
ఫీజు కట్టలేదా.. రోజుకు రూ.100 ఫైన్!
తిరుపతిలోని పద్మావతి మహిళా కళాశాలలో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థినులకు కష్టకాలం వచ్చింది.
⇒ పద్మావతి మహిళా వైద్య కళాశాల యాజమాన్యం ఆదేశం
⇒ విద్యార్థులు రోజుకు రూ.వంద చొప్పున ఫైన్ చెల్లించాల్సిందే
⇒ గడువు దాటినా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు చెల్లించని ప్రభుత్వం
⇒ తల్లిదండ్రులను పిలిపించి మరీ హెచ్చరించిన యాజమాన్యం
హైదరాబాద్: తిరుపతిలోని పద్మావతి మహిళా కళాశాలలో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థినులకు కష్టకాలం వచ్చింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు చెల్లించకపోవడంతో మెడికోలు వీధినపడ్డారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదని, మీరు ఫీజు కడితేనే కళాశాలకు రావాలని, లేదంటే రానక్కరలేదని పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఆదేశించారు. దీంతో 50 మంది మెడికోలు ఏం చేయాలో తెలియక లోలోపల కుమిలిపోతున్నారు. కళాశాల యాజమాన్యం విద్యార్థినుల తల్లిదండ్రులను పిలిపించింది. మీ పిల్లలకు సంబంధించిన ఫీజులు ప్రభుత్వం నుంచి రాలేదని, ఇప్పటికే నెలన్నర దాటిపోయింది కాబట్టి రోజుకు రూ.వంద చొప్పున ఫైన్‌తో మొత్తం ఫీజు చెల్లిస్తేనే కళాశాలకు పంపించాలని స్పష్టం చేసింది.
ప్రభుత్వం నుంచి ఫీజులకు నోచుకోని విద్యార్థినులంతా పేద, మధ్యతరగతికి చెందిన వారే. 2015-16లో అల్పాదాయ, వెనుకబడిన కులాలు, ఆర్థికంగా వెనుకబడిన కులాల కింద దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఎవరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదు. వీరు ఇప్పుడు రెండో ఏడాదిలోకి అడుగుపెట్టారు. ఏడాదికి ట్యూషన్ ఫీజు కింద రూ.60 వేలు చెల్లించాలి. వాస్తవానికి వీళ్లందరూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు కాబట్టి ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలి. కానీ, గడువు ముగిసినా ప్రభుత్వం నుంచి ఫీజులు రాలేదు. ఫీజుల విషయంపై మాట్లాడేందుకు కొందరు విద్యార్థినులు ఈ నెల 18న ప్రిన్సిపల్‌ను కలిశారు. ఎంబీబీఎస్ సీటంటే ఏమనుకున్నారు, కోటి రూపాయలు ధర పలుకుతోంది. మీరు రూ.60 వేలు కట్టలేరా? వైద్యవిద్య అంటే ఆషామాషీ అనుకున్నారా? అంటూ ప్రిన్సిపల్ దబాయించినట్టు విద్యార్థినులు తెలిపారు.