కోతి చేష్టలు.. ఆగిన రైళ్ల రాకపోకలు

ఇప్పటం (తాడేపల్లి రూరల్)/దుగ్గిరాల: ఓ కోతి చేసిన పిచ్చి చేష్టలతో బుధవారం 40 నిమిషాల పాటు రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గేటు సమీపంలో ఓ కోతి విద్యుత్ స్తంభం ఎక్కి అటూ ఇటూ దూకడంతో తీగలు తెగిపోయి రైల్వే ట్రాక్‌పై పడ్డాయి. దీంతో కృష్ణా కెనాల్ జంక్షన్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కూడా ఫ్యూజులు ఫెయిల్ అయ్యాయి.
అప్రమత్తమైన రైల్వే అధికారులు ఇప్పటం గేటు వద్ద వైర్లు తెగినట్లు గమనించి తాత్కాలిక మరమ్మతులు నిర్వహించారు. ఇందుకు 40 నిమిషాలు పట్టడంతో కేరళ ఎక్స్‌ప్రెస్ పెదవడ్లపూడి రైల్వేస్టేషన్‌లో, బిట్రగుంట ప్యాసింజర్ దుగ్గిరాల సమీపంలో ఆగిపోయాయి. ఈ రెండు రైళ్లు వెళ్లిపోయిన తరువాత పూర్తిస్థాయి మరమ్మతులు నిర్వహించి విద్యుత్‌ను పునరుద్ధరించారు. అనంతరం రైళ్ల రాకపోకలను అనుమతించారు. కోతి విద్యుత్ తీగలు పట్టుకుని ఊగడం వల్లే ఈ ఘటన జరిగిందని, విద్యుత్ షాక్‌తో కోతి మృతి చెందిందని రైల్వే అధికారులు తెలిపారు.