటించి సమన్వయకర్తలు, యువజన విభాగం రాష్ట్ర నాయకులతో చర్చించి ఉత్సాహవంతులైన యువకులతో కొత్త కమిటీలను నియమిస్తామని వెల్లడించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని ఇచ్చిన చంద్రబాబు హామీలపై జిల్లా అంతటా యువతకు అవగాహన కల్పించి పెద్ద ఎత్తున ప్రభుత్వంపై పోరాటాలు చేస్తామన్నారు. ప్రత్యేక హోదా సాధనకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు. సమావేశంలో యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, నగర అధ్యక్షులు ఎల్లుట్ల మారుతీనాయుడు, పార్టీ శింగనమల నియోజకవర్గ నాయకులు భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.