విద్యుదాఘాతం ప్రాణం తీసింది | died with current shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతం ప్రాణం తీసింది

Aug 30 2016 10:48 PM | Updated on Aug 25 2018 6:21 PM

విద్యుదాఘాతం ప్రాణం తీసింది - Sakshi

విద్యుదాఘాతం ప్రాణం తీసింది

ఉండి: పొట్టకూటి కోసం రొయ్యల చెరువుల వద్ద పనిచేసేందుకు వచ్చిన రెండు కుటుంబాల్లో భారీ వర్షం విషాదాన్ని నింపింది.

ఉండి: పొట్టకూటి కోసం రొయ్యల చెరువుల వద్ద పనిచేసేందుకు వచ్చిన రెండు కుటుంబాల్లో భారీ వర్షం విషాదాన్ని నింపింది. చెరువులోకి దిగి నెట్‌ వైర్లు కత్తిరిస్తున్న ఇద్దరు కూలీలు విద్యుదాఘాతంతో మృతిచెందిన దుర్ఘటన ఉండిలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్ష్యుల వివరాల ప్రకారం.. ఉండిలోని గణపవరం రోడ్డులో బొండాడ డ్రెయిన్‌ ఆవలి గట్టున సాగిరాజు సాంబరాజుకు చెందిన రొయ్యల చెరువు వద్ద దేవరపల్లి మండలం బందపురం గ్రామానికి చెందిన మల్లాడి సురేష్‌ (20), ఉండి మండలం కోలమూరు అరుంధతీ కాలనీకి చెందిన సిర్రా వెంకన్న (40) కూలీలుగా పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో రొయ్యల చెరువుపై రక్షణగా ఏర్పాటు చేసిన నెట్‌వైర్లు కట్టిన ఇనుప స్తంభాలు పడిపోయాయి. ఈ సమయంలో వర్షం కురుస్తూనే ఉన్నా నెట్‌వైర్లు కత్తిరించేందుకు వీరు చెరువులోకి దిగారు.
 
నెట్‌వైర్లు కత్తిరిస్తుండగా చెరువులో ఏరియేటర్లు ఆన్‌ చేయాలి.. గట్టుపైకి వచ్చేయమని చెరువు గుమస్తా కమ్మిల శ్రీనివాసరాజు వీరిని పిలిచాడు. అయితే ఏరియేటర్లు దూరంగా ఉండటంతో తమకు ఇబ్బంది లేదని వెంకన్న, సురేష్‌ చెప్పడంతో శ్రీనివాసరావు స్టార్టర్‌ను ఆన్‌ చేశాడు. దీంతో చెరువులో ఉన్న వెంకన్న, సురేష్‌ విద్యుదాఘాతానికి గురై విలవిలా కొట్టుకున్నారు. దీనిని గుర్తించిన సురేష్‌ బంధువు శాశింశెట్టి ప్రదీప్, మిగిలిన కూలీలు కేకలు వేయడంతో శ్రీనివాసరాజు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.
 
కొద్దిసేపటికి సురేష్, వెంకన్న చెరువులో మునిగిపోయారు. శ్రీనివాసరావు, మరో వ్యక్తి చెరువులోకి దిగి వెంకన్న, సురేష్‌ను గట్టుకు చేర్చారు. అప్పటికే వీరు మృతిచెందారు. ఏరియేటర్లకు వెళ్లే తీగలు అక్కడక్కడా తెగిపోయి ఉండటంతో విద్యుదాఘాతం జరిగినట్టు భావిస్తున్నారు. సురేష్‌ భార్య అఖిల, వెంకన్న భార్య అప్పాయమ్మ కూడా ఇక్కడే కూలీలుగా పనిచేస్తున్నారు. వెంకన్నకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న ఎసై ్స ఎం.రవివర్మ, సిబ్బందితో కలిసి మంగళవారం ఉదయం ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. మతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగిస్తామని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement