బెట్టింగ్‌.. బెట్టింగ్‌

బెట్టింగ్‌.. బెట్టింగ్‌ - Sakshi


⇒ ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీల నేపథ్యంలో పందేలు

⇒ కళాశాల విద్యార్థుల మొదలు యువకుల వరకు బిజీబిజీ..




వరంగల్‌ రూరల్‌: ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీల నేపథ్యంలో బెట్టింగ్‌ రాయుళ్లు తమ పని కానిచ్చేస్తున్నారు. బెట్టింగ్‌కు ప్రక్రియను ఇక్కడ అక్కడ అని కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, స్మార్ట్‌ఫోన్లతో కానిచ్చేస్తున్నారు. గతంలో ఎక్కువగా బడాబాబులు బెట్టింగ్‌ల్లో పాల్గొనేవారు. కానీ ప్రస్తుతం కళాశాల విద్యార్థులు, యువత సైతం సరదాగా పందేలు వేసుకునే స్థాయి నుంచి బెట్టింగ్‌ స్థాయికి వెళ్లారు.


ఇంటర్‌ విద్యార్థుల నుంచి ఉన్నత చదువులు చదివే విద్యార్థులు సైతం ఈ బెట్టింగ్‌కు ఆకర్షితులవుతున్నారు. హైదరాబాద్‌ తరువాత రాష్ట్రంలో పెద్దదైన, కీలకమైన వరంగల్‌ నగరం వరంగల్‌ అర్బన్, రూరల్‌ జిల్లాలకు కేంద్రంగా ఉండడంతో పాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు కూడలిగా ఉండడంతో బెట్టింగ్‌ అడ్డాగా మారింది. బెట్టింగ్‌లు ముఖ్యంగా బార్లు, గ్రామాల్లో బెల్టు దుకాణాల వద్ద సైతం నడుస్తున్నాయి.


అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న చిన్న పట్టణాల్లో సైతం ఈ బెట్టింగ్‌ జాడ్యం కొనసాగుతోంది. ముఖ్యంగా బార్లలో పెద్ద స్క్రీన్‌ టీవీలు ఏర్పాటు చేస్తుండడంతో అక్కడే కొందరు గ్రూపులుగా ఏర్పడి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. కొందరు నేరుగా బెట్టింగ్‌ కొనసాగిస్తుండగా, మరికొందరు కోడ్‌భాషను వాడుతూ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీలు అర్థరాత్రి వరకు జరుగుతుండడంతో బార్లలో కుదరని వారు కొన్ని ప్రాంతాలను డెన్‌లుగా ఏర్పాటు చేసుకుని ఆయా గ్రూపులవారు బెట్టింగ్‌ చేస్తున్నారు.


చివరకు కార్లలో సైతం కూర్చుని నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో బెట్టింగ్‌ తంతు కొనసాగిస్తున్నారు. ఇక బెట్టింగ్‌ ప్రక్రియ రకరకాలుగా నడుస్తోంది. కొందరు గ్రూపులుగా విడిపోయి బ్యాట్స్‌మన్‌ను గ్రూపులు చేసుకుంటారు. రన్‌కు ఇంత అని, ఫోర్‌ కొడితే, సిక్స్‌ కొడితే ఇంత, వికెట్‌ పడితే ఇంత అంటూ పందేలు కాస్తున్నారు. ఇక టీంల సంగతి, మ్యాచ్‌ ఫలితం విషయంలో మాత్రం పెద్దమొత్తంలో బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. స్మార్ట్‌ ఫోన్లు ఎక్కువగా ఈ బెట్టింగ్‌లో ఉపయోగిస్తుండడంతో ఈ జాడ్యాన్ని పోలీసులు ఒక ప ట్టాన కనుక్కునే అవకాశం లేకపోవడంతో ఈ బెట్టింగ్‌ రాయుళ్లు మరింత విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top