అధర్మానిదే రాజ్యం | tdp leaders dominates revenue officers | Sakshi
Sakshi News home page

అధర్మానిదే రాజ్యం

Dec 3 2016 11:30 PM | Updated on Aug 10 2018 9:46 PM

అధర్మానిదే రాజ్యం - Sakshi

అధర్మానిదే రాజ్యం

ధర్మవరం.. ఇక్కడ అధర్మానిదే రాజ్యం. కీలకమైన రెవెన్యూశాఖపై అధికార పార్టీ నేత కర్ర పెత్తనం సాగుతోంది.

– ధర్మవరంలో రెవెన్యూపై అధికార పార్టీ నేత పెత్తనం
– ఏడాదిన్నరగా ఇన్‌చార్జ్‌ తహశీల్దార్‌ పాలన
– మరో ఐదు మండలాల్లో  'అధికార' ఒత్తిడి


అనంతపురం అర్బన్‌ : ధర్మవరం.. ఇక్కడ అధర్మానిదే రాజ్యం. కీలకమైన రెవెన్యూశాఖపై అధికార పార్టీ నేత కర్ర పెత్తనం సాగుతోంది. అంతా నా ఇష్టం.. నేను చెప్పినట్లే జరగాలనే ధోరణిలో వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ పనిచేయాలంటే ఆయన.. ఆయన అనుచరుల కనుసన్నల్లో అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించాలి. లేదంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా ఉన్న ధర్మవరంలో రెగ్యులర్‌ తహశీల్దార్‌ లేరు.  ఏడాదిన్నరగా ఇక్కడ ఇన్‌చార్జి తహశీల్దార్‌ పాలన నడుస్తోంది. ఈ మండలానికి రెగ్యులర్‌ తహశీల్దార్‌ను నియమించినా ఉండలేని పరిస్థితులను అధికార పార్టీ నాయకులే కాదు... ప్రజాప్రతినిధికి తొత్తులుగా పనిచేసే కొందరు రెవెన్యూ సిబ్బంది కూడా కల్పిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పెట్టె బేడా సర్దుకుని వెళ్లిపోతున్నారు. ఇది ధర్మవరంతోనే ఆగిపోలేదు.. మరో ఐదు మండలాల్లోనూ రెగ్యులర్‌ తహశీల్దార్లపై అధికార పార్టీ నాయకుల ఒత్తిడి తీవ్రంగా ఉన్నట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.

బెదరగొట్టి పంపిస్తున్న వైనం
    ఇక్కడకి తహశీల్దార్‌గా ఎవరు వచ్చిన బెదరగొట్టి పంపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2015లో గోరంట్ల మండలం నుంచి కేశవనాయుడును తహశీల్దార్‌గా ఇక్కడ నియమించారు. మూడు నెలలపాటు ఇక్కడ పనిచేశారు. ఇక్కడ ఒత్తిళ్లకు తట్టుకోలేక సీఆర్‌డీఏ (తూళ్లూరు) విల్లింగ్‌ ఇచ్చుకుని వెళ్లిపోయారు. అనంతరం గార్లదిన్నెలో డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తున్న నారాయణమూర్తిని అధికార పార్టీ నేత సిఫారసుతో ఇన్‌చార్జి తహశీల్దార్‌గా నియమించారు. అటు తరువాత 2016లో బదిలీలు నిర్వహిస్తూ కదిరిలో పనిచేస్తున్న నాగరాజును ధర్మవరం తహశీల్దార్‌గా నియమించారు. ఆయనపై రాజకీయ ఒత్తిళ్లు పెరగడంతో జాయిన్‌ అయిన వెంటనే సెలవుపై వెళ్లారు. పది రోజుల పాటు ఎవరికీ కనిపించలేదు. దీంతో రెవెన్యూ సంఘం నాయకులు ఆయన ఎక్కడున్నది తెలుసుకుని, తమ వద్దకు పిలిపించి విషయం తెలుసుకున్నారు. విషయం కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో నాగరాజుకు యల్లనూరులో పోస్టింగ్‌ ఇప్పించారు. అప్పటి నుంచి ధర్మవరంలో యథావిధిగా ఇన్‌చార్జి పాలన సాగుతోంది.

మరో ఐదు మండలాల్లో...
    ధర్మవరంలో తమ అనుకూల అధికారుల కోసం రెగ్యులర్‌ తహశీల్దార్‌ ఉండలేని పరిస్థితి కల్పిస్తుంటే.. శింగనమల, కళ్యాణదుర్గం, కదిరి, అనంతపురం, ఉరవకొండ మండలాల్లో తహశీల్దార్లపై అధికార పార్టీ నేతల ఒత్తిడి తీవ్ర స్థాయిలో ఉన్నట్లు రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి. ఇటీవల రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు రెవెన్యూ డివిజన్‌ వారీగా సమావేశాలు నిర్వహించిన క్రమంలో అధికార పార్టీ నాయకులు నుంచి వస్తున్న ఒత్తిడి చెప్పడమే కాకుండా... ఈ చర్యలతో సక్రమంగా విధులు నిర్వర్తించలేక పోతున్నామని పలువురు తహశీల్దార్లు వాపోయినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement