బెళుగుప్ప మండలం గంగవరంలో మంగళవారం రాత్రి జరిగిన అల్లర్లలో కులం పేరుతో దూషిస్తూ ఎర్రిస్వామి అనే వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో గ్రామానికి చెందిన చంద్ర, శీన, పవన్, అన్వర్, వెంకటేశులు అనే వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బుధవారం నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగస్వామి తెలిపారు.
బెళుగుప్ప (ఉరవకొండ) : బెళుగుప్ప మండలం గంగవరంలో మంగళవారం రాత్రి జరిగిన అల్లర్లలో కులం పేరుతో దూషిస్తూ ఎర్రిస్వామి అనే వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో గ్రామానికి చెందిన చంద్ర, శీన, పవన్, అన్వర్, వెంకటేశులు అనే వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బుధవారం నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగస్వామి తెలిపారు. నిందితుల దాడిలో ఎర్రిస్వామి గాయపడి అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వివరించారు.
గంగవరంలో ఉద్రిక్తం
రాతి దూలం పోటీల్లో గెలిచిన ఎద్దులను ఊరేగించే క్రమంలో గంగవరంలో మంగళవారం రాత్రి అల్లర్లు చెలరేగాయి. అందులో ఎర్రిస్వామి అనే వ్యక్తిని గ్రామానికి చెందిన ఐదుగురు చితకబాదారు. దీంతో గ్రామంలో రాత్రంతా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎప్పుడేం జరుగుతుందోనని గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే సీఐ శివప్రసాద్ నేతృత్వంలో ఎస్‌ఐ నాగస్వామి, ఏఎస్‌ఐ విజయనాయక్, మరికొందరు పోలీసులు బుధవారం ఉదయమే గ్రామంలో పర్యటించారు. శాంతిభద్రతలను పర్యవేక్షించారు. గ్రామంలో అల్లర్లకు పాల్పడినా, దాడులకు దిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు.