
టెక్నాలజీ అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. భారత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో సాంకేతికత పాగా వేస్తోంది. అందుకు చాలానే కారణాలున్నాయి. ఇండియాలో కొన్ని సర్వేల ప్రకారం 1,457 మంది రోగులకు ఒక డాక్టర్ ఉన్నారు. కానీ ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సిఫార్సు చేసిన డాక్టర్-రోగుల నిష్పత్తి 1:1,000 కంటే చాలా తక్కువ. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో లక్షల మందికి ప్రాథమిక వైద్య సదుపాయాలు కరవవుతున్నాయి. కాబట్టి ఈ రంగంలో సేవలు విస్తరించాలంటే సాంకేతికత కీలకంగా వ్యవహరిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీని అందిపుచ్చుకోవడం అత్యవసరం. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల్లో కృత్రిమ మేధ (AI) వేగంగా విస్తరిస్తోంది. దీని సాయంతో వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఉదాహరణకు.. ఒడిశాలోని కొన్ని మారుమూల గ్రామాల్లో ఏఐ సాయంతో వైద్యం నిఫారసు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లతో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు దగ్గు రికార్డింగ్‌లను విశ్లేషించడం ద్వారా క్షయ(టీబీ) కేసులను గుర్తించారు. అదే నేపథ్యంలో కొన్ని వేల మామోగ్రామ్‌లపై శిక్షణ పొందిన మరొక ఏఐ యాప్ రొమ్ము క్యాన్సర్ కేసులను గుర్తించడంలో సహాయపడింది. ఇది రిమోట్‌గా ఆంకాలజిస్టులతో మమేకమై రోగులకు సలహాలు ఇస్తోంది.
వ్యాధిని గుర్తించడంలో కీలకం
డయాగ్నోస్టిక్స్‌లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరించింది. ఉదాహరణకు.. గూగుల్ డీప్ మైండ్ రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడంలో 99% కచ్చితత్వాన్ని చేరుకుందని కొన్ని రిపోర్ట్‌ల ద్వారా తెలుస్తుంది. కంటి వ్యాధులు, చర్మ క్యాన్సర్, అల్జీమర్స్ వంటి నాడీ పరిస్థితులను గుర్తించడానికి కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. చెస్ట్ ఎక్స్-రే రిపోర్ట్‌ల నుంచి టీబీని నిర్ధారించడంలో ఏఐ సాధనాలు మెరుగ్గా పని చేస్తున్నాయి. వ్యాధిని వేగంగా గుర్తించడంతో ముందస్తు చికిత్స అందుతుంది. ఇది ట్రీట్‌మెంట్ ఫలితాలను మెరుగుపరచడమే కాకుండా, ఆరోగ్య సంరక్షణ నిపుణులపై ఒత్తిడిని తగ్గిస్తుంది.
రియల్ టైమ్ మానిటరింగ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల ద్వారా హైపర్-పర్సనలైజ్డ్ మెడిసిన్‌కు అవకాశం ఉంటుంది. ఇందులో ఉపయోగించే అల్గారిథమ్‌లు నిర్దిష్ట మందులకు ప్రత్యేకంగా రోగులు తమ వ్యక్తిగత జీవన విధానాన్ని అనుసరించి ఎలా స్పందిస్తారో అంచనా వేస్తాయి. ఇది ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది. డయాబెటిక్ రోగులు పెరుగుతున్న నేపథ్యంలో కృత్రిమ మేధ ఆధారిత వేరబుల్ పరికరాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయులను రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తున్నాయి. సంభావ్య సంక్షోభాల గురించి వైద్యులు లేదా సంరక్షకులను అప్రమత్తం చేస్తున్నాయి.
ఇదీ చదవండి: నెట్‌వర్క్ విస్తరణలో అమెజాన్