రచ్చ | tdp corporators fight in standing committee meeting | Sakshi
Sakshi News home page

రచ్చ

Sep 8 2017 10:23 PM | Updated on Aug 11 2018 4:24 PM

రచ్చ - Sakshi

రచ్చ

శుక్రవారం నగరపాలక సంస్థలోని కౌన్సిల్‌హాల్‌లో మేయర్‌ స్వరూప, కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి సమక్షంలో స్టాండింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు.

వేదిక : నగరపాలకసంస్థలోని కౌన్సిల్‌హాల్‌
సందర్భం : స్టాండింగ్‌ కమిటీ సమావేశం
కారణం : అభివృద్ధి పనులన్నీ అగ్రవర్ణాలకేనా అని ప్రశ్నించడం
ప్రశ్నించింది : ఉమామహేశ్వర్‌
దాడి చేసింది : నటేష్‌చౌదరి
ఎవరు వీరు : అధికారపార్టీ కార్పొరేటర్లు
ఫస్ట్‌క్లాస్‌ ప్రేక్షకులు : మేయర్‌, కమిషనర్‌


అనంతపురం న్యూసిటీ: శుక్రవారం నగరపాలక సంస్థలోని కౌన్సిల్‌హాల్‌లో మేయర్‌ స్వరూప, కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి సమక్షంలో స్టాండింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. మొదటి అజెండాపై చర్చ పూర్తయ్యాక సభ్యుడు ఉమామహేశ్వర్‌ మాట్లాడుతూ తన డివిజన్‌లో పార్కు, రోడ్డు అధ్వానంగా ఉన్నాయని, కమిషనర్‌ పర్యటించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు ప్రాతినిథ్యం వహిస్తున్న డివిజన్లకు మొండిచేయి చూపిస్తున్నారని, అగ్రవర్ణాల డివిజన్లకు మాత్రం పెద్దపీట వేస్తున్నారని అన్నారు. సభ్యులు నటేష్‌చౌదరి, లక్ష్మిరెడ్డి స్పందిస్తూ కులాల ప్రస్తావన తీసుకురావద్దని సూచించారు. అయితే తాను నిజమే మాట్లాడుతున్నానని, తన డివిజన్‌లో పనులు ఎక్కడ జరిగాయో చెప్పాలని ఉమామహేశ్వర్‌ నిలదీశారు. అంతే నటేష్‌చౌదరి ఒక్కసారిగా ఉమామహేశ్వర్‌పై చేయి చేసుకున్నాడు. పక్కనే ఉన్న సభ్యుడు లక్ష్మిరెడ్డి విడిపించినప్పటికీ మరో రెండుసార్లు చేయి చేసుకున్నాడు. నిర్ఘాంతపోయిన మిగతా సభ్యులు అంతలోనే తేరుకుని అడ్డుపడ్డారు. కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఉమామహేశ్వర్‌ కంటతడి పెట్టుకుని దేవుడన్నీ చూస్తున్నాడంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ సంఘటన చాలా బాధాకరమని మేయర్, కమిషనర్‌ విచారం వెలిబుచ్చారు.

ఎమ్మెల్యేను విమర్శించినందుకే...
ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి పేదలకు చేసిన అన్యాయాన్ని నేను ఎలుగెత్తి చెప్పినందుకే ఎమ్మెల్యే అనుచరుడు నటేష్‌చౌదరి దాడి చేశాడు. బీసీలకు అన్యాయం చేస్తున్నారని అడిగినందుకే దాడి చేస్తే ఎలా? అగ్రవర్ణాల పెత్తనం ఏ స్థాయిలో ఉందో దీన్నిబట్టి అర్థమవుతోంది. ప్రజలన్నీ గమనిస్తున్నారు.
- ఉమామహేశ్వర్‌, కార్పొరేటర్‌

తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి ప్రమేయంతోనే కార్పొరేటర్‌ ఉమామహేశ్వర్‌పై దాడి జరిగింది. దీనిని బీసీ జనసభ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం.
- సుధాకర్‌యాదవ్‌, బీసీ జనసభ జిల్లా అధ్యక్షుడు

ఉమా మహేశ్వర్‌ వైఖరి బాగోలేదు
అన్ని డివిజన్లలో అభివృద్ధి జరుగుతోంది. ఉమామహేశ్వర్‌ వైఖరి బాగోలేదు. అతనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం
- డిప్యూటీ మేయర్‌ గంపన్న, కో-ఆప్షన్‌ సభ్యుడు కృష్ణకుమార్, కార్పొరేటర్లు లోక్‌నాథ్, విజయశ్రీ

5 అంశాలకు ఆమోదం
స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఐదు అంశాలకు ఆమోదం తెలిపారు. అవి ఎన్‌టీఆర్‌ మార్గ్‌ ఏర్పాటుతో భూమి కోల్పోయిన 9 మందికి రూ.25.09 కోట్ల నష్టపరిహారం చెల్లించడం, రాధాకృష్ణ అనే వ్యక్తికి రూ.1, 37,69,706 కోట్లు చెల్లించడం, 42వ డివిజన్‌లో రూ.15.75 లక్షలతో సీసీ డ్రైన్, కల్వర్టు నిర్మించడం, అదే డివిజన్‌లో రూ.21 లక్షలతో మరో సీసీ డ్రైన్, కల్వర్టు నిర్మించడం, 20వ డివిజన్‌లో పోలీస్‌ క్వార్టర్స్‌లో రూ.29 లక్షలతో బీటీ రోడ్డు ఏర్పాటు చేయడం. ఈ సమావేశంలో ఎస్‌ఈ నాగమోహన్, ఈఈలు రామ్మోహన్‌రెడ్డి, నారాయణ, డీఈలు కిష్టప్ప, సురేంద్రనాథ్, సుధారాణి, నరసింహ, ఏఈలు మహదేవప్రసాద్, హేమచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement