ఆ దంపతులిద్దరూ ఉపాధ్యాయులు


 = మూన్నెల్ల కిందట రోడ్డు ప్రమాదంలో ప్రాణం కోల్పోయిన ఇంటి పెద్ద  

 = అత్తింటి ఆరళ్లతో పెద్ద కుమార్తె జీవితం నరకం

 = జీవితంపై విరక్తితో ఒకే కుటుంబంలో ఐదుగురి బలవన్మరణం


 

 ఆ దంపతులిద్దరూ ఉపాధ్యాయులు. వారికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. హాయిగా సాగిపోతున్న జీవితాలు. మూడు నెలల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ ఇంటి పెద్ద ప్రాణాలు కోల్పోయారు. అతని జ్ఞాపకాల నుంచి ఇంకా వారు పూర్తిగా కోలుకోలేదు. వీరు పుట్టెడు దుఃఖంలో ఉండగా..మరో వైపు పెద్ద కుమార్తెను భర్త, అత్తమామలు వేధించసాగారు. దీంతో జీవితంపై విరక్తి పెరిగింది. ఇక తమకు చావే శరణ్యమనుకున్న తల్లీబిడ్డలు ఇంట్లోని పైకప్పునకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

 

 మండ్య : మండ్య జిల్లా, నాగమంగళ తాలూకా, మారదేనహళ్లి గ్రామానికి చెందిన రామేగౌడ భార్య మీనాక్షమ్మ (55) దంపతులకు సుచిత్ర (26), పద్మశ్రీ(22), యోగశ్రీ(20), కుమారుడు యోగానందగౌడ(16) ఉన్నారు. మూడు నెలల క్రితం బేళూరు రొడ్డు క్రాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రామేగౌడ అకాల మృత్యుపాలయ్యాడు. మీనాక్షమ్మ ప్రస్తుతం ఆళిసంద్ర గ్రామంలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది.

 

 

  రెండు సంవత్సరాల క్రితం పెద్దకుమార్తె సుచిత్రను తుమకూరు చెందిన యువకుని ఇచ్చి వివాహం చేశారు. అయితే సుచిత్రను భర్త, అత్తమామలు వేధించసాగారు. దీంతో ఆమె పుటింటికిచేరింది. అప్పటికే భర్త మృతితో మనో వేదనకు గురవుతున్న మీనాక్షమ్మకు కుమార్తె కుటుంబంలోని కలహాలు నిద్రాహారాలే లేకుండా చేశాయి. ఈ సమస్యలతో   తీవ్రంగా మదనపడేది. మరో వైపు ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని వెంటాడాయి. ఈ పరిస్థితుల్లోఅటు వియోగం..

 

 

 ధైర్యం చెప్పేవారు కూడా లేకపోయారు. దీంతో కుటుంబం మొత్తం జీవితంపై విరక్తి పెంచుకుంది. ఆత్మహత్యే ఈ సమస్యలకు పరిష్కారమని భావించింది. సోమవారం రాత్రి మీనాక్షమ్మ, సుచిత్ర, పద్మశ్రీ, యోగశ్రీ, యోగానంద ఇంటి పైకప్పునకు ఉరి వేసుకొని బలవన్మరణం చెందారు. మంగళవారం ఉదయం ఇంట్లో నుంచి ఎవరూ బయటికి రాక పోవడం, ఇంటి తలుపు తెరుచుకోక పోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు కిటికిలో నుంచి లోపలకు చూడగా సామూహిక ఆత్మహత్యల ఉదంతం వెలుగు చూసింది. డీవైఎస్పీతోపాటు ఇతర పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను కిందకు దింపి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top