breaking news
in undi
-
విద్యుదాఘాతం ప్రాణం తీసింది
ఉండి: పొట్టకూటి కోసం రొయ్యల చెరువుల వద్ద పనిచేసేందుకు వచ్చిన రెండు కుటుంబాల్లో భారీ వర్షం విషాదాన్ని నింపింది. చెరువులోకి దిగి నెట్ వైర్లు కత్తిరిస్తున్న ఇద్దరు కూలీలు విద్యుదాఘాతంతో మృతిచెందిన దుర్ఘటన ఉండిలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్ష్యుల వివరాల ప్రకారం.. ఉండిలోని గణపవరం రోడ్డులో బొండాడ డ్రెయిన్ ఆవలి గట్టున సాగిరాజు సాంబరాజుకు చెందిన రొయ్యల చెరువు వద్ద దేవరపల్లి మండలం బందపురం గ్రామానికి చెందిన మల్లాడి సురేష్ (20), ఉండి మండలం కోలమూరు అరుంధతీ కాలనీకి చెందిన సిర్రా వెంకన్న (40) కూలీలుగా పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో రొయ్యల చెరువుపై రక్షణగా ఏర్పాటు చేసిన నెట్‌వైర్లు కట్టిన ఇనుప స్తంభాలు పడిపోయాయి. ఈ సమయంలో వర్షం కురుస్తూనే ఉన్నా నెట్‌వైర్లు కత్తిరించేందుకు వీరు చెరువులోకి దిగారు. నెట్‌వైర్లు కత్తిరిస్తుండగా చెరువులో ఏరియేటర్లు ఆన్ చేయాలి.. గట్టుపైకి వచ్చేయమని చెరువు గుమస్తా కమ్మిల శ్రీనివాసరాజు వీరిని పిలిచాడు. అయితే ఏరియేటర్లు దూరంగా ఉండటంతో తమకు ఇబ్బంది లేదని వెంకన్న, సురేష్ చెప్పడంతో శ్రీనివాసరావు స్టార్టర్‌ను ఆన్ చేశాడు. దీంతో చెరువులో ఉన్న వెంకన్న, సురేష్ విద్యుదాఘాతానికి గురై విలవిలా కొట్టుకున్నారు. దీనిని గుర్తించిన సురేష్ బంధువు శాశింశెట్టి ప్రదీప్, మిగిలిన కూలీలు కేకలు వేయడంతో శ్రీనివాసరాజు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కొద్దిసేపటికి సురేష్, వెంకన్న చెరువులో మునిగిపోయారు. శ్రీనివాసరావు, మరో వ్యక్తి చెరువులోకి దిగి వెంకన్న, సురేష్‌ను గట్టుకు చేర్చారు. అప్పటికే వీరు మృతిచెందారు. ఏరియేటర్లకు వెళ్లే తీగలు అక్కడక్కడా తెగిపోయి ఉండటంతో విద్యుదాఘాతం జరిగినట్టు భావిస్తున్నారు. సురేష్ భార్య అఖిల, వెంకన్న భార్య అప్పాయమ్మ కూడా ఇక్కడే కూలీలుగా పనిచేస్తున్నారు. వెంకన్నకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న ఎసై ్స ఎం.రవివర్మ, సిబ్బందితో కలిసి మంగళవారం ఉదయం ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. మతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగిస్తామని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చవితికి ముస్తాబవుతున్న గణనాథులు
ఉండి : వచ్చే నెల 5వ తేదీన జరగనున్న వినాయ చవితికి కళాకారులు విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఉండి గణపవరం రోడ్డులో రాంబాబు అనే కళాకారుడి ఆధ్వర్యంలో వీటిని జీవం ఉట్టిపడేలా తయారు చేస్తున్నారు. సిరామిక్ క్లే, మట్టితోను పరిపూర్ణంగా సిద్ధం చేసిన విగ్రహాలకు యంత్రాల ద్వారా అందమైన పెయింట్లు స్ప్రే చేసి ముస్తాబు చేస్తున్నారు. నత్తా రామేశ్వరంలోని ఏకే ఆర్ట్స్‌లో రాజకీయ నాయకుల విగ్రహాలు తయారు చేసే తాను వినాయక చవితి, దసరా సందర్భంగా విగ్రహాలు తయారు చేస్తున్నట్టు రాంబాబు చెప్పారు. -
ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు
ఉండి : ఉండి ఇరిగేషన్ కార్యాలయాన్ని గురువారం వెలివర్రు గ్రామానికి చెందిన రైతులు, స్థానికులు ముట్టడించారు. గ్రామంలోని కుమ్మరకోడు, మాలకోడు డ్రెయిన్ల తవ్వకానికి వినియోగిస్తున్న పొక్లెయినర్‌ను ఇరిగేషన్ అధికారులు సీజ్ చేయడంతో వారు ఆందోళనకు దిగారు. వెలివర్రు గ్రామంలోని కుమ్మరకోడు, మాలకోడుల కింద దాదాపు 100 ఎకరాలు సాగులో ఉంది. అయితే వీటి తవ్వకంలో కొన్నేళ్లుగా అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. దీంతో రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీ పథకంలోనైనా పనులు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో రైతులు చందాలు వేసుకుని డ్రెయిన్ల తవ్వకాన్ని బుధవారం ప్రారంభించారు. అయితే ఉండి డీసీ చైర్మన్ తోట ఫణిబాబు తమ ఆధ్వర్యంలో డ్రెయిన్లను తవ్విస్తామని హామీ ఇచ్చి తవ్వకాలను నిలిపివేయించారు. అయితే టీడీపీ నేతల ఫిర్యాదుతో అధికారులు గురువారం ఉదయం తవ్వకానికి ఉపయోగిస్తున్న పొక్లయినర్‌ను సీజ్ చేశారు. దీంతో రైతులు, గ్రామస్తులు ఉండి ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. కాంగ్రెస్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ముదునూరి కొండరాజు, బీజేపీ నాయకుడు పొత్తూరి వెంకటేశ్వరరాజు తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.