
వృథా ప్రయాసే..
మధ్యాహ్న భోజనానికి స్పందన కరువు... వేసవి సెలవుల్లో విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరువు
సెలవుల్లో మధ్యాహ్న భోజనానికి స్పందన కరువు
26 శాతానికి మించని విద్యార్థుల హాజరు
వండిన వంటలు నేలపాలు పలుచోట్ల తెరుచుకోని పాఠశాలలు
ఫలితమివ్వని కరువు భోజన పథకం
మెదక్: మధ్యాహ్న భోజనానికి స్పందన కరువు... వేసవి సెలవుల్లో విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరువు భోజన పథకానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. కొన్ని చోట్ల అసలు పాఠశాలలే తెరుచుకోవడం లేదు. మిగతా చోట్ల వంటలు వండుతున్నా తినే వారు లేకుండా పోయారు. ఫలితంగా వండి వంటలు నేలపాలవుతున్నాయి. విద్యార్థుల హాజరు శాతం స్వల్పంగా ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. కరువు పథకం ప్రారంభించి వారం రోజులైనా విద్యార్థుల హాజరు శాతం 26కు మించకపోవడం గమనార్హం. ప్రభుత్వం పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి భోజన పథకాన్ని కొనసాగిస్తోన్నా ప్రయోజనం లేకుండా పోయింది.
జిల్లాలో 2,892 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో ఒకటినుంచి 10వరకు ఉండగా, అందులో 3 లక్షల 37 వేల 56 మంది నిరుపేద విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈనెల 21 నుంచి సెలవుల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు. ఇందుకు సంబంధించి పూర్తి బాధ్యతలను పాఠశాలల హెచ్‌ఎంలకు అప్పగించారు.
వారం రోజుల్లో ఇలా...
గడచిన వారం రోజుల్లో ఏనాడు 26 శాతానికి మించి విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి హాజరు కాకపోవడంతో ఈ పథకం విజయవంతం కాలేదని పలువురు పేర్కొంటున్నారు. ఈనెల 21న 25 శాతం మంది, 22న 26.24 శాతం, 23న 26.6 శాతం, 24న 24.80 శాతం, 25న 26.11, 26న 26.32 శాతం విద్యార్థులు మాత్రమే భోజనానికి హాజరైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే 10శాతం కూడా విద్యార్థులు హాజరైన దాఖలాలు లేవని సాక్షాత్తు ప్రధానోపాధ్యాయులే పేర్కొంటున్నారు. మెదక్ పట్టణంలోని న్యూ హైస్కూల్‌లో 6నుంచి పదోతరగతి వరకు 332 మంది విద్యార్థులు చదువుతుండగా మధ్యాహ్న భోజనానికి మంగళవారం కేవలం తొమ్మిది మంది మాత్రమే హాజరైనట్టు హెచ్‌ఎం ఎండీ తకిమొద్దీన్ తెలిపారు. జిల్లాలోని అనేక పాఠశాలలో ఇదే పరిస్థితి కొనసాగుతుండగా, మరికొన్ని పాఠశాలల తాళాలే తీయడం లేదన్న ఆరోపణలున్నాయి.
పథకం వృథా..
మధ్యాహ్న భోజన పథకంతో ప్రయోజనం లేకుండా పోయింది. సెలవులను లెక్కగట్టి సదరు రోజులకు సంబంధించిన బియ్యాన్ని వారి ఇళ్లకే సరఫరా చేస్తే బాగుండేదని పలువురు మేధావులు పేర్కొంటున్నారు. పాఠశాలలకు విద్యార్థులు రాకపోవడంతో వండిన వంటలు వృథా అవుతున్నాయని వారు చెబుతున్నారు. విద్యార్థులకు మేలు జరగడం పక్కన పెడితే ఉపాధ్యాయుల వేతనాలే రెండింతలు అవుతున్నాయని పేర్కొంటున్నారు.