విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కేసులు
విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కేసుల పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ ఏపీ ఎస్‌పీడీసీఎల్ విజిలెన్స్ డీఈ (చౌర్యం నివారణ విభాగం) వి. రవి హెచ్చరించారు.
– జిల్లాలో మెరుపుదాడులు.. 291 కేసులు నమోదు
– విజిలెన్స్ విభాగ ఎస్‌ఈ రవి
కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కేసుల పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ ఏపీ ఎస్‌పీడీసీఎల్ విజిలెన్స్ డీఈ (చౌర్యం నివారణ విభాగం) వి. రవి హెచ్చరించారు. గురువారం నంద్యాల డివిజన్‌లోని 8 మండలాల్లో మెరుపుదాడులు చేసి చౌర్యానికి పాల్పడుతున్న 291 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా సాయంత్రం స్థానిక విద్యుత్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన దాడులు, కేసుల వివరాలను వెల్లడించారు. తనతోపాటు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మనోహర్ రావు, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటరు, విజయవాడ జిల్లాకు చెందిన డీపీఈ విభాగ డీఈలు, ఏపీటీఎస్ సీఐలతోపాటు ఎస్‌ఈలు, ఏడీఈలు, ఏఈలు బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. చౌర్యం ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్న శిరివెల్ల, ఉయ్యాలవాడ, గోస్పాడు, ఆళ్లగడ్డ, రుద్రవరం, చాగలమర్రి, కొలిమిగుండ్ల, పాణ్యం మండలాల్లో ఈ దాడులు నిర్వహిచినట్లు చెప్పారు. ఇందులో కనెక్షన్ లేకుండా నేరుగా కొక్కెం తగిలించుకున్న 148 మందితోపాటు మీటర్ ఉండి బైపాస్ చేసే 109, కేటగిరి మార్పు–3, బల్లింగ్ అవకతవకలు–3, అదనపు లోడుగా –28 చెప్పున మొత్తం 291 కేసులు నమోదు చేసి రూ.17.67లక్షల జరిమానా విధించినట్లు వెల్లడించారు. సమావేశంలో డీపీఈ ఏఈ జగదీశ్వర రెడ్డి పాల్గొన్నారు.