
మాస్టర్‌ప్లాన్ రూపొందించేందుకు చర్యలు
బందరు పోర్టు నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటుకు సింగపూర్, జపాన్, చైనాకు చెందిన ప్రతినిధుల్లో ఒకర్ని ఎంపిక చేసి మాస్టర్‌ప్లాన్ రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర బీసీ, సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు.
మచిలీపట్నం(చిలకలపూడి): బందరు పోర్టు నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటుకు సింగపూర్, జపాన్, చైనాకు చెందిన ప్రతినిధుల్లో ఒకర్ని ఎంపిక చేసి మాస్టర్‌ప్లాన్ రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర బీసీ, సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. భూసమీకరణలో ఉన్న భూముల్లో మెట్ట, మాగాణి నిర్ణయించేందుకు ఏడు శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటుచేశామని, వీరి నివేదికను పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి తెలిపారు. అసైన్డ్ భూముల కొనుగోలుదారు, అనుభవదారు వివరాలు సేకరించేందుకు త్వరలో సర్వే ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లాలో జరుగుతు న్న జనచైతన్య యాత్రలకు ప్రజలు ఆదరణ చూపుతున్నారన్నారు. ఇందుకోసం ఈనెల 10వ తేదీన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మచిలీపట్నంలో జరిగే జనచైతన్య యాత్రలో పాల్గొననున్నారన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 4.70 లక్షల మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారని చెప్పారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు(బుల్లయ్య), గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్‌నాయుడు, నాయకులు కుంచే దుర్గాప్రసాద్(నాని) పాల్గొన్నారు.