సీమ అభివృద్ధిని విస్మరించిన బాబు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ నాయుడు రాయలసీమ అభివృద్ధిని విస్మరించి కోస్తాంధ్రా జపం చేస్తున్నారని డోన్ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, జిల్లా పరిశీలకుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు.
– అమరావతి పేరుతో తండ్రీకొడుకుల వ్యాపారం
– గోపాల్‌రెడ్డి విజయం కోసం కలసికట్టుగా పనిచేయండి
– డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, జిల్లా పరిశీలకుడు అనంత వెంకటరామిరెడ్డి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ నాయుడు రాయలసీమ అభివృద్ధిని విస్మరించి కోస్తాంధ్రా జపం చేస్తున్నారని డోన్ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, జిల్లా పరిశీలకుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నగరంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తండ్రీకొడుకులు రాజధాని పేరుతో రైతుల భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్నారు. న్యాయబద్ధంగా రాయలసీమలో రాజధాని లేదా హైకోర్టును నిర్మించాల్సి ఉంన్నా.. అధికారం కోసం అక్కడి నాయకులతో కుమ్మక్కై ప్రాంతీయ అసమానతలు వచ్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న నవరత్నాల్లో ఒక్కదానిని సీమలో నిర్మించకపోవడం అన్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒక్క సంస్థను కూడా సీమలో నిర్మించడంలేదన్నారు. ఇక్కడి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
గోపాల్‌రెడ్డి విజయం కోసం సైనికుల్లా పనిచేయండి
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వెన్నపూప గోపాల్‌రెడ్డి విజయం కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని వారు సూచించారు. గోపాల్‌రెడ్డి విజయం ద్వారా సీమకు చంద్రబాబునాయుడు చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించినట్లు అవుతుందని, ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో పార్టీ అప్పగించిన బాధ్యతను తప్పక నిర్వర్తించాలని కోరారు. కర్నూలు నగరంలో 25 వేల మంది పట్టభద్రులు ఉన్నారని, ప్రతి ఒక్కరిని పార్టీ తరపున కలసి సీఎం సీమకు చేస్తున్న అన్యాయంపై వివరించాలన్నారు.
మార్చి 9న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను కనీసం రెండుసార్లు కలవాలని, మొదటి ప్రాధాన్యత ఓటును మాత్రమే వేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు బీవై రామయ్య, కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, కర్నూలు, కోడుమూరు నియోజకవర్గాల సమన్వయ కర్తలు హఫీజ్‌ఖాన్, మురళీకృష్ణ, నగర నాయకులు రాంపుల్లాయ్య యాదవ్, నరసింహులు యాదవ్, తెర్నేకల్ సురేంద్రరరెడ్డి, సీహెచ్ మద్దయ్య, విజయకుమారి, రమణ, అనిల్‌కుమార్, గోపీనాథ్‌యాదవ్, ఫిరోజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.