
భారత ఎగుమతులపై అమెరికా టారిఫ్‌ల కారణంగా తక్షణం పడే ప్రభావం పరిమితంగానే ఉన్నప్పటికీ.. వీటి తాలూకూ ప్రభావాలు భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసురుతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. వీటిని తప్పకుండా పరిష్కరించాల్సి ఉందని పేర్కొంది. ఈ సమస్యల పరిష్కారానికి భారత్–యూఎస్ మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు కీలకమని తన నెలవారీ ఆర్థిక సమీక్షా నివేదికలో పేర్కొంది. అమెరికా 50 శాతం టారిఫ్‌లు 48 బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రభావం చూపించనున్నట్టు అంచనా. అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా ఎగుమతుల్లో వైవిధ్యంపై దృష్టి సారించినట్టు ఆర్థిక శాఖ తెలిపింది.
ఇటీవలే యూకే, ఈఎఫ్‌టీతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌ఏటీ)పై చర్చలను ముగించినట్టు, యూఎస్, ఈయూ, న్యూజిలాండ్, చిలీ, పెరూతో చర్చలు కొనసాగుతున్నట్టు పేర్కొంది. ‘ఈ చర్యల ఫలితాలు కనిపించేందుకు కొంత సమయం పడుతుంది. అధిక టారిఫ్‌ల కారణంగా అమెరికాకు తగ్గే ఎగుమతులను ఇవి పూర్తి స్థాయిలో భర్తీ చేయకపోవచ్చు’ అని ఆర్థిక శాఖ నివేదిక వివరించింది. బలమైన ఆర్థిక పనితీరు, విధానపరమైన స్థిరత్వం, మౌలిక సదుపాయాలపై అధిక పెట్టుబడులు, భారత సావరీన్ రేటింగ్‌ను బీబీబీ మైనస్ నుంచి బీబీబీకి ఎస్‌అండ్‌పీ అప్‌గ్రేడ్ చేయడాన్ని సానుకూలంగా పేర్కొంది. దీనివల్ల రుణ వ్యయాలు తగ్గుతాయని, విదేశీ పెట్టుబడులు మరిన్ని ఆకర్షించొచ్చని అభిప్రాయపడింది. దేశీయంగా సాధారణం కంటే అధిక వర్షపాతం, ఖరీఫ్ సాగు మెరుగ్గా ఉండడం రిటైల్ ద్రవ్యోల్బణాన్ని సమీప కాలంలో నియంత్రణలోనే ఉంచుతాయని అంచనా వేసింది. జీఎస్‌టీ సంస్కరణలు, పన్నుల తగ్గింపు వంటివి వినియోగాన్ని పెంచుతాయని, వ్యాపార నిర్వహణ సులభతరం అవుతుందని పేర్కొంది.
జీడీపీపై అర శాతం ప్రభావం
అమెరికా టారిఫ్‌ల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం స్వల్పమేనని వాణిజ్య శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై అభిప్రాయపడ్డారు. ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్కెట్లను గుర్తించలేకపోతే అప్పుడు జీడీపీ వృద్ధి రేటుపై 0.50 శాతం మేర ప్రభావం ఉంటుందన్నారు. ఫలితంగా టెక్స్‌టైల్స్, రత్నాభరణాలు, సముద్ర ఆహార ఉత్పత్తులు, కెమికల్స్ రంగాలకు ఇబ్బందులు ఎదురుకావొచ్చన్నారు. రష్యా చమురును యూరప్ దేశాలు, చైనా దిగుమతి చేసుకుంటున్నప్పటికీ భారత్‌పైనే అధిక టారిఫ్‌లు విధించడం వివక్ష చూపించడమేనన్నారు. ప్రభుత్వం ఈ ప్రభావాన్ని పరిమితం చేసేందుకు చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమస్యలను గట్టెక్కి, కొత్త మార్కెట్లలో అవకాశాలను సొంతం చేసుకునే దిశగా దేశీ పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలన్నారు.
ఇదీ చదవండి: వైద్య రంగంలో కృత్రిమ మేధ విస్తరణ