వైఎస్‌ఆర్ సీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే

విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వైఎస్‌ఆర్ సీపీలో చేరనున్నారు. ఈ నెల 13న వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు ఆయన ప్రకటించారు. ఆదివారం మీడియా సమావేశంలో వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తాకట్టుపెట్టారని శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్రంలో అరాచకం రాజ‍్యమేలుతోందని, ప్రజల తరఫున పోరాటం చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ప్రజా సమస్యలపై ఉద్యమించేందుకే వైఎస్‌ఆర్ సీపీలో చేరుతున్నట్టు తెలిపారు.
ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు వైఎస్‌ఆర్ సీపీలో చేరనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు, మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి కొడుకు మహేశ్ రెడ్డి ఇటీవల వైఎస్ జగన్‌ను కలిసి పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కందుల దుర్గేష్ పార్టీలోకి రానున్నారు.