భూమంత్రకాళీ

భూమంత్రకాళీ


చూడు జాగ..వేసెయ్‌ పాగా

చిరమనలో 55 ఎకరాలకు పైగా భూమి హాంఫట్‌

మార్కెట్‌ విలువ రూ.3 కోట్లకు పైనే

రెవెన్యూ అధికారులు, నాయకుల నిర్వాకం




రెవెన్యూ అధికారులు.. నాయకులు ఏకమయ్యారు. 55 ఎకరాల ప్రభుత్వ భూమిని బినామీ పేర్లతో కట్టబెట్టేశారు. పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు సైతం జారీ చేశారు. ఏఎస్‌ పేట మండలం చిరమన గ్రామంలో ఈ భారీ కుంభకోణం వెలుగు చూసింది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోవడం లేదు.



ఆత్మకూరు రూరల్‌ :

సెంటు భూమి కోసం పేదోళ్లు కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోరు. ప్రభుత్వ ఉత్తర్వులు రావాల్సి ఉందని.. అప్పటివరకు ఆగాలని కుంటిసాకులు చెబుతారు. నాయకులకు మాత్రం ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టేస్తున్నారు. ఏఎస్‌ పేట మండలంలోనూ ఇలాంటి కుంభకోణం వెలుగు చేసింది. ఎంపీటీసీ సభ్యుడిగా వ్యవహరిస్తున్న టీడీపీ నాయకుడొకరు రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని ఏఎస్‌ పేట మండలం చిరమన గ్రామంలో 40ఎకరాలకు పైగా భూమిని.. అతడి శిష్యుడు చిరమన మజరా కన్నెదారి వారిపల్లెలో 14.73 ఎకరాల భూమిని హస్తగతం చేసుకున్నారు. బినామీ పేర్లతో భూములు పొందిన నేతలు తమ గుప్పెట్లో పెట్టుకున్నారు.



చిరమన గ్రామంలోని సర్వే నంబర్‌ 878/3, 881లలో లేబూరు పరమేశ్వర్లు పేరుతో 4.69 ఎకరాలు, సర్వే నంబర్‌ 882లో వాయిలేటి వీరయ్య పేరుతో 4.36 ఎకరాలు, 883/1లో జులుమూడి రాధయ్య పేరుతో 5 ఎకరాలు, 882/2, 884లో నలగండ్ల సుందరయ్య పేరుతో 4.85 ఎకరాలు, 885/1లో వాయిలేటి రమణయ్య పేరుతో 4.16 ఎకరాలు, 885/2లో లేబూరి ప్రభాకర్‌ పేరుతో 4.76 ఎకరాలు, 879లో నాటకరాని వెంకటయ్య పేరుతో 4.32 ఎకరాలు, సర్వే నంబర్‌ 886/2లో 4 ఎకరాలు కలిపి 36.13 ఎకరాల సీజేఎఫ్‌ఎస్‌ భూమిని టీడీపీ నేత పొందారు. ఇదే గ్రా మంలో మరికొంత భూమిని కూడా కబ్జా చేశాడు. సర్వే నంబర్‌ 882లోని భూమిని తన కోడలు, సర్వే నంబర్‌ 885/1లో భూమిని తన కుమార్తె పేరిట ఇటీవల మార్పించుకున్నాడు. సదరు నాయకుడికి గ్రామంలో 50 ఎకరాలకు పైగా భూమి ఉండగా.. ప్రభుత్వ భూమిని సైతం హస్తగతం చేసుకున్నాడు.



వాళ్లెవరో..

భూములు పొందిన బినామీదారులకు చిరమన గ్రామంతో అసలు సంబంధమే లేదు. వారికి గ్రామంలో ఓట్లు, రేషన్‌కార్డులు గాని లేవు. వారు ఏ గ్రామానికి చెందిన వారో కూడా ఎవరికీ తెలియదు. అయితే సదరు నేత తనకున్న రాజకీయ, ఆర్థిక బలంతో రెవెన్యూ అధికారులను లోబరుచుకుని ప్రభుత్వ భూములను కాజేశాడు. వాటికి హక్కులు పొంది అనుభవిస్తున్నాడు. ఐదేళ్లుగా ఆ భూములు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి.



అదే బాటలో శిష్యుడు

ఆ నాయకుడికి శిష్యుడైన మరో టీడీపీ నేత ఆయన అండదండలతో చిరమన పంచాయతీ పరిధిలోని కన్నెదారివారిపల్లెలో 14.73 ఎకరాలను కబ్జా చేశాడు. సర్వే నంబర్‌ 1028/1లో దాసరి శ్రీరాములు పేరుతో 3.28 ఎకరాలు, 1028/2లో 11.45 ఎకరాల ప్రభుత్వ భూమిని మరో పేరుతో కాజేశాడు. అయితే దాసరి శ్రీరాములు అనే వ్యక్తి ఆ గ్రామంలోనే లేడు. ఈ భూమిలో బోరు వేసుకున్న ఆయనకు విద్యుత్‌ కనెక్షన్‌ మంజూరు చేసేందుకు అధికారులు సిఫార్సు చేయడం గమనార్హం. వివిధ పేర్లతో అనుభవదారులుగా సృష్టించుకుని సుమారు రూ.3 కోట్ల విలువ గల ఆ భూములను టీడీపీ నాయకులిద్దరూ హస్తగతం చేసుకున్న వైనంపై జిల్లా కలెక్టర్‌కు, భూ పరిపాలన శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కొసమెరుపు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top