అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గత మూడు రోజులుగా జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రాలను అందజేశామన్నారు.
ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, జర్నలిస్టుల పిల్లలకు ఇంటర్ వరకు ఉచిత నిర్బంధ విద్య, హెల్త్ కార్డు కలిగిన వారికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అమలుపరచాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచచేసి రుణాలు అందించాలన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే నెలలో మీడియా మార్చ్ చేపడతామన్నారు. నగరంలోని జర్నలిస్టులకు ఇళ్లు నిర్మించేందుకు ముందుకు వచ్చిన ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రామ్మూర్తి, శివానంద తదితరులు పాల్గొన్నారు.