నష్టపోయిన రైతులను ఆదుకోవాలి | Sakshi
Sakshi News home page

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

Published Thu, Aug 25 2016 7:15 PM

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి - Sakshi

మంచాల: పంటలు ఎండి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదగోని జంగయ్యగౌడ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఆరుట్ల గ్రామంలో ఎండిన మొక్కజొన్న పంటను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో రైతాంగ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల ముందు  రైతాంగాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని కేవలం హామీలు ఇచ్చి చేతులు  దులుపుకుందన్నారు. ఐదుసార్లు ప్రకృతి వైపరిత్యాల వల్లన పంటలు దెబ్బతిన్న రైతులకు నయా పైసా కూడా పరిహారం ఇవ్వలేదన్నారు.  కేంద్రం కరువు నిధులు ఇచ్చామని చెబుతుందని.. రాష్ర్ట ప్రభుత్వం మాత్రం వాటిని రైతులకు ఇవ్వడం లేదన్నారు. పంట రుణమాఫీ విషయంలో కూడా నష్టపూరితంగానే ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. అప్పులు చేసి పంటలు సాగు చేసిన రైతులు పంటలు ఎండి నష్టాల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొందన్నారు. ప్రధానంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పంటలు పూర్తిగా చేతికి రాకుండా పోయాయన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడి రైతులను ఆదుకోవాలని  అన్నారు. ఈ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం ఇవ్వాలన్నారు.  ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకులు దాసరమోని సురేష్‌, లోంగారి యాదగిరి, ఎన్నుదుల మహేష్‌, సుంకరి దానయ్యగౌడ్‌, తాళ్ల ప్రభాకర్‌గౌడ్‌, జోగు సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement