
చీటింగ్ కేసులో మున్సిపల్ మాజీ చైర్మన్ అరెస్ట్
చీటింగ్ కేసులో బీజేపీ నాయకుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ నరాల బాలిరెడ్డితో పాటు గువ్వల నారాయణరెడ్డి అనే వ్యక్తిని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రొద్దుటూరు: చీటింగ్ కేసులో బీజేపీ నాయకుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ నరాల బాలిరెడ్డితో పాటు గువ్వల నారాయణరెడ్డి అనే వ్యక్తిని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మైదుకూరు రోడ్డులోని వాస్తుకాంప్లెక్స్ సమీపంలో ఉన్న 14 సెంట్ల భూమిని వైఎంఆర్‌కాలనికి చెందిన నరాల బాలిరెడ్డి, సానేపల్లి నరసింహారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, గువ్వల నారాయణరెడ్డిలు కలిసి దస్తగిరిపేటకు చెందిన జాకీర్‌హుసేన్‌కు విక్రయించారు. ఇందుకు సంబంధించి రూ.44 లక్షలు డబ్బు తీసుకొని 3 నెలల్లో రిజిష్టర్ చేయించేలా అగ్రిమెంట్ రాసి ఇచ్చారు. 3 నెలల కాలం గడిచిపోయినప్పటికీ వారు స్థలాన్ని రిజిస్టర్ చేయించలేదు.
పలు సార్లు జాకీర్‌హుసేన్ రిజిస్టర్ చేయించమని వారిని అడిగినా ఫలితం లేదు. ఈ క్రమంలోనే అతను విచారించగా 14 సెంట్ల స్థలం వారిది కాదని తెలిసింది. దీంతో గత ఏడాది నవంబర్‌లో అతను టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇతరుల స్థలాన్ని జాకీర్‌హుసేన్‌కు అమ్మే ప్రయత్నం చేశారని విచారణలో తేలినట్లు ఎస్‌ఐ మంజునాథరెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం నరాల బాలిరెడ్డి, గువ్వల నారాయణరెడ్డిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ తెలిపారు.