తప్పులు.. తిప్పలు! | High Court fine to collector | Sakshi
Sakshi News home page

తప్పులు.. తిప్పలు!

Apr 26 2016 1:39 AM | Updated on Mar 21 2019 8:35 PM

తప్పులు.. తిప్పలు! - Sakshi

తప్పులు.. తిప్పలు!

న్యాయపరమైన సమస్యలు జిల్లా యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

జిల్లా యంత్రాంగానికి వరుసగా మొట్టికాయలేస్తున్న కోర్టులు
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారంటూ ఆగ్రహం
తాజాగా కలెక్టర్‌కు రూ.1,116 జరిమానా విధించిన హైకోర్టు

న్యాయపరమైన సమస్యలు జిల్లా యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తమ దృష్టికి వచ్చే సాధారణ వివాదాల పరిష్కారంలో అధికారుల ఉదాసీనత తలనొప్పిగా మారుతోంది. అర్జీలను సకాలంలో పరిష్కరించి న్యాయం చేయాల్సిన అధికారగణం.. కాలయాపన చేస్తుండడంతో విసిగివేసారిన కక్షిదారులు కోర్టు మెట్లెక్కుతున్నారు. దీంతో న్యాయస్థానాల్లో జిల్లాకు సంబంధించి పలు రకాల కేసులు కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఈ క్రమంలో పాలనాపరమైన వ్యవహారాల్లో న్యాయస్థాన ం జోక్యం అనివార్యమవుతోంది.

తాజాగా కలెక్టర్ రఘునందన్‌రావుకు రూ.1,116 జరిమానా విధిస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

 ఘట్‌కేసర్ మండలం పోచారం గ్రామంలో రహదారి స్థలంలో ప్రముఖ ఐటీ సంస్థ ప్రహరీ నిర్మిస్తున్నట్లు స్థానికులు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో తగిన విధంగా స్పందించి చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు జిల్లా యంత్రాంగ వైఖరిని నిరసిస్తూ సదరు ఐటీ కంపెనీపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ పూర్తిచేసిన ఉన్నతన్యాయస్థానం కలెక్టర్‌కు అక్షింతలు వేస్తూ రూ.1,116 జరిమానా విధించింది.

ఈ మొత్తాన్ని గడువులోగా చెల్లించాలని స్పష్టం చేస్తూ.. జరిమానా అంశాన్ని ఐఏఎస్ అధికారుల శిక్షణ సంస్థకు సైతం వివరించాలని, అదేవిధంగా కలెక్టర్ సర్వీసు రికార్డుల్లో జరిమానా విషయాన్ని నమోదు చేయాలని తేల్చిచెప్పింది. కుత్బుల్లాపూర్ మండలంలో ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇటీవల కలెక్టర్ రఘునందన్‌రావుకు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. ఈ క్రమంలో ఆయన ఢిల్లీలోని అత్యున్నత న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా హైకోర్టు వెల్లడించిన తీర్పు యంత్రాంగాన్ని మరింత ఆందోళనకు గురిచేసింది.

 అయినా.. అదే తీరు!
న్యాయస్థానాలు వరుసగా జిల్లా యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భాలు ఇటీవలికాలంలో పెరుగుతున్నాయి. విధినిర్వహణలో అలసత్వం వహించి అక్రమార్కులకు సహరించారనే అంశంలో జిల్లాలోని ఓ తహసీల్దార్‌కు కోర్టు ఆర్నెళ్ల క్రితం జైలుశిక్ష వేసింది. ఆ ఘటన మరువకముందే ఘట్‌కేసర్ మండలం చెంగిచెర్లలో ఓ భూవివాదానికి సంబంధించి యంత్రాంగం తీరును తూర్పారబట్టింది. ఇలా వరుస ఘటనలు జిల్లాలో చోటుచేసుకుంటున్నప్పటికీ యంత్రాంగం తీరులో ఏమాత్రం మార్పు రావడంలేదని పలువురు విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement