breaking news
atracity case file
-
చీరాల ఇరిగేషన్లో రచ్చకెక్కిన విభేదాలు
సాక్షి, చీరాల: చీరాల ఇరిగేషన్ కార్యాలయంలో ఈఈ కి, సిబ్బందికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇరిగేషన్ డ్రైనేజీ డివిజన్ కార్యాలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.వెంకటరాజు కార్యాలయం యూడీసీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. మిగిలిన ఉద్యోగులపై కూడా అట్రాసిటీ కేసు పెడతానని బెదిరిస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. తాను చెప్పిన పనులు చేయడం లేదని, ఏదైనా చెబితే ఎదురు మాట్లాడుతున్నారని, అందుకే తాను కులం పేరుతో తిట్టాడని యూడీసీ హేమంత్‌కుమార్‌పై అట్రాసిటీ కేసు పెట్టానని ఉన్నతాధికారులకు ఈఈ చెప్పుకున్నట్లు సమాచారం. నిత్యం తమను పిలిపించి కాంట్రాక్టర్లు, ఉన్నతోద్యోగుల ముందు అవమానకరంగా మాట్లాడుతూ ఈఈ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని యూడీసీ కూడా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈఈ అకారణంగా తమను దుర్భాషలాడుతూ వేధింపులకు పాల్పడుతున్నాడని ఉద్యోగులు సైతం చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం యూడీసీపై వేధింపులకు పాల్పడటంతో పాటుగా చొక్కా పట్టుకుని దుర్బాషలాడుతూ కర్ర తీసుకొని ఈఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఉద్యోగులంతా ఈఈని ప్రశ్నించారు. ఈఈ మాత్రం తనను యూడీసీ కులంపేరుతో దూషించి దాడికి యత్నించాడని అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసి అట్రాసిటీ కేసు పెట్టినట్లు చెబుతున్నారు. యూనియన్ నాయకులను కలిసిన సిబ్బంది ఇరిగేషన్ చీరాల డివిజన్ కార్యాలయంలో పనిచేస్తున్న నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బండి శ్రీనివాసరావును ఒంగోలులో కలిసి ఈఈ ఆగడాలను, వేధింపులను వివరించారు. దీనిపై ఎన్జీవో నేతలు ఈఈతో మాట్లాడితే యూడీసీపై పెట్టిన కేసును మాత్రం వెనక్కి తీసుకునేది లేదని తేల్చి చెప్పాడు. తాను ఇచ్చిన కేసు రిజిస్టర్ చేయాల్సిందేనని డీఎస్పీ వద్ద పట్టుబట్టాడు. ఉన్నతాధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు ? కింది స్థాయి ఉద్యోగులు సరిగా పనిచేయకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చునని, సంవత్సర కాలంగా ఉన్నతాధికారులను సైతం తిట్టుకుంటూ తమపై అరాచకంగా ఈఈ ప్రవర్తిస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఆయన అనారోగ్యంతో బాధ్యతలు తీసుకున్నాడని, ఇరిగేషన్ గెస్ట్‌హౌస్‌లోనే సంవత్సరం అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఉద్యోగులు తెలిపారు. ప్రతి చిన్న విషయానికి ఫైళ్లు తీసుకుని గెస్ట్‌హౌస్‌లోకి తాము వెళ్లాల్సి వస్తుందని, ఏదో ఒక వంక చూపించి తిట్టడం పరిపాటిగా మారిందని ఉద్యోగులు తెలిపారు. పొన్నూరులో పనిచేస్తున్న ఏఈ నాగేశ్వరావు ప్రతి నిత్యం ఈఈ కార్యాలయంలోనే ఉంటూ ఎస్టాబ్లిష్మెంట్ క్లర్క్ చేయాల్సిన పనులన్నీ తాను చేస్తూ కార్యాలయంలో ఎవ్వరికీ ఏ పనీ చేతకాదని చాడీలు ఈఈకి చెబుతున్నాడని ఉద్యోగులు వాపోతున్నారు. చీరాల డ్రైనేజీ ఈఈ నుంచి తమకు రక్షణ కల్పించాలని