ఏదీ సౌరభం ! | edee sourabham ! | Sakshi
Sakshi News home page

ఏదీ సౌరభం !

Feb 13 2017 2:12 AM | Updated on Oct 22 2018 8:25 PM

సోలార్‌ విద్యుదుత్పత్తిలో జిల్లా చతికిలబడింది. నిర్దేశిత లక్ష్యానికి చాలాదూరంలో నిలిచిపోయింది. సబ్సిడీ ఉన్నా.. సౌర ఫలకాల కొనుగోలుకు జిల్లా ప్రజలు ఆసక్తి చూపడం లేదు. అధికారుల ప్రచార లోపమే దీనికి కారణం.

సోలార్‌ విద్యుదుత్పత్తిలో జిల్లా చతికిలబడింది. నిర్దేశిత లక్ష్యానికి చాలాదూరంలో నిలిచిపోయింది. సబ్సిడీ ఉన్నా.. సౌర ఫలకాల కొనుగోలుకు జిల్లా ప్రజలు ఆసక్తి చూపడం లేదు. అధికారుల ప్రచార లోపమే దీనికి కారణం.
 
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : సోలార్‌ విద్యుదుత్పత్తి పథకం ఆశించిన ఫలితాలు సాధించ లేకపోయింది. ఈ పథకం ద్వారా గృహాలపై ఏర్పాటు చేసుకునే సౌర ఫలకాలను 50శాతం సబ్సిడీపై సర్కారు అందిస్తున్నా.. వాటిని తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. ఈ పథకం అమలులో అధికారులూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. తగిన ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడం లేదు. ఫలితంగా లక్ష్యం నీరుగారుతోంది.  
 
21 మెగా వాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం
జిల్లాలో సోలార్‌ ద్వారా 21 మెగా వాట్ల విద్యుదుత్పత్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. ఈ మేరకు  గృహావసరాలకు, పరిశ్రమలకు , కళాశాలలకు సౌరఫలకాలు అందించాలని నిర్ణయించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 83 దరఖాస్తులు అధికారులకు అందాయి. వీటిలో సౌరఫలకాల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్న 51 మంది దరఖాస్తుదారులకు వాటిని అందించారు. ప్రస్తుతం వీటి ద్వారా సుమారు 881 కిలోవాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. అంటే ఒక మెగావాట్‌ కూడా పూర్తిగా ఉత్పత్తి కావడం లేదన్నమాట. లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇంకా సుమారు 1500 యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది.
 
కిలో వాట్‌కు రూ.85 వేల ఖర్చు
గృహావసరాల నిమిత్తం సౌరఫలకాలు ఏర్పాటు చేసుకోవాలంటే  కిలోవాట్‌ సామర్థ్యానికి రూ.85 వేలు ఖర్చవుతుంది. ఒక్కో గృహానికి ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు ఏసీలు వంటి పరికరాల వినియోగానికి రోజుకు రెండు కిలోవాట్ల (8 యూనిట్లు) కరెంట్‌ అవసరమవుతుందని విద్యుత్‌ సంస్థల అంచనా. ఈ లెక్కన ఒక్కో గృహానికి 2 కిలోవాట్ల సామర్ధ్యంతో సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి  రూ.1.70 లక్షలు ఖర్చవుతుంది. దీనిలో ప్రభుత్వం రూ.70 వేలు నెడ్‌క్యాప్‌ ద్వారా సబ్సిడీగా అందిస్తుంది. అంటే వినియోగదారులు రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు వారు వినియోగించే సుమారు 240 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా పొందవచ్చు.  మిగిలిన విద్యుత్‌ను అమ్ముకోవచ్చు.  దీనికోసం విద్యుత్‌ సంస్థలు సౌరఫలకాలు ఏర్పాటు చేసే సమయంలో బై డైరెక్షనల్‌ మీటరును అమర్చుతాయి. ఆ మీటరు ద్వారా వినియోగదారుడు వినియోగించుకోగా మిగిలిన విద్యుత్‌ గ్రిడ్‌కు చేరుతుంది. అలా చేరిన కరెంట్‌కు యూనిట్‌కు రూ.5.40 చొప్పున విద్యుత్‌ సంస్థలు వినియోగదారునికి చెల్లిస్తాయి.
 
విద్యా సంస్థలు ముందుకొచ్చాయి
సోలార్‌ విద్యుదుత్పత్తికి జిల్లాలోని వివిధ విద్యా సంస్థలు ముందుకొచ్చాయి. భీమవరం విష్ణు, ఎస్‌ఆర్‌కేఆర్‌ కళాశాలలు, తాడేపల్లిగూడెం వాసవి కళాశాల, తణుకులోని చిట్టూరి విద్యా సంస్థ, ఏలూరులో సెయింట్‌ ఆన్స్‌ కళాశాల సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేసుకున్నాయి. మరికొన్ని విద్యాసంస్థలు, పరిశ్రమలూ ఫలకాలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాయి. అయితే గృహ వినియోగదారులు ముందుకు రావడం లేదు. వారిలోనూ అవగాహన పెరగాలి.  –డి.వి.ప్రసాద్, నెడ్‌క్యాప్‌ జిల్లా మేనేజర్‌ 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement