వైస్సార్‌సీపీలో స్పష్టత

వైస్సార్‌సీపీలో స్పష్టత - Sakshi

– టీడీపీలో కొనసాగుతున్న సందిగ్ధత 

– బీజేపీతో తెగని పంచాయతీ 

 – టీడీపీ  మెట్టుదిగుతున్నా వెనక్కి తగ్గని బీజేపీ నేతలు 

– చివరికీ ఎనిమిది సీట్లు ఇచ్చేందుకు అంగీకారం

– 12 ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్న బీజేపీ 

సాక్షి ప్రతినిధి, కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీలో స్పష్టత వచ్చేసింది. అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. అన్ని డివిజన్లలోనూ బరిలోకి దిగుతోంది. టీడీపీలో ఇంకా కొలిక్కి రాలేదు. టీడీపీ, బీజేపీ పొత్తు పంచాయతీ తెగలేదు. నిన్నటి వరకు మూడు డివిజన్లు ఇస్తామని చెప్పుకొచ్చిన టీడీపీ ఎనిమిది డివిజన్‌లు కేటాయించేందుకు ముందుకొచ్చింది. కానీ 12 కావాలని బీజేపీ పట్టుబడుతోంది. దీంతో వ్యవహారం అదిష్టానం వద్దకు వెళ్లింది.   

 గురువారం నామినేషన్లు భారీ ఎత్తున పడ్డాయి. ఈ ఒక్కరోజే 381 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు అభ్యర్థుల తాకిడితో కిటకిటలాడాయి. నామినేషన్లు వేసేందుకు వెళ్లిన కార్యకర్తల కోలహలంతో నగర వీధులు సందడితో రద్దీగా కనిపించాయి. ఎక్కడ చూసినా రాజకీయ పక్షాల హడావుడి కనిపించింది. చివరి రోజు కావడంతో అభ్యర్థులంతా పోటీపడి నామినేషన్లు దాఖలు చేశారు. ప్రత్యర్ధి పార్టీల నుంచి ఎవరేస్తున్నారో చూసుకుని అప్పటికప్పుడు ధీటైన అభ్యర్థులు దాఖలు చేసిన సందర్భాలు బయటపడ్డాయి. మొత్తంగా చూస్తే కార్పొరేషన్‌ పరిధిలోని 48 డివిజన్లకుగాను 493 నామినేషన్లు దాఖలయ్యాయి.

టీడీపీ తర్జనభర్జన 

టీడీపీలో ఇంకా కసరత్తు జరుగుతూనే ఉంది. కొన్ని డివిజన్లకు సరైన అభ్యర్థులు దొరకకపోవడంతో ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ఎంపిక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధినేత చంద్రబాబు ఆదేశించడంతో డివిజన్‌కు ముగ్గురు చొప్పున పేర్లు రాసి పంపించినట్టు తెలిసింది. ఒక డివిజన్‌కైతే ఒక్కరిపేరే ప్రస్తావించగా ఏమిటీ పరిస్థితని  నేతలను చంద్రబాబు గట్టిగా ఆరాతీసినట్టు సమాచారం. ముఖ్యంగా కాకినాడ 14వ డివిజన్‌లో అధికార పార్టీకి పోటీ చేసేందుకు అభ్యర్థి కూడా కరువయ్యాడు. దీంతో మరో 10 నిమిషాల్లో నామినేషన్ల ఘట్టం పూర్తవుతుందనుకున్న సమయంలో చివరి క్షణంలో ఎమ్మెల్యే అన్న కొడుకు వనమాడి ఉమాశంకర్, మరో అభ్యర్థి చేత నామినేషన్‌ వేయించారు. 

మెట్టు దిగినా పట్టువదలని బీజేపీ 

టీడీపీతో బీజేపీ ఒక ఆట ఆడుకుంటోంది. అధికార పార్టీ పరిస్థితి దయనీయంగా మారడం, మిత్రపక్షాన్ని వదులుకునే ధైర్యం చేయలేక బీజేపీ ఏమి చెబితే అదే చేసే పరిస్థితికి వచ్చేసింది. ఆ పార్టీ బలం కన్నా ఎక్కువ సీట్లు అడుగుతుండగా, ఇవ్వకపోతే ఇబ్బంది అన్నట్టుగా టీడీపీ సాగిలా పడిపోతోంది. బీజేపీ తొలుత 20 సీట్లు అడగ్గా కేవలం రెండే ఇస్తామని టీడీపీ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించింది. ఆ తరువాత బీజేపీ పెద్దలు రంగంలోకి దిగి గట్టిగా హెచ్చరించడంమే కాకుండా అమీతుమీ తేల్చుకుంటామని అల్టిమేటం జారీ చేయడంతో టీడీపీ వెనక్కి తగ్గింది. ఐదిస్తామని బేరం పెట్టింది. కానీ బీజేపీ ససేమిరా అనడంతో తాజాగా ఎనిమిది ఇచ్చేందుకు అధికార పార్టీ అంగీకరించింది. దానికి బీజేపీ నేతలు ఒప్పుకోవడం లేదు. 12 సీట్లు ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీంతో నామినేషన్ల ఘట్టం ముగిసినా  సీట్ల పంపకాల పంచాయతీ కొలిక్కిరాలేదు. ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థులు 20 డివిజన్‌లకుగాను 35మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఒకవేళ టీడీపీ దారికి రాకపోతే బరిలో ఉండిపోదామన్న ఆలోచనలో ఉన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏం చేయాలన్న దానిపై అదిష్టానానికి వదిలేశారు. బీజేపీ అడుగుతున్న డివిజన్‌ల వివరాలను, కేటాయిస్తామన్న డివిజన్‌ల వివరాలను అదిష్టానానికి పంపించారు. ఇప్పుడక్కడే నిర్ణయం తీసుకోవల్సి ఉంది. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top