కాపులకు మరో షాక్!

కాపులకు మరో షాక్! - Sakshi


కాపులందరికీ రుణాలిస్తామని హామీ ఇచ్చి అనంతరం కోతలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా సబ్సిడీ విషయంలోనూ కొర్రీలు వేసింది. సబ్సిడీ మొత్తాన్ని రుణం మంజూరు చేసే సమయంలో కాకుండా యూనిట్ స్థాపించి రెండేళ్లు నడిపిన తర్వాతే ఇవ్వాలని (బ్యాక్ ఎండ్ సబ్సిడీ) నిర్ణయించింది. ఈ మేరకు గత నెలలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వం  ఈ నిర్ణయం తీసుకుంది.



కర్నూలు: కాపులందరికీ రుణాలిస్తామని హామీ ఇచ్చి అనంతరం కోత పెట్టిన ప్రభుత్వం.. తాజాగా సబ్సిడీ విషయంలోనూ కొర్రీలు వేసింది. సబ్సిడీ మొత్తాన్ని రుణం మంజూరు చేసే సమయంలో కాకుండా యూనిట్ స్థాపించి రెండేళ్లు నడిపిన తర్వాతే ఇవ్వాలని(బ్యాక్ ఎండ్ సబ్సిడీ) నిర్ణయించింది. ఈ మేరకు గత నెల 14న స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 6వ తేదీన అన్ని జిల్లాల బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (ఈడీ)లకు కాపు కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్(ఎండీ) ఆర్.అమరేంద్రకుమార్ లేఖలు రాశారు. యూనిట్లు పెట్టుకునేందుకు ఇది దోహదపడుతుందని భావించే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఫలితంగా రుణం, సబ్సిడీ కోసం ఎదురు చూస్తున్న కాపులకు నిరాశే ఎదురుకానుంది. రిజర్వేషన్ల పేరుతో కాపులను మోసం చేసిన ప్రభుత్వం.. రుణాల విషయంలోనూ అదే పంథాను కొనసాగిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

ఎస్సీ రుణాల తరహాలోనే..

మార్చి 19న ఎస్సీ కార్పొరేషన్‌కు జారీ చేసిన జీఓ నంబర్ 32ను కాపు కార్పొరేషన్‌కూ వర్తింప చేస్తూ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు రెండు నెలల క్రితం ఇదే ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 16ను సవరిస్తూ అన్ని జిల్లాల బీసీ కార్పొరేషన్లకు లేఖలు రాయడం కాపుల్లో ఆగ్రహం కలిగిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో కాపు లబ్ధిదారులకు దీనిని వర్తింపజేయనున్నారు. దీని ప్రకారం లబ్ధిదారులకు ముందస్తుగా బ్యాంకు రుణం నగదుగా అందజేస్తే, దాని ఆధారంగా యూనిట్‌ను ప్రారంభించాలి. ఈ యూనిట్‌ను బీసీ కార్పొరేషన్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. వారు తనిఖీ చేసిన సమయంలో యూనిట్ సక్రమంగా నడుస్తుందా? లేదా? అనే విషయాలను గుర్తించి జీయో ట్యాగింగ్ ద్వారా ఉన్నతాధికారులకు ఫొటోలను పంపిస్తారు. యూనిట్ సక్రమంగా కొనసాగుతుంటే.. రెండు సంవత్సరాల తర్వాత సబ్సిడీని విడుదల చేయనున్నారు. ఈ నిబంధన వల్ల బ్యాంకులు రుణాలు ఇచ్చేది లేదు.. తాము యూనిట్లు ప్రారంభించేది లేదంటూ లబ్ధిదారులు వాపోతున్నారు.

 

ఊరించి.. ఉసూరుమనిపించారు..


రాష్ట్ర వ్యాప్తంగా 2015-16 ఆర్థిక సంవత్సరంలో 1.05 లక్షల మంది కాపులకు రుణాలు అందించాలన్న లక్ష్యం ఆర్థిక సంవత్సరం ముగిసినా నేరవేరలేదు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో 3,53,479 మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కేవలం 30,822 మంది దరఖాస్తులను మాత్రమే ఎంపిక చేశారు. తీరా వీరిలో సగం మందికి కూడా ఇంకా సబ్సిడీ విడుదల కాలేదు. కాపు కార్పొరేషన్‌లో అమలు చేయనున్న బ్యాక్ అండ్ సబ్సిడీ సెగ ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిపోయిన (స్పిల్ ఓవర్) రుణాలకు తగలనుంది. ఇప్పటి వరకు మంజూరైన రుణాలను మినహాయిస్తే 2016-17 ఆర్థిక సంవత్సరంలో మంజూరయ్యే రుణాలతో పాటు ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఖాతా నంబర్లు సమర్పించడంలో, కవరింగ్ లెటర్, ఈ పేమెంట్ సెక్షన్‌లో పెండింగ్‌లో ఉన్న వాటికి కూడా ఈ విధానం అమలు కానుంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top