లేకుండా ఉమ్మడి సెలవులు పెడతామని ఉద్యోగులు అంటున్నారు. యూడీసీని తిట్టిన మాట వాస్తవమే కానీ.. చీరాల డ్రైనేజీ కార్యాలయంలో పనిచేస్తున్న యూడీసీ హేమంత్‌కుమార్ బిల్లుల విషయంలో నన్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. ఐటీ రిటన్స్ విషయంలో ఈఈగా నాకు అధికారం లేదు. ఈ విషయమై యూడీసీతో మాట్లాడుతూ పనిలో నిబద్దత ఉండాలని, పనికిమాలిని పనులు చేయవద్దని తిట్టిన మాట వాస్తవమే. అయితే యూడీసీ మాత్రం తనను బూతులు తిట్టడంతో పాటుగా దాడికి యత్నించి కులం పేరుతో దూషించాడు. సిబ్బంది పనితీరు మార్చుకోవాలని సూచిస్తే నాపై దాడికి యత్నించి, కులం పేరుతో దూషించాడు. అందుకే అట్రాసిటీ కేసు పెట్టా. పనిచేయని ఉద్యోగులు ఎవ్వరినీ విడిచి పెట్టను. -బి.వెంకటరాజు, డ్రైనేజీ ఈఈ, చీరాల. -
ఎమ్మెల్యే జేసీపై అట్రాసిటీ కేసు
పెద్దపప్పూరు : అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం తాడిపత్రి ఎంఎల్ఏ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదయింది. గత నెల 24న జూటూరు వద్ద ఆర్డీఓ పర్మిషన్తో తాడిపత్రి మండలంలోని చిన్నపడమల వద్దనున్న శ్రీకృష్ణ ప్రభోదానంద ఆశ్రమం నిర్మాణానికి కావాల్సిన ఇసుక తీసుకొని వెళ్తున లారీని జేసీ ప్రభాకర్‌రెడ్డి పెద్దపప్పూరుకు వస్తూ పోలీసులకు అప్పగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో లారీ డ్రైవర్ దాసరి వెంకటేష్‌ను కులం పేరుతో దూషించినట్లు బాధితుడు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసారు. హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు పెద్దపప్పూరు స్టేషన్లో ఎంఎల్ఏపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయమై ఎస్ఐ శ్రీహర్షను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించేందుకు నిరాకరించారు. -
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
బెళుగుప్ప (ఉరవకొండ) : బెళుగుప్ప మండలం గంగవరంలో మంగళవారం రాత్రి జరిగిన అల్లర్లలో కులం పేరుతో దూషిస్తూ ఎర్రిస్వామి అనే వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో గ్రామానికి చెందిన చంద్ర, శీన, పవన్, అన్వర్, వెంకటేశులు అనే వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బుధవారం నమోదు చేసినట్లు ఎస్ఐ నాగస్వామి తెలిపారు. నిందితుల దాడిలో ఎర్రిస్వామి గాయపడి అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వివరించారు. గంగవరంలో ఉద్రిక్తం రాతి దూలం పోటీల్లో గెలిచిన ఎద్దులను ఊరేగించే క్రమంలో గంగవరంలో మంగళవారం రాత్రి అల్లర్లు చెలరేగాయి. అందులో ఎర్రిస్వామి అనే వ్యక్తిని గ్రామానికి చెందిన ఐదుగురు చితకబాదారు. దీంతో గ్రామంలో రాత్రంతా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎప్పుడేం జరుగుతుందోనని గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే సీఐ శివప్రసాద్ నేతృత్వంలో ఎస్ఐ నాగస్వామి, ఏఎస్ఐ విజయనాయక్, మరికొందరు పోలీసులు బుధవారం ఉదయమే గ్రామంలో పర్యటించారు. శాంతిభద్రతలను పర్యవేక్షించారు. గ్రామంలో అల్లర్లకు పాల్పడినా, దాడులకు దిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు.